సింగరేణి కార్మికుల ఊపిరి

by Ravi |   ( Updated:2024-11-18 01:00:39.0  )
సింగరేణి కార్మికుల ఊపిరి
X

'నీ రక్తం చుక్కలతోనే

టాటాలు కోట్లకు పెరిగిరి.

నీ చెమట చుక్కలతో

బిర్లాలు బిల్డింగ్ లు కట్టిరి.'

గురజాల రవీందర్ గారు రాసిన బొగ్గు రవ్వలు సింగరేణి కార్మికోద్యమ జ్ఞాపకాలని పాఠకుల ముందు ఉంచింది. పర్స్పెక్టివ్ ప్రచురణ సంస్థ ఈ రచనను ప్రచురించి ఒక ఉద్యమ చరిత్రను గ్రంథస్థం చేయడంలో తన వంతు చారిత్రక పాత్రను పోషించింది. పుస్తకం ఒక నవలగా ఒక ప్రత్యేక కాల పరిమితిని తీసుకొని నడుస్తుంది. మరోవైపు రచయిత సొంత జీవిత చరిత్ర కొనసాగుతుంది. రచయిత తన జీవితాన్ని పాఠకుల ముందు ఉంచుతూనే ఒక ప్రత్యేక ఉద్యమ జీవితం, సింగరేణి కార్మికుల సమస్యలు, యాజమాన్యం దోపిడీ, శ్రామికుల జీవితాల్లోని బాధలు ఎంతో హృద్యంగా రాస్తారు. ఎప్పుడో 50 సంవత్సరాల ముందు ఈ సంఘటనలు జరిగాయి. కానీ నేటికీ ఈ పాత్రలు మన ముందు కదులుతాయి. ఇప్పుడే మన కళ్ల ముందు జరుగుతున్నట్టు ఉంటాయి .

సొంత హోటల్ ఏదో విధంగా నడుపుతూ పొట్ట పోషణ చేసుకుంటున్న రవీందర్ అనుకోకుండా సింగరేణిలో ఉద్యోగంలో చేరుతాడు. దాంతో అతని జీవిత గమ్యం మారిపోతుంది. కార్మికుల సమస్యలను పరిశీలిస్తాడు. అప్పట్లో యాజమాన్యం నిరంకుశత్వం చూస్తాడు. అప్పటికే ఉన్న ట్రేడ్ యూనియన్లు కార్మికుడి వైపు కాకుండా యజమాని వైపు మొగ్గు చూపడం కూడా చూస్తాడు. మెల్లమెల్లగా రాడికల్ ఉద్యమం వైపు మొగ్గు చూపుతాడు. పరిశ్రమలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ వర్గ చైతన్యం కోసం శ్రమిస్తారు. అందుకోసం అవసరమైన సాహిత్యం విపరీతంగా చదువుతాడు.

చిత్రహింసల కొలిమిలో కనలికనలి...

ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనులు 1973 నుంచి 1986 వరకు ఉద్యమ జీవితాన్ని రచయిత నవల రూపంలో గ్రంథస్తం చేయడానికి ప్రయత్నించారు. ఇందులో తొమ్మిది సంవత్సరాలు అండర్ గ్రౌండ్‌లో గడిపిన కఠోర జీవితం కూడా ఉంది. అండర్ గ్రౌండ్‌లో ఉన్నా బయట లీగల్‌గా ఉన్నా ఎలా పనిచేసినా సరే నవల మొత్తం మీద మానవ జీవితాలు ఉన్నాయి. జైలు జీవితం ఉంది. కఠిన శిక్షలు ఉన్నాయి. పోలీసుల అత్యాచారాలు ఉన్నాయి. పోలీసులు బూట్లు నోటి మీద పెట్టి తిప్పే సంఘటనలు, కాలి బొటనవేలి మీద బూటుతో గట్టిగా అణచివేసి చేసిన చిత్రహింసలు ఎంత సహజంగా చిత్రించారూ అంటే అది నిన్ననే మొన్ననే జరిగినట్టు అనిపిస్తుంది. మనకు నిద్ర పట్టదు.

ప్రశ్నించేవాళ్ల కష్టాలు అనంతం

నీళ్లు దొరక్కపోతే ప్రాణాల్ని అరచేతిలో పట్టుకుని మురికి నీరు తాగే సంఘటనలు, మూత్రాన్ని తాగే సంఘటనలు హృదయాన్ని కలచి వేస్తాయి. ఎన్నో రోజులు మనం మరి ఏ పని చేయలేం. మనసంతా అదోలా అయిపోతుంది. ఏమిటీ ప్రపంచం? ఎంత దారుణం? న్యాయం కోసం, ధర్మం కోసం ప్రశ్నిస్తున్న కార్యకర్తల పరిస్థితి ఇంత దారుణంగా ఉండాల్సిందేనా అని మనసులో ప్రశ్నలు తొలిచేస్తాయి. రచయిత సాహితీ సౌందర్యం కోసమనీ, వర్ణణల కోసమనీ ఎక్కడా కూడా ఆరాటపడినట్టు లేదు. జరిగింది జరిగినట్టు సహజంగా రాశారు. రవీందర్‌తో పాటు సహచరి సరళ కూడా అంతే నిబద్ధతతో కలిసి పనిచేశారు. ఎన్నెన్నో సమస్యలను అతనితో పంచుకున్నారు. మౌలిక వసతులు కూడా లేని దుర్భర జీవితాన్ని ఇద్దరూ కూడా అనుభవించారు. అయినా సరే, ఎవరికీ ఎవరి మీద ఏ రకమైన ఫిర్యాదు కూడా లేదు. భార్యకు భర్త మీద ఎలాంటి ఫిర్యాదు కూడా లేదు.

