వారం వారం మంచి పద్యం: ధరణి

by Ravi |   ( Updated:2023-06-04 18:30:42.0  )
వారం వారం మంచి పద్యం: ధరణి
X

మంద్రంగా ప్రవహించే నీరు ఉలిక్కిపడింది. నది నవ్వింది. తీరప్రాంత చెట్లు చెవులు రిక్కించి వినసాగాయి. పూలు- పత్రి పరవశమున మైమరచాయి. సాధు జంతువులు మరిపెమున గాలిలో తేలియాడాయి. నీళ్ళోసుకున్నట్లు ప్రకృతి లేటుగా తయారయింది. సకల జీవులను సమీరం స్వాంతన పరిచింది. ధరణి దారులు పరిచింది. ఆకసం రంగులు చిలికింది. పక్షులు సీతాకోక చిలకలయ్యాయి. జరిగిన మార్పును శబరి పసిగట్టింది. రాముడు వస్తున్నాడని చేతికర్రను సైతం మరచి ముందుకేసింది. నాలుగడుగులు వేసిందో లేదో నడవలేక దారి పక్కన బండపై కూలబడింది. కళ్ళు మూసి రాముని కనసాగింది.

‘శబరీ’ మృదుమధురంగా పిలుపు వినపడింది. నాయనా వచ్చావా కళ్ళు తెరుస్తూ అంది. అతని ఆసరాలో నిలబడింది. ఆమెకు అతడు చేతికర్ర అయినడిచాడు. వారివురు ఆత్మీయంగా నాలుగడుగులు వేసి గుడిసె ముందు ఆగారు. ఎత్తయిన కర్రదుంగపై రాముడు ఆసీనుడయ్యాడు. ఎదురుగా శబరి కూర్చుంది. తనయుడి ఆకలిని తల్లి తెలిసికొన్నట్లు, ఆమె రాముని ఆకలి గ్రహించి దాచిఉంచిన పళ్ళను అందించింది. ఒక్కోక్కటిగా రాముడు నమలసాగాడు. అతని అంతరంగం కనిపెట్టిన దానిలా శబరి ఇలా అంది. ‘సీతమ్మ దూరమైందని దు:ఖిస్తున్నావా’ నీరు నిండిన కళ్ళతో చూసాడు. శబరి మసక మసగ్గా కనిపించింది. ‘రామ, రావణ యుద్దమనే విపత్తులో మీరిద్దరూ చిక్కుకున్నారు. మీ ఇద్దరిదీ సమానవేదన. నీవు నీవారి మధ్య ఉన్నావు. అది కొంత ఉపశమనం. ఆమె పరాయి వారి మధ్య భయానక మానసిక స్థితిలో ఉంది. అది భయంకరం. ఆమెను విడిపించాల్సిన అవకాశం, అవసరం నీకుంది. అప్పుడే నీకు శాంతి, రక్ష చేకూరుతాయి అన్నది శబరి. ‘ఆమె తనకు తానుగా తరలిరాగల ధీర. విడిపించాల్సిన బాధ్యత నాదేనంటావా’ అడిగాడు రాముడు. 'సీతను ఎత్తుకెళ్ళిన వాడిని చంపడం నీ కర్తవ్యం. సమస్తశక్తులు కలిగిన సీత సంఘ నిర్దేశిత కట్టుబాటుకు లోబడి నీరాక కోసం చూస్తోంది. వెళ్ళు, తిరుగుమార్గంలో సీతాసమేతుడవయి నా వద్దకు రా' అంటూ ప్రాధేయపడింది. స్క్రిప్ట్ చదివిన బుంగి ఆశ్చర్యపోయాడు.

విధి విధానము కల్పించు విషమ స్థితిని

కలత చెందక మనుషులు కరుణ కలిగి

దాటవలయును నికషలు ధరణిలోన

కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము

డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Advertisement

Next Story

Most Viewed