సాహిత్యం, కళల్లో సాయుధ పోరాటం!

by Ravi |   ( Updated:2023-09-11 00:30:36.0  )
సాహిత్యం, కళల్లో సాయుధ పోరాటం!
X

గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ నెల రాగానే బీజేపీ నాయకులు తామే తెలంగాణా విమోచనకారులమన్నట్టు డబ్బాలు కొట్టుకుంటూ, ఇతరులపైన బురద చల్లుతున్నారు. రాజ్య సిద్ధాంతవు పరిభాషలో నాటి ఢిల్లీ పాలకులకెంత స్వాతంత్ర్యం వుందో నిజాం నవాబుకీ అంతే వుందన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు. 1947 ఆగస్టు 15తో కాంగ్రెస్ వారికి భారతదేశాన్ని, పాకిస్తాన్ ని ముస్లింలీగుకూ బదలాయించి బ్రిటిషువారు ప్రత్యక్ష అధికారం నుండి తప్పుకున్నారు. అలాగే సంస్థానాధీశులకు కూడా స్వతంత్ర్యం యిచ్చేశారు. ఆ మేరకు 1948 సెప్టెంబర్ 17 దాకా నిజాం రాజ్యం అప్పటికి 150 సంవత్సరాల క్రితం కోల్పోయిన ‘స్వాతంత్య్రాన్ని’ తిరిగి పొందింది. నిజాం రాజ్యాన్ని ఇండియన్‌ యూనియన్లో విలీనం చెయ్యటాన్నే, అందుకే నెహ్రూ-పటేల్‌ ప్రభుత్వం 50వేల మిలట్రీని పంపి కూడా దానికి ‘పోలీసుయాక్షన్‌’ అని పేరిడటాన్నే, నైజాం నవాబు సర్దార్‌ పటేల్‌ ముందు లొంగి పోవటాన్నే తెలంగాణా విమోచనంగా కొందరు చెబుతున్నారు.

ప్రజా దృక్పధానికి నమూనా..

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను సాహిత్య సాంస్కృతిక రంగాలు విస్తారంగా నమోదు చేశాయి. ముస్లిం రైతు యువకుడు బందగీ సమాధికి నివాళులర్పిస్తూ, సుంకర-వాసిరెడ్డిల మాభూమి నాటకం, 1942 నాటి ఒక వాస్తవిక సంఘటనతో ప్రారంభమౌతుంది. ఉద్యమం దేశముఖుల, పటేలు, పట్వారీల వారి గుండాలకు వ్యతిరేకంగా వెల్లువలా పొంగింది. సాయుధంగా తప్ప హక్కులు సాధించుకోలేమనే స్థితిదాకా ఎదిగి దున్నేవానికే భూమి సాధనకై అమరవీరుల ఆశయ సాధనకై శపథం చేయటంతో మాభూమి నాటకం ముగుస్తుంది. ఈ నాటకాన్ని పోలీసు యాక్షన్‌ పేరిట జరిగిన మిలటరీ యాక్షన్‌కు ముందే మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తెలంగాణా ప్రాంత ప్రజల న్యాయబద్ధ పోరాటానికి, ప్రజాస్వామిక ఆకాంక్షలకు అప్పటికి వేరే రాష్ట్రంగా వుండిన తెలుగు ప్రజానీకంలో రెండు సంవత్సరాల కాలంలో 920కి పైగా ప్రదర్శనలిచ్చి (రోజుకొకటి కంటె ఎక్కువ) సంఘీభావాన్ని పెంపొందించటంలో చారిత్రాత్మక పాత్రను ఈనాటకం నిర్వహించింది. ఈ నాటకాన్ని ప్రశంసించని ప్రముఖుడే ఆనాడు లేడంటే ఆశ్చర్యంకాదు. ప్రతిభావంతమైన వాస్తవిక జీవిత చిత్రణ ద్వారా పోరాట ఆవశ్యకతను, అనివార్యతను ఆమోదింపజేయటంలోనే ఈ నాటకం విజయం దాగి వుంది. రచయితలు సుంకర, వాసిరెడ్డి, డా. గరికపాటి రాజారావు వంటి దర్శకులు గొప్ప కళాత్మక చిత్రణ ద్వారా దాన్ని సాధించారు. జీవిత వాస్తవాన్ని నిరాకరించలేక, పోరాట సత్యాన్ని ఆమోదించలేక, తమలోని స్వతంత్ర, ప్రజాస్వామిక డొల్లతనాన్ని అప్పటికే బయట పెట్టుకుంటూ కాంగ్రెస్ పాలకులు 'మాభూమి'ని నిషేధించారు. ఆనాటికే నిజాం రాజ్యంలో బుర్రకథ అనే కళా రూపమే నిషేధానికి గురయివున్నది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. ఏ కథ చెప్పినా వంతలు పేరుతోనో మరొకరకంగానో ఆనాటి పాలకుల దోపిడీ దౌర్జన్యాలను బుర్రకథ కళాకారులు బహిర్గత పరుస్తున్నారనే అనుమానంతో ఏకంగా కళారూపాన్నే నిషేధించిన కాలమది.

