బాల్యాన్ని దృశ్యీకరించిన కథలు

by Ravi |   ( Updated:2024-11-18 00:30:59.0  )
బాల్యాన్ని దృశ్యీకరించిన కథలు
X

కవిత్వం, కథలు, క్లాసులు, న్యాయ విచారణ, తీర్పులు, పాలన వంటి బహుముఖీన శ్రమలు ఒక మనిషిలో రూపు దాలిస్తే ఆ పేరు జింబో. 'మా వేముల వాడ కథలు' 1, 2 భాగాల ద్వారా కథా సాహిత్యంపై, తెలుగు పాఠకులపై చెరగని ముద్ర వేసిన న్యాయ పాలకులు మంగారి రాజేందర్ 'జింబో'. చట్టపాలనా కథలు, నేర న్యాయవ్యవస్థకి సంబంధించిన కథలు, న్యాయవాదిగా, అనంతరం న్యాయమూర్తిగా తాను చూసిన జీవితం గురించి రాసిన కథలు ఆయనకు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చాయి. తెలుగులో తీర్పులను వెలువరించిన మొదటి న్యాయమూర్తి ఆయన. ఇవాళ హైకోర్టుల్లో చాలామంది న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చెప్పడానికి ఆసక్తి చూపుతున్నందుకు ప్రేరణ 'జింబో'.

జ్ఞాపకాల్లోకి అనే పేరిట ఈ పుస్తకానికి చిన్న ముందుమాట రాసిన దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి గారు.. రచయిత శైలి గురించి, కథల గురించి ఒక్క మాటన్నారు. 'ఈ కథలన్నీ వేములవాడ చుట్టూనే తిరిగినా నాకు మా ఊరు, మీకు మీ ఊరు జ్ఞాపకం రావడం తథ్యం.' ఎంత సత్య వాక్యమంటే 'వేములవాడ కథలు- 2' భాగంలో ఇప్పుడు ప్రచురించిన కొన్ని కథలను గత సంవత్సరం దిశ సాహిత్య పేజీకి రచయిత పంపించారు. ప్రతి శనివారం ఆయన తాజా కథను అందుకోగానే ఆబగా చదివేయడం.. ఆయన జ్ఞాపకాలను ఎక్కడో 500 కిలోమీటర్ల దూరంలోని మా ఊరు, అక్కడి మనుషుల జ్ఞాపకాలతో పోల్చుకుని ప్రతిసారీ నివ్వెర పోవడం నాకు అలవాటయింది.

వేములవాడ చరిత్రకు సార్ధకత

ముఖ్యంగా 'మనిషి', 'ఖాళీ సిగరెట్ పెట్టే', 'తిరిగి ఇచ్చే కానుక' వంటి ఈ పుస్తకంలోని 32 కథలు ఇప్పుడు మరోసారి తిరగేస్తుంటే వేములవాడ చరిత్ర సార్థకత పొందిందనిపించింది. ఊరు జ్ఞాపకాల మీద ఇంత మమకారం, ఆత్మీయతతో కూడిన కథలు ఈ మధ్య కాలంలో మరొకరు రాయలేదనిపిస్తోంది. కదిలించిన ప్రతి కథనూ, కథనాన్ని ఆయనతో నేరుగా పంచుకుని మరిన్ని విషయాలు తెలుసుకోవడం వారంవారీగా నా అనుభవంలోకి వచ్చింది. 'మీ కథలు చదువుతుంటే మనిషి తన బాల్యం గురించి, చదువు గురించి, పాఠశాల జీవితం గురించి విడిపోయిన స్నేహితుల గురించి. 50 లేదా 60 ఏళ్ల తర్వాత ఊరు గురించి రాయడం ఇంత సులభమా అనిపిస్తోంది. ప్రతి మనిషీ తన కథను ఇలా చెప్పుకోవచ్చు అనే ప్రేరణ కలుగుతోందండీ' అని చెబితే సంతోషపడిపోయారాయన.

సల్లగ ఉండు సత్తెవ్వ

ఈ రెండో భాగంలోని ప్రతి కథా చివరలో ఒక జీవిత సత్యంతో ముగిసేదే. 'రోజూ ఊరివాళ్లకి సల్లపోస్తున్నావు కదా ఏమొస్తుంది నీకు' అని రచయిత అమ్మను అడిగితే 'సల్లగ ఉండు సత్తెవ్వ అనంటున్నారు. అంత కన్నా పెద్ద దీవెనలు ఏవి కావాలిరా. మనకున్నది ఇతరులకు ఇవ్వడంలో గొప్ప సంతోషం ఉంది' అంటుంది సత్తెమ్మ.. ఇప్పుడు ఊర్లలో దొరకాలన్నా మజ్జిగ ఉండదు.. మొత్తం పాల కేంద్రాలకు అమ్మేయడమే. పశువులు లేని ఊర్లు, పాడి లేని ఊళ్లు.. బాల్యంలో మనందరం చూసిన ఆ పాడి స్వర్ణయుగం కొన్ని దశాబ్దాల్లోపే మాయమై పోయింది కదా.. ఇక 'నేల టికెట్ కథ' జీవితాన్ని తాత్వీకరించిన కథ. చిన్నప్పుడు పైసలు లేనప్పుడు మిత్రుల సాయంతో కాంతారావు నటించిన సినిమా చూసిన స్నేహితుడు, పెద్దయ్యాక కరీంనగర్ థియేటర్‌లో సినిమా చూడ్డానికి వచ్చి, అదనపు టికెట్ కొనుక్కుని టికెట్ దొరకని వారికి ఇవ్వడం, సంవత్సరాలుగా ఈ అలవాటును కొనసాగించడం చదువుతుంటే కన్నీళ్లు ఎవరికి రావు మరి.

