- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖిలేశ్వర్ ‘జీవించిన క్షణాలు’
‘‘దశాబ్దాల జీవితమంతా నిమిషాల మీదుగా దృశ్యమానం కావడం..నడిచే కాలమంతా చేతివేళ్ళ సందుల్లోంచి నీరై కారిపోవడం.. ఈ నేలకు సహజీవులకు అసలు పనికొచ్చామా లేదా అనే ప్రశ్నను ఎదుర్కోవడం’’ అంటూ నిఖిలేశ్వర్ అరవై ఎనిమిదేళ్ళ కవితాయానంలో, వెనక్కి తిరిగి చూసుకుని, తనను తాను తడుముకుని ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఎనభై ఏడేళ్ళ నిఖిలేశ్వర్ ఇప్పటికీ కవిత్వాన్ని శ్వాసిస్తూనే ఉంటారు. కవిత్వం రాయకపోతే శ్వాస ఆగిపోయినట్టే భావిస్తారు. అందుకనే కవిత్వం రాసిన కాలాన్ని ‘జీవించిన క్షణాలు’గా భావించి తాజాగా ఈ కవితా సంకలనాన్ని తెచ్చారు. ఇందులో గడిచిన ఆరు వసంతాల కవితాయాన దృశ్యాలున్నాయి. కొన్ని అనుసృజనలున్నాయి.
‘నేనొక ఒంటరిగా, అందరిలో అందరిగా అవ్యక్తంగా నిలిచిన అనుభూతిని’ అంటూ నిఖిలేశ్వర్ కవితాభివ్యక్తి తన వ్యక్తిగత అనుభూతితో పాటు, ఈ దేశపు రాజకీయ సాంస్కృతిక పరిణామాల్లో ఎలా మమేకమైందో ఈ సంకలనంలో చూస్తాం. ‘ఇది ఒక వైభవోజ్వల మహాయుగమా? ‘వల్లకాటికి’ దారితీస్తున్న అధ్వాన శకమా?’ అంటూ ప్రశ్నను సంధించకపోతే తన కవితా మథనానికి అర్థం లేదు. ‘విశ్వగురువు ప్రవచనాలతో దేశ సంపదంతా కొందరికే కైంకర్యం’ అంటూ కుండబద్దలు కొడతారు. ‘శాసిస్తున్న వాడు సర్వాంతర్యామిగా నిఘా నేత్రాలతో నిర్బంధ నివాసాలు నిర్మిస్తున్నాడు’ అంటూ వర్తమానానికి అద్దం పడతారు. గ్రీకు పురాణాల్లో ఎగిరే రెక్కల గర్రం ‘పెగాసెస్’ మన దేశంలో మరో సంచలనం.
గోప్యతను కాలరాసిన రాజ్యం
ఇజ్రాయిల్ కంపెనీ తయారు చేసిన పెగాసెస్ వైరస్‌ను భారతదేశంలో కూడా ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, రచయితలు, అసమ్మతి వాదుల పైన ప్రయోగించి ‘ప్రైవసీ’ అనే రాజ్యాంగ హక్కును పాలకులు ఎలా కాలరాశారో జగద్వితం. మేధావులు అత్యున్నత న్యాయస్థానాల తలుపుతట్టినా, ఈ దేశంలో న్యాయదేవత నిస్సహాయంగా పాపం దివాంధురాలైపోయింది . ‘పెగాసెస్ నీలి నీడల ముద్రతో పౌరుల కదలికలన్నీ బాహాటమే. మీట నొక్కితే చాలు నాగరికులంతా పాలకుల లాప్ టాప్ తెరలపై నగ్నంగా.. నిస్సహాయంగా..’ అంటూ దృశ్యమానం చేశారు. స్టాన్ స్వామి, సాయిబాబాల మరణాలు రాజ్యం చేసిన హత్యలు. ‘ఫాదర్ స్టాన్ ‘జన’ స్వామి జనగొంతులుగా నినదించేవారంతా మృత్యు గుయ్యారాల్లో ఇంకెంత కాలం నిర్బంధిస్తారని’ అంటూ ప్రశ్నిస్తారు. ‘పెత్తనాన్ని పల్లెత్తు మాటన్నా, 124 ఏ రాజద్రోహ నేరమే’ అంటూ ప్రశ్నను ఎలా పాతరేశారో చూపిస్తారు.
వైద్య వ్యాపారంపై అంకుశం
‘యథేచ్చగా తిరుగాడే తోడేళ్ల ముందు మోకరిల్లుతున్న ప్రజాస్వామ్యం’ అంటూ ఈ వ్యవస్థను చౌరస్తాలో ప్రజల ముందు నగ్నంగా నిలబెడతారు. ‘కులస్వామ్యం జడలు విప్పి మత మౌఢ్యంతో అట్టహాసంగా చిందులేస్తున్న అతిపెద్ద ప్రజాస్వామ్యం’ అంటూ ఈ బూటకాన్ని అపహాస్యం చేస్తారు. మానవాళిని ముప్పతిప్పలు పెట్టిన కరోనా కాలం గురించి నాలుగు కవితలు రాశారు. ‘ఇది కరోనా వార్. మూడవ ప్రపంచ యుద్ధానికి బదులు కోల్డ్ వార్ ఆడే దేశాలన్నీ తరతమ బేధాలు మరచి బెంబేలెత్తి వైరస్ విశ్వరూపంలో తలమునకలైన యుద్ధం’ అంటారు. ‘ఆకలి, అలసట, తీరని దాహానికి వలస జీవుల దిక్కులేని చావులెన్నో’ అంటూ ఆవేదన చెందుతారు. ‘ఈ కరోనా చావుల డప్పుల మోతతో శవాలపై లక్షలు ఏరుతున్న వైద్యవ్యాపారులపై అంకుశమేది?’ అంటూ పాలకుల్ని ప్రశ్నిస్తారు.
