సమీక్ష:అనుభూతుల మేలు కలయిక

by Ravi |
సమీక్ష:అనుభూతుల మేలు కలయిక
X

గోపీ సార్ కృషితో తెలుగు సాహితీ వినీలాకాశంలో 'నానీల తెలుగువెన్నెల' పిండారబోసింది. అందులో భాగంగా వెలువడిందే పి.వి. రమణరావు మాస్టారు రాసిన 'నానీల పరిమళాలు' ఆయన భౌతికశాస్త్ర బోధకుడుగా, ప్రధానాచార్యుడిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. మాతృభాష మీద ప్రేమ, చిరు కవిత్వం మీద మక్కువ పెంచుకుని 'హైకూ రమణీయం' 'నానోల రమణీయాలు' రాసారు. అక్షరాల లెక్కలు తప్పకుండానే, తనలోని భావాలను సామాజిక దృష్టితో తనదైన సరసపు చెణుకుల సాక్షిగా 'నానీల పరిమళాలు' అందించారు. ఈ శత నానీల పరిమళాలు దేనికవే శెహబాష్ అనిపించుకున్నయి. కఠిన విషయాన్ని కూడా కడు సరళంగా చెప్పడంలో 'పాటిబండ' బహునేర్పరి.

సమాజంలో సాగుతున్న కపట ప్రేమ వ్యవహారాలు, అతివలు బలి అవుతున్న తీరుపై 'యాసిడ్ సీసా/ పట్టుకున్నాడు/ వీడండి/ కలియుగ ప్రేమికుడు' అంటూ నేటి యువతకు చురకల వైద్యం చేస్తారు. 'వడ్డెర స్వేదం చిందించి/ తడిసింది భూమి/ గునపం గూర్చిన/ గుర్రుమనలేదు' అంటూ భావి సుఖాల కోసం వర్తమానంలో వచ్చే కష్టాలను లెక్క చేయరాదనే జీవిత సత్యాన్ని రమణరావు ఎంతో హృద్యంగా చెబుతారు.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, జలవివాదాలు, మత్తుపానీయాలు, బాబాల మోసాలు, రాజకీయ నాయకుల దుర్మార్గాలు, ఇలా సామాజిక ఇక్కట్లను అన్నిటినీ పట్టి బాధ్యతాయుతమైన కవిగా తనదైన పరిశీలనా దృష్టితో ఆవిష్కరించి ఆలోచింప చేశారు. 'స్త్రీ లావణ్యం / అపురూపం/ చూసిన వెంటనే/ కలవరింత తథ్యం' అంటూనే, 'పరకాంతలకై/ పరవశించే కళ్లు/ పొద్దుతిరుగుడు/ పువ్వు నకళ్లు' అంటూ మగవారిని హెచ్చరిస్తారు. 'ఆయుధం పట్టని/ దేవత సరస్వతి / బడిలో కొలువైన / పంతులమ్మ' అంటూ స్త్రీ మూర్తిని చదువుల తల్లితో సమానం చేస్తూనే, వ్యాపారుల/ అక్షయ తృతీయ/ పసిడి అమ్మకం/

పర్సుల గిలగిల' అంటూ ఆడవారికి ఉండే కొనుగోళ్ల వ్యామోహాన్ని ఎద్దేవా చేస్తారు.

వీటన్నిటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే రమణరావు మానవ పక్షపాతి, మంచిని కోరుకునే మానవతావాది అనిపిస్తుంది. ఆయనలోని తెలుగుదనం నిండుగా ఉందనడానికి తాను ఉపయోగించిన 'నరం లేని నాలుక' 'ములగచెట్టు పొగడ్తకు, రేగు చెట్టు వాదానికి, లంక మేత గోదావరి ఈత, వంటి సామెతల వాక్యాలే సాక్ష్యాలు. 'నానీల రమణీయం' నిజంగా ఒక ఆహ్లాద అక్షర ప్రవాహం. అనుభూతుల మేలలు కలయికగా, సామాజిక ఇతివృత్తంతో బాధ్యతాయుతంగా సాగిన రచన.

ప్రతులకు:

పి.వి. రమణరావు

వెల: రూ. 80 : పేజీలు 48

94405 33032


సమీక్షకులు

డా. అమ్మిన శ్రీనివాసరాజు

77298 83223

Advertisement

Next Story

Most Viewed