బురఖాలో కన్నీళ్లు ‘పహెచాన్’

by Ravi |   ( Updated:2024-08-11 19:00:43.0  )
బురఖాలో కన్నీళ్లు ‘పహెచాన్’
X

ముస్లిం మహిళల నల్లటి బురఖాల్లో కన్నీళ్లు దాగుంటాయి. అవి బైటికి కనిపించకుండా అక్కడే ఆవిరైపోతుంటాయి. ఆ కన్నీళ్లను గీతాంజలి ‘పహెచాన్’ కథల్లో వెలికి తీసి లోకానికి చూపించారు. హైదరాబాదీ ముస్లిం మహిళలు ఉనికి కోసం, మనుగడ కోసం చేసే పోరాటానికి రచయిత్రి ఒక అద్దంపడతారు. వారు మాట్లాడే దక్కనీ ఉర్దూ, తెలుగు భాషలో కలగలిసి ఏర్పడిన ఒక తమాషా అయిన భాష ఈ కథల్లో మనకు కనిపిస్తుంది.

అమ్మకు ఆపరేషన్

‘‘నాతోని గాదు. నాకింక శక్తి లేదు. ఆప్రేషన్ చేపించుకుంటా’’ అంటూ తన ముంగట ఉన్న తొమ్మిది మంది పిల్లల్ని చూపిస్తూ పరేషాన్ అయిపోతోంది నూరున్నిసా బేగం. ‘‘సువ్వర్ కే ఔరత్.’’ అంటూ చెంపలు పగలగొట్టాడు సులేమాన్. నూరున్నిసాకు మళ్లీ ఔరత్ బచ్చీ పుట్టింది. ఎవరికీ తెలియకుండా డాక్టరమ్మను బతిమాలి తల్లికి కూతురే ఆపరేషన్ చేయించేసింది. ఎక్కువ మందిని కనలేక స్త్రీలు పడే అవస్థల సజీవ రూపం ‘‘ఉనో నహీ మాన్తే’’

మరద్ బచ్చీ పుట్టలేదని వేధింపులు

"ఆడ పిల్లలను కనుడు బంద్ జేసి ఇక మగ పిల్లాడిని కను" అంటూ రోజూ నఫీజ్‌ను అత్త సతాయిస్తుంటుంది. ‘‘అమ్మీ నఫీజ్ కో బచ్చే నైహోతే. ఉన్ కో తీన్ సాల్ పహలే బచ్చే నైహోనేకా ఆప్రేషన్ కరవాయా మైనే’’ అంటాడు అర్ఫాజ్. ‘‘ఇదిగో సూడు. నాకొక మన్మడు గావాలె. ఏ సైతాన్ కో ఘర్ సే నికాల్ దో. నీ కింకో మంచి పిల్లని జూసి పెండ్లి జేసిస్తా. నైతో..మై ఏ జహర్(విషం) పీలుంగీ’’ అని బెదిరిస్తుంది. అర్ఫాజ్‌కు మరో నిఖా అయిన తెల్లారే నఫీజ్ తన ఇద్దరు ఆడ బిడ్డలతో బావిలో దూకి శవమై తేలింది. ‘ఔలాద్’ మరొక విషాదాంతం.

తాగుబోతుకు గుణపాఠం

జహంగీర్ బీకి ఆరుగురు పిల్లలు. ఆరో బిడ్డను ఛే నంబర్ అనే పిలుస్తుంది. భర్త షోహార్ తాగుడుకు బానిసవుతాడు. ఉన్నట్టుండి మాయమవుతాడు. జహంగీరాబీ బిస్కెట్ కంపెనీల చేస్తూ పిల్లల్ని సాకుతుంటుంది. షాహార్ తో విసుగెత్తి ‘ఖులా’ ఇచ్చేస్తుంది. ‘‘బీరులో ఏముంది ఆడవాళ్లు తాగే కూల్ డ్రింక్’’ అంటూ రెచ్చగొడతారు. ఆ వ్యసనం బీర్‌తో ఆగదు. ‘బీర్ ఈజ్ ది బిగినింగ్ స్టెప్’ అని విజ్ఞులు ఊరికే అనలేదు.

సౌదీ అరేబియా సేఠ్ మోసాలు

పదిహేనేళ్ల బదరియాను పాషా ఈడ్చి ఒక్క తన్ను తన్నడంతో వెల్లకిలా పడిపోయింది. ‘‘అమ్మీ’’ అని అరిచింది. ‘‘ఛుప్ కర్.. మార్ దేతుమ్’’ అంటూ ఆమె వెంట్రుకలు పట్టుకుని లేపి గోడకు అదిమాడు. ఇంకొక చేతితో కుతికె పట్టుకున్నాడు. నలభై ఏళ్లున్న సేఠ్ చేతుల్లో రెండు గంటలు నలిగిపోయింది. పాషా రాత్రి పూట బదరియాను ఎక్కడెక్కడికో తీసుకెళతాడు. రాత్రంతా ఒకరి తరువాత ఒకరు. పదిహేనేళ్లున్న బదరియా పైన అరవై ఏళ్లున్న షేక్ దౌర్జన్యం చేస్తూనే ఉన్నాడు. బదరియాను సౌదీ షేక్ రెండేళ్లు వాడుకుని బ్రోకర్‌కు అప్పగించి వెళ్లి‌పోయాడు. ఆ బ్రోకర్ ఆమెను హైదరాబాద్ తీసుకెళితే, తప్పించుకుని ఇంటికి పారిపోతుంది. బదరియా గర్భవతి. సౌదీసేఠ్‌లు, బ్రోకర్ల చేతిలో మోస పోతున్న హైదరాబాదీ పేద ముస్లిం బాలికల విషాద గాధలకు సజీవ రూపం ‘‘కాలీ బదరియా!’’

