విభిన్న మనసుల వేదిక

by Ravi |   ( Updated:2022-05-01 20:16:20.0  )
విభిన్న మనసుల వేదిక
X

కాలాతీతవ్యక్తులు డా. పి శ్రీదేవి సృష్టించిన అద్భుతమైన నవల. మనుషుల ప్రవర్తనను, సమయానికి అనుగుణంగా వేసే జిత్తులను రచయిత ఇందులో చాలా బాగా తెలియజేశారు. నవల చదువుతున్నకొద్దీ మన చుట్టూ కూడా ఇలాంటి వారున్నారా? అనే అనుమానం కలగక మానదు. 'ఏ పని చేసినా కళ్లు తెరుచుకునే చేస్తాను, ఏడుస్తూ ఏదీ చేయను, ఏది జరిగినా ఏడువను' అంటూ మహిళలకు ఉండాల్సిన ధైర్యాన్ని , తెగువను రచయిత ఇందిర పాత్రలో చూపించారు. నవలలో అందరికంటే తెలివైనది ఇందిర. ప్రతి ఒక్కరినీ తన చుట్టూ తిప్పుకోగల సమర్థురాలు.

చిన్నప్పుడే తల్లి దూరమై, కూతురి సంపాదనతో బతుకీడుస్తున్న నాన్న ఆనందరావుతో సాగే సరదా ముచ్చట్లతో నవల కొనసాగుతుంది. ఇందిర సరదా, తెలివి, ధైర్యం, హుందాతనం కలిగిన అమ్మాయి. కళ్యాణి వైపు వెళ్తున్న ప్రకాశాన్ని తనవైపు తిప్పుకొని, తాను ఓ పిరికివాడని తెలుసుకుని వదిలేసే సమయంలో 'ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం, బతుకులో నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది. అందుచేత కసికొద్దీ లోకాన్ని ధిక్కరిస్తున్నాను. నాకు ఓ ఇల్లు సంసారం, నాదీ అనిపించుకునే భర్త పిల్లలు అనేవి అక్కర్లేదనుకోకు' అంటుంది. ఇందిరలోని మహిళా మనసును రచయిత తెలియజేసిన తీరు ఎంతో మెచ్చుకోదగినది. చివరకు తన మాటల గారడితో కృష్ణమూర్తికి దగ్గరవుతుంది ఇందిర.

ఎవరి గోలా వారిదే

భయం పిరికితనం వలన ఎదుర్కొనే సమస్యలను మనకు రచయిత ప్రకాశం పాత్ర ద్వారా చూపిస్తారు. ప్రకాశం తెలివి ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయకుడు. కళ్యాణికి చేయందించి, ఇందిర మైకంలో పడి కళ్యాణికి చేయాల్సిన సాయాన్ని మర్చిపోతాడు. ఇందిరా మైకంలో ఉండగానే తన మేనమామ 'ఎవర్తిరా అది?' అనేసరికి భయపడి మామ చూసిన సంబంధాన్ని చేసుకుంటాడు. తెలివితక్కువతనంతో అటు కళ్యాణి, ఇటు ఇందిర ఇద్దరని దూరం చేసుకుంటాడు. కళ్యాణి సున్నిత మనస్కురాలు. 'మంచివారికి మంచే జరుగుతుంది' అనుకునే రకం. తల్లి చనిపోయిన ఈమెకు తండ్రే ఆధారం. చిన్నప్పటి నుంచి కష్టాలే. 'నేనున్నానంటూ' ప్రకాశం చేయందిస్తే పొంగిపోతుంది.

చివరకు ప్రకాశం కళ్యాణికి అన్యాయమే చేశాడని చెప్పాలి. ఇక 'ఈ కష్టాల కడలి ఈదగలనా?' అనుకున్న ఆమెకు వసుంధర, కృష్ణమూర్తి తోడు దొరుకుతుంది. కృష్ణమూర్తి సహాయాన్ని నిరాకరిస్తుంది. ఒంటరిగానే ఎదగాలనుకుంటుంది. ట్యూషన్లు మాట్లాడుకుని జీవనం సాగిస్తుంది. భయాలు విడిచి అడుగు ముందుకేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని కళ్యాణి పాత్ర ద్వారా రచయిత మనకు తెలియజేషారు. కృష్ణమూర్తి తాతలు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో జల్సాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈయన ప్రకాశంలాగా కాదు, కాస్త నాయకత్వ లక్షణాలున్న మనిషి. అవసరమైన సమయాలలో అందరికీ అండగా ఉంటాడు. ఇలా కాలానుగుణంగా మారే వ్యక్తులు, వారి మనసత్వాలను తెలియజేసిన ఈ నవల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

ప్రతులకు:

సాహితీ ప్రచురణలు
33-22-2 చంద్రం బిల్డింగ్స్
చుట్టుగుంట, విజయవాడ-520004
ఫోన్: 812109 8500
పేజీలు 266, వెల రూ.150/-


సమీక్షకులు

జక్కుల సమత

81215 09339

Advertisement

Next Story

Most Viewed