ఒక్కో కథ ఒక్కో విజువల్

చిన్నప్పుడు భీమన్న గుడి తోటలో తీయటి జామకాయలు దొంగతనంగా కోసుకోవడానికి వెళ్లినప్పుడు జింబోను, మిత్రులను పట్టుకున్న తోటమాలి పోచెట్టి, కొన్నేళ్ల తర్వాత అదే లాయర్ జింబో వద్దకు భూమి కేసు విచారణ కోసం వచ్చి సాయం తీసుకుని ఫీజుతో పాటు ఆ భీమన్న గుడి తోటలోని జామకాయలను తీసుకుని సంచిలో వేసుకుని వస్తాడు. వాటిలో ఒక జామకాయను తిన్న రచయిత చిన్నప్పటి కాయకన్నా ఈ జామకాయే తియ్యగుందని ఫీలవుతూ, నా బాల్యాన్ని నా దోసిట్లో పెట్టినట్లు అనిపించిందని పోచెట్టికి చెప్పి ఫీజు డబ్బులు వెనక్కు ఇచ్చి మిగిలిన జామకాయలు ఇంటిలోకి పంపే దృశ్యాన్ని 'భీమన్న గుడి' కథ చదివాక మరవగలమా? ఈ పుస్తకంలోని ఒక్కో కథ ఒక షార్ట్ ఫిల్మ్‌గా ఎవరైనా తీయగలిగితే ఆర్కే నారాయణ్ రాసిన 'మాల్గుడి'ని తలపించవా మరి?

ఖాళీగా కూర్చోవడమే నరకం

ఆయుర్వేద వైద్యునిగా దశాబ్దాలు ఊరిలో పనిచేసి హస్తవాసి కలిగిన డాక్టరుగా పేరొందిన రచయిత తండ్రికి గొంతు కేన్సర్ వచ్చాక ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెబితే కుటుంబం ఆశలు వదిలేసుకుంది. కానీ ఆయన నగరం నుండి ఊరుకొచ్చి వారం రోజుల తర్వాత తన దవాఖానాకు పోయి సేవలందిస్తూ మరో పదేళ్లు కేన్సర్‌ని మర్చిపోయి బతికిన వైనాన్ని 'పని' కథ చెబుతుంది. 92 సంవత్సరాల వయసులో కాలం చేసిన తండ్రిని గురించి రచయిత తల్చుకుంటూ ఆయన చాలాసార్లు తమకు చెప్పిన చందమామ కథను గుర్తు చేస్తాడు. దాన్ని చదివితే చందమామ, బాలమిత్రలు లేని బాల్యం కూడా ఒక బాల్యమేనా అనిపించకమానదు. చనిపోయే ముందు కూడా తండ్రి చందమామ, బాలమిత్రలను చదువుతూ మనమలకు ఆ కథలు చెప్పాడంటే ఆ పత్రికలు చరితార్థమైనట్లే కదా..

అందరి బాల్యం ఊసులివి..

వ్యక్తిత్వ వికాసంపై పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటూ పాత్రలు చెప్పే 32 కథల సమాహారం 'మా వేములవాడ కథలు-2' నిజంగానే జ్ఞానమిచ్చే కథలు. సరళ వాక్యాలతో, కొకు శైలిని, చందమామ కథలను తలపించే చేసే కథలివి. సిద్ధాంత బోధ లేదు. పదజాల డాంబికం లేదు. జ్ఞానాన్ని కుమ్మరించే యావ లేదు. జీవితం అంటే ఏమిటి, ఎలా ఉండాలి అనే అపురూపమైన విలువలను తేటగా చెప్పే కథలివి. ఈ పుస్తకం తీసుకుని చదువుతూ మనం కూడా మన బాల్యం ఊసులను గుర్తు తెచ్చుకుందాం.

పుస్తకం: మా వేములవాడ కథలు-2

రచయిత: రాజేందర్ జింబో (రిటైర్డ్ జడ్జి)

పేజీలు : 150

వెల : రూ. 100

ప్రచురణ : ఎమెస్కో బుక్స్ ప్రై. లిమిటెడ్

ప్రతులకు: హైదరాబాద్, విజయవాడ

0866-2436643


పరిచయం

కె. రాజశేఖరరాజు

73964 94557

Advertisement

Next Story

Most Viewed