పుస్తక సమీక్ష: మణిపూసల్లో రామాయణం

by Ravi |   ( Updated:2023-08-20 19:00:32.0  )
పుస్తక సమీక్ష: మణిపూసల్లో రామాయణం
X

మన తెలుగునాట రామాయణం తెలియని వారుండరు. రామాయణం నిత్య నూతన గ్రంథం. ఆదికావ్యమైన రామాయణాన్ని ఎందరో తెలుగు కవులు ఇంతకు ముందే విభిన్న కవితా ప్రక్రియల్లో రాశారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. వాల్మీకి రామాయణంలో పలు ఘట్టాలను గానీ మొత్తం మూలాంశాలను గానీ తీసుకొని పద్య, ద్విపద, వచన, గేయ, చంపు వంటి పద్దతులలో రచించి, సాహిత్య లోకానికి సమర్పించారు. ఇవన్నీ పాఠకుల ఆదరణ చూరగొన్నవే. అయితే ప్రాచీన సాహిత్య ప్రక్రియల్లోనే కాకుండా, ఆధునిక కవితా ప్రక్రియల్లో కూడా రామాయణం, భారతం, భగవద్గీత లాంటి మహా గ్రంథాలతోపాటు మరికొన్ని పురాణేతిహాసాలను కొందరు కవిపండితులు రాయడం గమనార్హం.

పూర్వకవుల సంప్రదాయాన్ని పాటించి..

ఇటీవల తెలుగు సాహిత్య వినీలాకాశంలో ప్రకాశిస్తూ, ఆబాలగోపాలాన్ని అలరిస్తూ, బహుళ జనాదరణ పొందిన అత్యాధునిక ప్రక్రియల్లో వడిచర్ల సత్యం సృష్టించిన 'మణిపూసలు' ఒకటి. ఈ లఘురూప కవిత్వం మాత్రాఛందస్సు పరిమితులను, అంత్యానుప్రాస నియమాలను కలిగి, గాన యోగ్యంగా ఉండటం వలన లబ్ధప్రతిష్టులైన కవులెందరో ఆదరిస్తున్నారు. సార్వజనీనమైన ఈ ప్రక్రియలో అనేక మంది కొత్తవాళ్ళు కూడా అనుసరిస్తూ, విరివిగా రచనలు చేసి, కవులుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలో ‘మణిపూసల ఆశుకవి’గా పేరుగాంచిన ప్రముఖకవి, రచయిత, కళాకారుడు, తెలుగు పండితుడు టి. ఆశీర్వాదం రామాయణ చరిత్రను మణిపూసల్లో రాయడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు.

రామాయణాన్ని మణిపూసల కవితా ప్రక్రియలో రచించి, నేటితరం వారికి ఆశీర్వాదం కవి ఆదర్శనీయుడైనాడు. పండితులు, పామరులు మెచ్చుకునేలా ఆశీర్వాదం రచించిన ‘మణిపూసల రామాయణం’ జనరంజకంగా సాగింది. సాహితీ వేత్తలు, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నది. మూలగ్రంథంలోని భావానికి భంగం కలుగకుండా, సరళ సుందరమైన నడకలో రామకథను తీర్చిదిద్దిన విధానం శ్లాఘనీయం. రామాయణంలోని మొత్తం ఆరు కాండలను 1400 మణిపూసలలో కూర్చి ఆ శ్రీరామచంద్ర ప్రభువుకే అంకితం చేశారు రచయిత. బాలకాండ కంటె ముందు రాసిన ఎనిమిది మణిపూసలతో ప్రార్థనా గీతం ఉంది. శ్రీ కారంతో ప్రారంభించి, పూర్వకవుల సత్సాంప్రదాయాన్ని పాటించాడు.

రామాయణం మళ్లీ చదివేలా...

శ్రీ రామ చంద్రమూర్తి/కలిగెను నా మది నార్తి/ నీ చరితం మరల వ్రాసి/ హెచ్చించెద నీ కీర్తి! అంటూ ఆర్ధ హృదయంతో రామచంద్రుని మూర్తిమత్వాన్ని కీర్తించడానికి ఇది రాసినట్టు చెప్పుకున్నారు. నీది పుణ్య చరితము/ ఎపుడు విన్న నవకము/ మరల నేను చెప్పుటకు/ చేయుచుంటి ధైర్యము! రామాయణము ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడు విన్నా నవీనంగానే ఉంటుందని, అందుకే నా వంతుగా మళ్ళీ చెప్పుటకు ధైర్యం చేస్తున్నానని చెప్పడం కొత్తగా ఉంది. సద్గుణాల రాముడు/ సకలకళా నిపుణుడు/ లోకమందు ఒకే ఒకడు/ అతడే శ్రీరాముడు! అంటూ మొత్తం శ్రీరాముని గుణగణాలను ఒక్క మణిపూసలో ఎంతో ఔచిత్యంతో ఆవిష్కరించిన తీరు అద్భుతం. అలాగే సీత సౌందర్యాన్ని వర్ణిస్తూ అల్లిన ఈ మణిపూసను చూస్తే రససౌదర్యం ఉట్టిపడేలా ఎంత రమణీయంగా రాసారో! శ్రీరాముని భార్య సీత/ సౌందర్యాల కలబోత/ అప్సరసల కన్న మిన్న యైన సకలగుణసమేత!