పశ్చాత్తాపం

అఫ్జల్, షంషాద్ బేగం పిల్లలతో కలిసి పహాడీ షరీఫ్ దర్గాకెళతారు. అక్కడ ఊడుస్తూ బురఖాలో ఉన్న అక్తర్ ‘‘దేఖ్ తేరే బచ్చీ. తేరే బీవీ కైసే సడ్కోం పర్ భీక్ మాంగ్ రై దేఖ్’’ అంటూ అఫ్జల్ పైన విరుచుకుపడింది. వికలాంగురాలైన ఇరవై ఏళ్ల కూతురు. దాంతో అప్జల్‌కు సంతోషం ఆవిరైపోయింది. హజ్ యాత్రకు వెళతాడు. అరేబియాలో మక్కా దగ్గర ‘జబల్ ఆల్ రహ్మా’ క్షమా పర్వతంపైన సైతాన్‌ను కొట్టే చోటికి వెళ్లి, వారిస్తున్నా వినకుండా రాళ్ల దెబ్బలు తిని మరణిస్తాడు. పశ్చాత్తాపంతో అప్జల్ ప్రాణాలు వదలడంతో ‘సైతాన్’ కథ ముగుస్తుంది.

ఇంటర్‌నెట్‌లో నిఖా !

‘‘ఐసా కైసా కరేంగి షాది?దుల్హా లేకుండా? దుల్మాను సూడకుండా? దునియాలో ఏడనైనా గిట్లుందా? ఈ రిష్తా ఏమొద్దు’’ అంటుంది గౌసియా బేగం భర్త జుల్ఫికర్‌తో. ఖాజీ భాయ్‌ని నమ్మి తన ఇద్దరు కూతుర్లకు ఓమన్‌లోని సేఠ్‌ల పిల్లలకు ఇచ్చి నిఖా జరిపేస్తారు. అక్కడికి వెళ్లాక కానీ వారిద్దరూ మూర్చ వ్యాధిగ్రస్తులని తెలియదు. ప్రశ్నిస్తే నరకాన్ని చూపిస్తుంది అత్త. ఒక స్వచ్ఛంద సేవకురాలి ద్వారా బైటపడి తల్లిదండ్రుల వద్దకు హైదరాబాద్ చేరతారు. ఆడ పిల్లల్ని అరబ్ షేక్‌లకు ఇచ్చి పెళ్లి చేయాలనే పేద ముస్లిం తల్లిదండ్రుల ఆశ ఎటు దారి తీస్తుందో చెప్పే కథ ‘సబా-సవేరా’

మధ్య యుగాల వధ్యశిల

‘‘బచావ్.. తుమ్హారా పాప్ పడ్తీ హు! ముఝే చోడ్ దేవ్..!’’తలకు కాషాయ తువ్వాలు చుట్టుకొని తన మీదకు ఎగబడుతున్న మగోల్లను దూరంగా తోస్కుంట ఏడుస్త, కేకలు పెడుతున్నది జహీరా. ఒకడు చెంప మీద కొట్టిండు. ఒకడు గుండెల మీద గుద్దిండు. ఒకడు బూతులు తిడ్త తన మీదకెల్లి లేసి కాలితో డొక్కల తన్నిండు. కాల్ల మద్దెల కెల్లి రక్తం కార్తనే ఉంది. ఒకల ఎనక ఒకలు పది మంది. రెండు కాళ్ల మధ్య నిప్పుల కుంపటి! ‘‘సాలీ మర్గయా! చోడ్ దేవ్..’’ మల్ల డొక్కల ఒక తన్ను. అమ్మీ తప్ప అబ్బా జాన్, ఛోటా భాయ్, బహెన్ నౌషీన్ అందర్నీ చంపేసిన్రు. ‘‘నై అమ్మీ! మై కోర్టు మే ఉన్ సబ్ కుత్తోంకో పహ్ చానూంగీ! జైల్ భేజూంగీ!’’ జహీరాకు ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.

సాక్ష్యం చెబితే మల్ల మిమ్ముల్ని గూడ మిగులనియ్యమన్నరు. ఎప్పటి తీరే టౌన్ల పూరీ జగన్నాథ రథయాత్ర హిందువులతోనె కల్సిపోయారు. మర్సటి దినం అక్బార్లల్ల ముసల్ మాన్లంత యాత్రల హిందువుల తోని చిందులు వేస్తున్న తస్వీర్ వచ్చింది. వేలాది మంది పాల్గొన్న రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో జహీరా సహా పది మంది ముస్లింలు చనిపోయిన్రు. ‘పహెచాన్’ కథ ఎంత విషాదం! కళ్ల ముందు తన వాళ్లనందరినీ చంపేసినా సాక్ష్యం చెప్పలేని నిస్సహాయత! గుజరాత్ మధ్య యుగాల వధ్య శిల. హైదరాబాదీ ముస్లిం మహిళల లెక్కలేనన్ని విషాదాలను వాళ్ల మాటల్లోనే గీతాంజలి ‘పహెచాన్’లోని 17 కథల్లో దృశ్య మానం చేశారు. ముస్లిమేతర మహిళ అయినప్పటికీ గీతాంజలి వాళ్లతో అంతగా కలగలిసిపోయి, వాళ్ల జీవితాలనే కాదు, వాళ్ల వేదనలను వాళ్ల పలుకుబడుల్లోనే చూపించడం అంత తేలిక కాదు.

పుస్తకం : పహెచాన్

రచయిత : గీతాంజలి(డాక్టర్ భారతి)

పేజీలు : 220

వెల : 200.00

పుస్తకాలకు :

గీతాంజలి – 88977 91964

సమీక్ష

రాఘవ

94932 26180

Advertisement

Next Story

Most Viewed