సమీక్ష:మౌన శబ్దంలో ఎన్నో రంగుల చీకటి

by Ravi |
సమీక్ష:మౌన శబ్దంలో ఎన్నో రంగుల చీకటి
X

కవిత్వం బాహ్యంగా అలతి పదాలు, సాదాసీదా పదబంధాలే. లోతుగా ఆలోచిస్తే అనంత భావనల సమ్మేళనం. మది పులకింతల ప్రణయాభిషేకం. 'నిండుకుండ తొణకదు' అన్నదానికి దగ్గరగా ఈ కవిత్వం తీరు కనిపిస్తుంది. వర్ధమాన కవయిత్రి 'భారతి కోడె' కలం నుంచి పురి విప్పిన ఈ ఆధునిక కవన మయూరిని స్పర్శించిన ప్రతిసారి ఓ ప్రశ్న మన మదిని తాకుతుంది. 113 కవనరేఖల రంగుల చీకటి ఈ అత్యాధునిక కవితా వల్లరి. కవితా శీర్షికలలోనే కవయిత్రి ఎంతటి సృజనశీలురాలో తెలుస్తుంది. ప్రశ్నార్థకాలు వాక్యాంతంలో లేకపోయినా, వాక్యాలన్నీ ప్రశ్నలే!! ఇదో చిత్రమైన శైలి. 'ఎవరు ఎందుకు మొదలుపెట్టారో తెలియకుండానే / యుద్ధంలోకి దూకాలనుకుంటావు నువ్వు / కంచెలు ఎందుకు వేశారో తెలుసుకోకుండా / తెంచాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో / ఎప్పటికో తెలుసుకుంటావు' 'భూమి బొంగరం' కవితలో మనకీ ప్రశ్న ఉదయిస్తుంది. కారణాన్ని తెలుసుకోకుండా సమస్యను పరిష్కరించాలి అనుకునే తెలివిలేని తనం గురించి రచయిత్రి ఎంతో లోతైన భావంతో చెబుతారు.

ఆంగ్లంలోని భావాలు ఈ కవితా సంపుటికి అదనపు ఆకర్షణ. మనిషి నవ నాగరికంగా ఎంత ఎత్తు ఎదిగిన, అతని గమ్యం ప్రారంభించిన చోటుకే అన్న జీవన సత్యాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు 'సమరం వేచి చూస్తుంది' కవితలో. స్వార్థమయ లోకంలో మనిషి అనుభవిస్తున్న మానసిక వేదన తాలూకు ఆర్తిని ఆవిష్కరించిన 'జాలరి కలాపం' కవితలోని భావామృతం రుచి ఎంత చెప్పినా తక్కువే.!

'ఒక్క సముద్రం అయితే మాత్రం ఎన్ని తీరాలు / కానీ, ఒక్కొక్క ముఖానికి ఎన్నెన్ని ముసుగులు / నిజానికి ఉన్న ఒక్క జీవితానికి ఎన్ని మరణాలు' అంటూ స్వార్ధ సమాజాన్ని, అబద్ధాల లోకాన్ని చీల్చి చెండాడారు.కవిత్వం నిండా నవీన రీతులు, దృక్పథాలు, సందేశాలు అమరి ఉన్నాయి. అడుగడుగునా నవీన పద బంధాలు పాఠకులకు ఆనందానుభూతిని అందిస్తాయి. కూలిన ఇంటి చిరునామా, అదే చీకటి, పిట్టల సెలయేరు, బింభోత్సవం, ఒకే కొమ్మ రెండు పిట్టలు, లాంటి శీర్షికల ద్వారా కవయిత్రిలోని భాషా సౌందర్య సొగసులు అగుపిస్తాయి. నవీన కవిత్వంలోని నిగారింపుల గురించి తెలుసుకోవాలనుకునే వర్ధమాన కవులు తప్పక చదవాల్సిన కవితా సంపుటి ఇది.

ప్రతులకు:

భారతి కోడె

94401 03411

పేజీలు 132 : వెల రూ. 100

సమీక్షకులు


డా. అమ్మిన శ్రీనివాసరాజు

77298 83223

Advertisement

Next Story

Most Viewed