వాయువు కంటె వేగంగాను/ మనసు కంటే శీఘ్రంగాను/లంకకు నేను వెళతాను/ రామబాణంబు లాగా! అంటూ, రాముడి ఆదేశం మేరకు సీతాన్వేషణ కొరకు హనుమంతుడు లంకకు బయలుదేరు విధానాన్ని చక్కగా రాశారు. ఇలా అల్పాక్షరాలతో సంస్కృత శ్లోకాలను తెలుగులో నిక్షిప్తం చేయడం అనేది మామూలు విషయం కాదు. శ్రీరాముడి ధర్మ పరిపాలనను, సోదర ప్రేమను, కుటుంబ విలువలను, నిస్వార్థ సేవా భావాన్ని, రాజనీతిని, సాటి జీవుల పట్ల కరుణను అందమైన నిర్మాణంలో కవితా రచన చేసి, రామాయణాన్ని మళ్లీ ఒకసారి పాఠకులు చదివేలా చేయడం కొసమెరుపు.

అందరూ అర్థం చేసుకునేలా...

మరోచోట.... పర్వతముకు పర్వతంబు/మదగజముకు మదగజంబు/ ఢీ కొన్నట్లుగా యుండె/రామ, రావణ యుద్ధంబు! ఇక్కడ శ్రీరాముడు, రావణాసురుడి మధ్య జరిగిన భీకరమైన యుద్ధ వాతావరణ దృశ్యాన్ని మన కండ్లకు కట్టినట్టు వర్ణించి చూపించడం బాగుంది. అలాగే ఇందులోని కాండల ప్రారంభానికి ముందు కథకు అనుగుణమైన రంగురంగుల చిత్రాలను జోడించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంది. చివర మంగళహారతి, ఫలశ్రుతిని కూడా అందించారు. ఆలుమగల అనురాగము/సహోదరుల సమభావము/ తల్లిదండ్రి గురువుల యెడ/ కలుగును గౌరవభావము! ఫలశ్రుతిలో రామాయణం చదవడం, వినడం వలన కలుగు ప్రయోజనాలను కూడా స్పష్టంగా చెప్పారు. శ్రీరాముని జీవన సారాంశాన్ని సరిగ్గా గ్రహించినచో భార్య భర్తల మధ్య, సోదరుల మధ్య, అనుబంధం మరింతగా పెరిగి బలపడుతుంది. తల్లిదండ్రులపై ప్రేమ, గురువులపై గౌరవభావం కలుగుతుందనే ఆశావాదాన్ని కవి నిక్షిప్తం చేశాడు.

సంస్కృత రామాయణాన్ని చదివి అర్థం చేసుకునేవారు, చేసుకోలేనివారు సులభంగా అర్థం గ్రహించేలా విషయాన్ని స్పష్టంగా, స్ఫూర్తిగా చెప్పడం జరిగింది. ఈ మణిపూసల రామాయణం మధురమైన శైలిలో అందరూ చదువుకోవడానికే కాక పాడుకోవడానికి వీలైన పద్ధతిలో హృద్యంగా రాయబడింది. రసగుళికల లాంటి కమనీయ మణిపూసలు గల ఈ పుస్తకాన్ని కవి ప్రతిభకు తార్కాణంగా పేర్కొనవచ్చు. భావితరాల వారు కూడా రామాయణం చదవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకానికి ఒక విశిష్ట స్థానం లభిస్తుందని ఆశించవచ్చు. ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆశీర్వాదం ‘మణిపూసల మధురకవి’ టి. ఆశీర్వాదంకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ... అభినందనలు.

ప్రతులకు:

శశికళ ఆశీర్వాదం,

ఓం నగర్ కాలనీ, కిస్మత్ పూర్,

గండిపేట, రంగారెడ్డి జిల్లా.

పుస్తకం వెల.. రూ.200/-

90102 08191


సమీక్షకులు

కందుకూరి భాస్కర్

97034 87088

Advertisement

Next Story

Most Viewed