అపరిచితులు

by Ravi |
అపరిచితులు
X

లేలేత ఉషః కిరణాలు

నేలతల్లిని స్పృశించక ముందే

చీకటి తెరలు విచ్చుకోక ముందే

పక్క దులిపి, పనిలో కురికి

బాక్సుల్లో కమర్చుకున్న

వేడి పొగల అన్నాన్ని, ఇడ్లీలని

లంచ్ బ్యాగ్‌లో సర్దుకుని బతుకు బండి

నడపటానికి నేను గుమ్మం దాటే వేళ,

రాత్రంతా రెప్పమూయని అలసటని భుజాన

వేసుకున్న అతని అడుగు.. గుమ్మం లోపలికి

దినరాజు అలసి పడమటి కొండ కెక్కేవేళ,

ఆకాశం కాటుక రంగును పులుముకుంటుంటే

నాలో చీకటిని నాతో మోస్తూ అతనికి ఎదురు వస్తూ

గుమ్మం లోపలికి నేను, అతని అడుగు బైటకి,

ఆ గుమ్మం మా నిర్వికార యాంత్రికతకు మౌన సాక్షి!

అతన్ని చూసి పలకరింపుగా విచ్చుకోబోతున్న నా పెదవులు

ఆ ముభావానికి టక్కున ముడుచుకుపోతాయి

ఒకదానినొకటి చూసుకోని కళ్ళల్లా, పగలు రాత్రుల్లా

సూర్య చంద్రుల్లా

కలపని సమయాలు, కలవని భావాలతో

రోజూ చూస్తున్నా కొత్తగా అనిపించే పాత ముఖాలతో

ఒకే ఆకాశంలో మేము!

డా. చెంగల్వ రామలక్ష్మి

Advertisement

Next Story

Most Viewed