సరెండర్, అరెస్టు, అడ్జెస్ట్

కలసి సమస్యలను పంచుకుంటూ సామాజిక న్యాయం కోసం వ్యక్తిగత సుఖాలను కూడా త్యాగం చేసి ముందుకు వెళ్లాలనుకున్న వీరి ఆదర్శ జీవితం మరిచిపోలేనిది. ఒక సంవత్సరం పాపను కూడా ఇంటిలో బంధువుల దగ్గర విడిచి పెట్టేసి సామాజిక న్యాయం కోసం అండర్ గ్రౌండ్‌కి వెళ్లి పని చేయాలని ఇద్దరూ అనుకున్నారు. ఇది ఊహకు అందని విషయం. మానవజాతిలో ఇంతింత త్యాగాలు ఉంటాయా అనే ప్రశ్న సాధారణ మనిషికి వస్తుంది. కానీ, ఇదంతా కూడా నిజం అని నవల చదివితే అర్థం అవుతుంది. చివరికి పార్టీ సరళ విషయంలో అంగీకారం తెలపలేదు. రవీందర్ కోసం ఒప్పుకుంది. కానీ సరళ కోసం ఒప్పుకోలేదు. కానీ పనిచేస్తే ఉద్యమంలో దిగితే ఇద్దరము కలిసే దిగుతాం అని ఇద్దరు కూడా శపథం చేశారు. పట్టు పట్టారు. పార్టీ ఆలోచిస్తాం అని అనడంతో నిరాశకు ఎదురై పార్టీని విడిచి పెట్టాలని ఇద్దరూ కూడా అనుకున్నారు. చివరికి మేజిస్ట్రేట్ ముందు చట్టబద్ధంగా రవీందర్ సరెండర్ అవడంతో ఒక ఉద్యమ చరిత్ర అతని కోణంలో ముగిసింది. మరలా శిక్షను అనుభవిస్తూ బెయిల్ మీద బయటకు వచ్చి సాధారణ జీవితంలోకి ఆయన అడ్జస్ట్ అవ్వడం ఆరంభించారు. ఇంతవరకు ఈ నవల కొనసాగుతుంది.

అసాధారణ మానవ త్యాగాలు

నవల మొత్తం మీద ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. రవీందర్ జీవితాన్ని చూపిస్తూనే అతని సమకాలీన కార్యకర్తల జీవితం కూడా మన కళ్ళ ముందు చూపించారు. తన బాధలు మాత్రమే కాకుండా తనతో పాటు పనిచేసిన కార్యకర్తల బాధలు కూడా మనం నవలలో చూస్తాం. రచనలో వారితో పాటు నడుస్తాం. వారి కష్టాలు, వారి బాధలు, వారి ఆవేదనలను మనం కూడా పంచుకుంటూ వారితో మమేకం అవుతాం. చాలా సాధారణంగానే రాసిన ఈ రచన అసాధారణమైన మానవ త్యాగాలను పాఠకుల ముందు ఉంచుతూ మనల్ని ఊపిరాడకుండా చేస్తుంది. ఒక రచన సమాజానికి చైతన్యం చేస్తుందా? లేదా? అన్న విషయం ఆ రచన ఏ వర్గ దృక్పథంతో రచయిత రాశారు అన్న ప్రాథమిక అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కోణంలో, ఈ రచన శ్రామిక వర్గం దృక్కోణంలో శ్రామిక వర్గం ప్రయోజనం కోసం ఆయా కాలాల పోరాట చరిత్ర గ్రంథస్తం చేస్తూ వచ్చిన రచన ఇలాంటి రచనలు రాయకపోతే సమకాలీన సమాజానికి ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఏ రకమైన ఉద్యమాలు జరిగాయో, అవి ఏ రకమైన ప్రయోజనాలను అందించాయో, ఆ ఉద్యమాల నుండి ఏ రకమైన పాఠాలను శ్రామిక వర్గం నేర్చుకోవలసి ఉంటుందో మొదలైన విషయాలు అర్థం కావు. కాబట్టి రచయిత చారిత్రక బాధ్యత ఈ విషయంలో గుర్తించదగ్గది.

పుస్తకం: బొగ్గురవ్వలు

రచయిత; గురిజాల రవీందర్

పేజీలు: 187

వెల: 220

ప్రచురణ: నవోదయ బుక్ హౌస్

040- 24652387


సమీక్షకులు

కేశవ్

98313 14213

Advertisement

Next Story

Most Viewed