క్షతగాత్రుల హాహాకారం
‘నన్ను బహిష్కరించని దేశమనేది లేదు. తిరిగి వెళ్ళాలన్నా ఏ దేశమూ లేదు. ఇక ఆగిపోతే ..మరణమే ! !’ అంటూ పాలస్తీనీయుల నిస్సహాయతను నజ్వాన్ దర్వీజ్ కవితకు అను సృజనలో పలుకుతారు. ‘పుట్టి పెరిగిన ఈ నేల నాది కాదంటే, కడుపుమండి ఎదురు తిరిగితే ‘టెర్రరిస్టు’ ముద్రనా’ అంటూ పాలస్తీనా ప్రజల తరపున సాయుధ గానం చేస్తారు. ‘క్షతగాత్రుల హాహాకారాల నడుమ నిస్సహాయంగా లక్షలాదిమంది కాందిశీకులుగా దీనంగా తరలిపోతున్న’ దృశ్యాన్ని ఉక్రెయిన్‌లో చూడమంటారు.
‘ఇంతకూ నేను ఈ దేహానికి బానిసనా? యాతనకు అతీతం కాలేని ఎముకల గూడునా? కాలం మూడితే క్షణాల్లో మనిషి ఒక జ్ఞాపకంగా మారిపోతాడనే తాత్వికుల హెచ్చరికలను ఎలా మరిచిపోగలను?’ అంటూ తన కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటారు. ‘‘ఆరుపదులు దాటాక నిలుచుని ఫ్యాంట్ వేసుకోకండి’’ అంటూ నిఖిలేశ్వర్ ఫోన్‌లో నవ్వుతూ స్వీయానుభవంతో ఇచ్చిన సలహా ప్యాంటు వేసుకుంటున్నప్పుడల్లా ఎలా మర్చిపోగలను?
నమ్మిన దారిలో నడిచిన నడకలు
నిఖిలేశ్వర్ జీవిత సహచరి యామిని మృతితో చేసిన ‘మృత్యు ఛాయలో సంభాషణ’ కదిలిస్తుంది, కంటతడి పెట్టిస్తుంది. ‘ఎందుకీ నరకయాతన? దేహంతో కృశించి కట్టెల్లో కాలిపోవడానికేనా?’ అంటూ ఎంత భౌతిక వాదైనా తీవ్ర వేదనలో ఇలా వైరాగ్యంతో పలకడం తప్పదేమో! ‘శేషజీవితాన్ని కూడదీసుకోవడమేగా ఇక మిగిలింది. జీవితేచ్ఛతో తహతహలాడిన దేహ యాత్రలో ఎన్నెన్ని జ్ఞాపకాలు. నిండుగా జీవించిన క్షణాలలో అనుభవించిన యుగాల వెంట అనివార్యమైన అంతిమ ప్రస్థానం ! !’ నిఖిలేశ్వర్, యామిని కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఎన్ని యుద్ధాలు! ఈ ఆరున్నర దశాబ్దాలుగా కలిసి అన్యోన్యంగా సాగిన వారి జీవన యానంలో ఎన్ని జ్ఞాపకాలు! దుర్మార్గాన్ని ఎదిరించి నమ్మిన దారిలో నడిచిన ఎన్ని నడకలు! అన్నీ కళ్ల ముందు కదలాడుతుంటే ఈ శేషజీవితంలో వాటన్నిటినీ తలుచుకుని బాధపడకుండా ఎలా ఉండగలుగుతారు!?
తవ్వితీసిన జ్ఞాపకాల కొండ
భావ కవిత్వపు ఆత్మానుభూతి నుంచి మొదలైన యాదవరెడ్డి కవితాయానం, కాలంతోపాటు ఎదిగి లోకానుభూతితో నిఖిలేశ్వర్‌గా స్థిరపడింది. మండుతున్న తరమయ్యారు. నాలుగున్నర శతాబ్దాల మహానగరాన్ని చూపించారు. ఎవరీ ప్రజాశత్రువంటూ ప్రశ్నించారు. జ్ఞాపకాల కొండను తవ్వి తీశారు. ఖండాంతరాల మీదుగా తన ఆలోచనలను ప్రసరింపజేశారు. యుగస్వరాన్ని వినిపించారు. అగ్నిని శ్వాసించారు. ఇప్పుడీ జీవించిన క్షణాలను తలబోసుకుంటున్నారు.
నిఖిలేశ్వర్ కవిత్వంలో తుఫానులు, ఉప్పెనలుండవు, ఎగిసిపడుతున్న కెరటాలుండవు. ఆ కవిత్వం జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. చెవి ఒగ్గి వినాలే కానీ, ఈ జీవనదిలో జీవన అలల సవ్వడులుంటాయి, ఆనంద ప్రవాహ గానమూ ఉంటుంది. పైకి కనిపించవు కానీ, ఈ జీవనదిలో దుర్మార్గాన్ని ముంచేసే సుడులు కూడా ఉంటాయి. సాంద్రత ఉండే సముద్రంలో కంటే నదిలో ఈదడం చాలా కష్టం. అందులో నిఖిలేశ్వర్‌ది కవితా జీవనది.
పుస్తకం: జీవించిన క్షణాలు
కవి, రచయిత : నిఖిలేశ్వర్
మొబైల్ : 91778 81201
పేజీలు : 100, వెల : రూ. 150
ప్రచురణ: తెలంగాణ పబ్లికేషన్స్
ప్రతులకు : 86399 72160
సమీక్షకులు
-రాఘవ,
94932 26180