AP Assembly: అసెంబ్లీకి రానన్న జగన్.. దుమ్మెత్తి పోస్తున్న టీడీపీ నేతలు

by Y.Nagarani |
AP Assembly: అసెంబ్లీకి రానన్న జగన్.. దుమ్మెత్తి పోస్తున్న టీడీపీ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) జరగనున్నాయి. ఈ క్రమంలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనపుడు అసెంబ్లీకి రాబోనని తేల్చి చెప్పారు జగన్. ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇంక పదవులెందుకని షర్మిల ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) కూడా ఇదే విషయంపై విమర్శలు చేశారు. వైసీపీ (Ysrcp) పనైపోయిందన్నారు గంటా శ్రీనివాసరావు. ఆ పార్టీకి సమన్వయకర్తలు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై జగన్ చెప్పిన కారణం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికై.. అసెంబ్లీ సమావేశాలకు రానని చెప్పడం వెనుక కారణమేంటో వాళ్లకే తెలియాలన్నారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేవారిపై కూడా ఉక్కుపాదం మోపుతామన్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (MLC Bhumireddy Ram Gopal Reddy) సైతం ఈ విషయంపై స్పందించారు. ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేయాలో జగన్ కు తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదన్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జగన్ ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని నిలదీశారు. శుక్రవారం మంగళగిరి (Mangalagiri) టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమిరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం ఆ పార్టీకే సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్ కు ఇక రాజకీయ పార్టీ ఎందుకని ప్రశ్నించారు.

Advertisement

Next Story