- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కమ్మని కథల బాల కథంబం!
నేటితరం మేటి బాల కథా రచయితల్లో అగ్రస్థానంలో నిలవడానికి అన్ని లక్షణాలు గల బందరు బహుముఖ ప్రజ్ఞాశీలి, బాల కథానిధి, గుడిపూడి రాధికారాణి. దశాబ్ద కాలంగా ప్రామాణిక బాణిలో రాస్తున్న అనేక బాలల కథల్లో ఒక 22 కథలను సంపుటిగా పేర్చి ‘బాల కథంబం’ పేరుతో తన తొలి కథా సంపుటినే ఆవిష్కరించారు రాధికా రాణి. ఇందులోని కథా వస్తువులు, కథన రీతులు, సహజంగా, సరళంగా, సాగి పిల్లల కథలంటే ఇవి కదా! అనిపించేలా ఉన్నాయి. కథల పేరులో ఆసక్తి, కడదాకా చదివించే అనురక్తి, చివరికి సంతృప్తిని కలిగించే ముగింపు సందేశం. ఈ కథకు ఆ కథ భిన్నత్వంలో ఏకత్వంలో పాతదనంలో కొత్తదనం కలుపుకొని సరికొత్త కథలుగా సాక్షాత్కరించబడ్డాయి. కొత్తగా కథలు రాసేవారికి ఇది ఒక సరికొత్త మార్గదర్శకంగా పనిచేస్తుందనడంలో అక్షర సత్యం నిండివుంది.
సరళ వాక్య నిర్మాణాలతో..
ఇక ఈ కథలన్నీ నిడివిలో చిన్నగా ఉండి సరళ వాక్యాలతో చదువరులను ఇట్టే ఆకర్షిస్తాయి. అంతలోనే ఆలోచింపజేసి, ముగింపు వైపుకు నడిపించి చక్కని నీతిని సంతృప్తిగా పంచుతాయి. రాధికారాణి కథల్లో నీతి వాక్యాల రూపం కనిపించదు. చక్కటి క్రియా రూపం దాగి ఉంటుంది. నేటి ఆధునిక బాలసాహిత్యానికి ఇలాంటి ఆచరణ, క్రియాశీల నీతులే అత్యవసరం. ఆ బాణిని చక్కగా దొరకపుచ్చుకొని తనదైన సరళ వాక్య నిర్మాణాల సాయంగా భలే భలే కథలు రాసింది రచయిత్రి. అల్లరిచేస్తూ గొప్పలు చెప్పే వారి కన్నా, బుద్ధిగా ఉన్నచోట ఉంటూ తమ పనులు తాము చేసుకునే వారిని అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు, అభిమానిస్తారని చక్కని కార్యాచరణ నీతి సందేశాన్ని ‘కుదురు లేని కుంకుడు గింజ’ కథ ద్వారా ఎంత బాగా చెప్పారో! అలాగే ‘దానగుణం’లోని గొప్పతనాన్ని, స్వార్థంలో గల చెడును సమపాళ్లలో చెబుతూ.... అవసరమైన వారికి దానం చేయాలని దాని వల్ల ఉపయోగం ఉంటుందని ఉత్తమ సృజనాత్మక విధానంలో చెబుతారు. ‘జేబులో జోరీగ’ కథ ద్వారా, మనుషులకు కావలసింది ఖరీదైన భవనాలు, విలాసవంతమైన నివాసాలు, ఖరీదైన ఆహార పదార్థాలు కాదని ఎదుటి వారిని నిస్వార్ధంగా ఆదరించి అభిమానించే ప్రేమాభిగుణాలు అత్యవసరం, అన్న విషయాన్ని తెలిపిన ‘ఇరికిల్లు’ కథ. అవసరానికి అందనిది అవసరం తీరాక అందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే నిండు నిజాన్ని చెప్పిన కథ ‘పిసినారి బావ’. పైకి కనిపించే అందంతో గాక పది కాలాలపాటు ఉండిపోయే మంచి ప్రవర్తన వల్లే మనకు చక్కటి స్నేహ సామ్రాజ్యం దొరుకుతుందనే వాస్తవాన్ని చూపిన కథ ‘గుబులు తీరిన గుడ్లగూబ’, ఇలా ప్రతి కథ ఒక ప్రయోజనాన్ని పుణికి పుచ్చుకొని ఉన్నాయి.
బాల సాహిత్యంలో నీతి కథలే కాక, యుక్తి కథలు కూడా అత్యవసరం. కానీ నేడు వీటి సంఖ్య పలచబడుతుంది. ఆ విషయాన్ని గమనించిన ఈ బందరు బాల సాహితి మణి కొన్ని యుక్తి కథలు రాశారు. ఆ కోవకు చెందిన కథే ‘కోడలి దానగుణం’! ఇక బాలసాహిత్యంలో మరో కోణం జానపద సాహిత్యం, దీనికి సంబంధించిన కథలు అనేకం మనకు నిత్యం కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీన కథలని తనదైన నవీనత్వంతో సొంత శైలి, భాషతో నవ్య నూతనత్వంతో రాసిన కథలు చంద్రుడి కోపం సూర్యుడితాపం, వెలిగిన మిణుగురు, చేదు చెరకు తీపికాకర, ఇంట్లో పాము పుట్టలోకి, మొదలైనవి. ఆసక్తికరమైన ఎత్తుగడలు, ఆలోచింపజేసే ముగింపులు, అందమైన కథన రీతుల మేళవింపులు గుడిపూడి రాధికారాణి బాలల కథలు, ఆబాలగోపాలానికి మేలిమి కథా మణులు.
ప్రతులకు: బాల కదంబం (కథా సంపుటి) పేజీలు:52, వెల:100/ ప్రతులకు: రచయిత్రి, గుడిపూడి రాధికరాణి, 94949 42583.
సమీక్షకుడు
- డా. అమ్మిన శ్రీనివాసరాజు,
77298 83223