మాభూమి రచయిత సుంకర ఆనాడే రాసిన వీరకుంకుమ నాటికలో నిజాం నవాబు, రజాకార్లు ముస్లిములయినా, దేశముఖ్‌- పట్వారీ - వారి గూండాలు హిందువులయినా, వారి మధ్య గల సయోధ్యకు, వ్యూడల్‌ ఆర్థిక- రాజకీయాల భూమిక మూల కారణమని ప్రేక్షకులకు సులువుగా అర్థమయ్యే రీతిలో అత్యంత స్పష్టంగా దృశ్యీకరించారు. ప్రజావ్యతిరేక పాత్రలతో నడిచే ఈ నాటకంలో ఒక రజాకారు, మరొక హిందూ గూండా పాత్రలు వున్నా వారి క్రౌర్యం పట్ల ప్రజలలో రగుల్కొనే ఆగ్రహం, వారు పుట్టిన మతంపై ద్వేషంగా మరలకుండా సూత్రబద్ధ లౌకికతత్వానికి కట్టుబడి నాటిక నడిపించారు. ప్రజా దృక్పధానికి నమూనాగా నిలిచిన గొప్ప కళా ప్రదర్శనలివి.

తెలంగాణ పోరాటంపై నవలలు..

1946-51 మధ్యకాలంలో కవులు, కథకులు, నవలాకారులు, నాటకకర్తలు ఆటలు పాటల జానపద కళా ప్రదర్శకులు, చిత్రకారులు, ఫోటోగ్రాఫర్లు... పత్రికలు ఇలా అనేక రూపాలలో, బహుముఖంగా ఎందరో ఈ పోరాటాన్ని తమ తమ సృజనాత్మక రూపాలలో నమోదు చేశారు. దాశరథి, అగ్నివీణ, కాళోజీ నా గొడవ కవితలు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎక్కుబెట్టినవి. 'మాభూమి' నాటకం లాగానే మరి కొన్ని నిషేధానికి గురైనాయి. వజ్రాయుధం (సోమసుందర్‌), కావ్యం, సింహగర్జన (లక్షీకాంతమోహన్‌), నవల, గంగినేని వెంకటేశ్వరరావు రాసిన ఎర్రజెండాలు ఇందులో ముఖ్యమైనవి. పోరాట కాలంలోనే వెలువడిన నవలలు బొల్లిముంత శివరామకృష్ణ రాసిన మృత్యుంజయులు'. లక్ష్మీకాంతమోహన్‌ 'సింహగర్హన' ( ఇంగ్లీషులో) Telangana Thunders పేరుతో వచ్చింది. ఇంకా వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, గంగు మహీధర రామ్మోహనరావు ఓనమాలు, మృత్యువు నీడల్లో ', గొల్లపూడి నారాయణరావు రావు మూడు నవలలు పాత రోజులు - కొత్త రోజులు- తెలుగు గడ్డ- దాశరథి రంగాచార్య చిల్లరదేవుళ్ళు, జనపదం (మూడు భాగాలు) సరిపల్లె కృష్ణారెడ్డి ఉప్పెన, 9 పోరాట కాలమంతా దళాల మధ్యనే వుండి సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించిన తిరునగరి రామాంజనేయులు రాసిన సంగం మొదలైన నవలలూ.. ఆనాటి పోరాటం నడి మధ్యన జీవించినవారూ, సమకాలికులూ రాసినవి. ప్రఖ్యాత హిందీ-ఉర్దూ రచయిత కిషన్‌ చందర్‌ రాసిన నవల జబ్‌ ఖేత్‌ జాగే తెలుగులో జైత్రయాత్రగా అనువాదమై బి.నరసింగరావు తీసిన మాభూమి సినిమాకు ఆధారమైంది.

ఈనాటికీ వీర తెలంగాణా విప్లవ పోరాటంపైన సృజనాత్మక నవలా సాహిత్యం వెలువడుతూనే వుంది. సింగరేణి బొగ్గుగని కార్మిక నాయకుడు అమరుడు శేషగిరిరావు జీవిత చరిత్రను ఈతరం బొగ్గుగని కార్మికుడు పి.చంద్‌ శేషగిరి నవలగా రాశారు. అంపశయ్య నవీన్‌ రాసిన పోరాట పూర్వం, పోరాటకాలం, పోరాటానంతర (నక్సల్‌బరీ ఉద్యమ) జీవితాల్ని విస్తారంగా ప్రతిబింబించిన మూడు నవలలు ఇటీవల కాలంలో వెలువడ్డాయి. విస్త్రత జీవితాన్ని చిత్రించటానికి సావకాశమున్న సాహిత్య రూపం నవల. అటువంటివి సుమారు 20 నవలలు ఇప్పటికి తెలంగాణా పోరాటంపై వెలువడ్డాయి. ఆనాటి ఫ్యూడల్‌ జీవితపు దోపిడీ పీడనల కాలం కంటే మెరుగైన సాంస్కృతిక, జీవన సంబంధాల స్వేచ్చ అంటూ ఈనాడు ఏమైనా వుంటే దానికి ప్రధాన దోహదకారి వీర తెలంగాణా విప్లవ పోరాటమే!

(ముగింపు వ్యాసం వచ్చేవారం)

- దివికుమార్

ప్రజాసాహితి కార్యవర్గ సభ్యులు

94401 67891

Advertisement

Next Story

Most Viewed