- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కృష్ణమ్మ సాక్షిగా ఆ పని చేసేస్తున్నారు
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఏపీలో విడతల వారీ మద్యపాన నిషేధం.. తెలంగాణ అధికారుల సహకారం.. వెరసి అక్రమ మద్యం వ్యాపారుల పంట పండుతోంది. ఒక్క రాత్రి కష్టపడితే చాలు.. తెల్లారేసరికి రూ.లక్షలు జేబులో పడుతుండడంతో మద్యం వ్యాపారులు ఎంతటి రిస్క్‌కైనా చేసేందుకు వెనకాడడం లేదు. బార్లు, వైన్స్‌లల్లో ఖాళీ ఫుల్ బాటిళ్లు సేకరించడం దగ్గరి నుంచి అధికారులకు అమ్యమ్యాలు ముట్టజెప్పడం వరకు అంతా చకచకా జరిగిపోతోంది. పక్క రాష్ట్రమైన ఏపీలో మద్య నిషేధం.. అక్రమార్కుల పాలిట వరమయ్యింది. చేపల వాహనాల దగ్గరించి ఖాళీ గ్యాస్ సిలిండర్ల వరకు ‘కాదేదీ కవితకు అనర్హం ‘అన్న చందంగా మద్యం అక్రమ రవాణకు అక్రమార్కులు వేయని ఎత్తులేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి మద్యం అమ్మకాలపై క్షేత్రస్థాయిలో ఎక్సైజ్ అధికారులు దృష్టిసారిస్తే.. అక్రమ మద్యం వ్యాపారానికి చెక్ పడడం చాలా సులువనే చెప్పాలి. కానీ దీనిపై ఎక్సైజ్ యంత్రాంగం దృష్టిసారించడం లేదు. ఏవో అడపాదడపా దాడులు చేసి ఒకట్రెండు కేసులు బుక్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్రమ మద్యం దందాపై ‘దిశ’ ప్రత్యేక కథనం..
ఏపీ పంచాయతీ ఎన్నికలతో జోరు..
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ప్రధాన సరిహద్దు జిల్లాగా ఉమ్మడి నల్లగొండ ఉంది. ఇందులోనూ కృష్ణ పట్టె ప్రాంతం మరింత కీలకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుండడంతో అక్కడ మద్యానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఏపీలోని వైన్స్‌ల్లో లిమిటెడ్ బ్రాండ్లకు తోడు పరిమితిలోనే మద్యం లభిస్తోంది. దీంతో మద్యం ప్రియులు బ్రాండ్ కోసం, అక్రమార్కులు విచ్చలవిడి మద్యం కోసం మద్యం అక్రమ రవాణకు పెద్దఎత్తున తెరలేపారు. వాస్తవానికి ఏపీలో మద్యపాన నిషేధం అమలైనప్పటీ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మద్యం అక్రమంగా సరఫరా అవుతోంది. కానీ ఇటీవల ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిత్యం రూ.లక్షల తెలంగాణ మద్యం ఏపీకి తరలుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో తెలంగాణ మద్యం కాటన్లకు కాటన్లు పట్టుబడుతుండడం గమనార్హం.
కృష్ణ పట్టె ప్రాంతమే కేరాఫ్ అడ్రస్..
అక్రమ మద్యం రవాణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్టె ప్రాంతమే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నాగార్జున సాగర్ మొదలుకుని.. కోదాడ వరకు అంతా అక్రమ మద్యం మాఫియా అడుగుజాడలే కన్పిస్తున్నాయి. మద్యాన్ని కృష్ణానదీ పరివాహాక ప్రాంతంలో భారీగా డంప్ చేయడం.. అక్కడి నుంచి నాటు పడవల్లో కృష్ణానది మీదుగా ఏపీకి తరలించడం అక్రమార్కులకు సులభమయ్యింది. నది మీదుగా కాకుండా చేపల వాహనాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బియ్యం బస్తాలు, అంబులెన్సులు, పుచ్చకాయ వాహనాలు ఇలా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఏపీకి భారీగా మద్యాన్ని తరలిస్తున్నారు. సాధారణంగానే ఏపీలో మద్యపాన నిషేధం అమలవుతుండడం.. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు కొనసాగుతుండడంతో లారీలకు లారీల్లో మద్యం తరలుతోంది. ఏపీ, తెలంగాణకు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ మద్యం రవాణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుకూలంగా మారింది.
మంచి బ్రాండ్లకు ఫుల్ డిమాండ్..
ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న వైన్స్‌ల్లో కొన్నిరకాల మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్ముతున్నారు. మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడే.. కొన్ని బ్రాండ్లు అక్కడ అందుబాటులో లేకపోవడంతో అక్రమార్కులు తెలంగాణ నుంచి ఆ బ్రాండ్లను సరఫరా చేస్తున్నారు. ఓసీ క్వార్టర్, ఐబీ, రాయల్ ఛాలెంజ్ తదితరాలకు సాధారణంగానే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే మంచి బ్రాండ్లకు ఎమ్మార్పీ ధరల కంటే డబుల్ ధర చెల్లిస్తుండడంతో కొంతమంది పోలీసు సిబ్బంది సైతం మద్యం అక్రమ రవాణకు తెరలేపారు. ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన లారీ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుంది. దానికి సంబంధించి ముగ్గురు రైల్వే టెక్నిషియన్లు ఖరీదైన 63 మద్యం బాటిళ్లను తరలించే ప్రయత్నం చేశారు. కానీ మరో అక్రమ మద్యం వ్యాపారి ఇచ్చిన సమాచారం మేరకు వారు పట్టుబడ్డారు.
మద్యం అమ్మకాలపై కొరవడిన పర్యవేక్షణ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల పరిధిలోని వైన్స్‌ల నుంచి మద్యం భారీగా తరలుతోంది. దీంతో తరచూ ఫిర్యాదులు చేస్తుండడంతో అధికారులు సైతం అక్రమ మద్యాన్ని పట్టుకోవాల్సి వస్తుంది. దీంతో అక్రమార్కులు రూటును మార్చి.. నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లోని వైన్స్‌ల నుంచి మద్యాన్ని ఎక్కువగా తరలించడం మొదలుపెట్టారు. వాస్తవానికి జిల్లాలోని వైన్స్, బార్లలో మద్యం అమ్మకాలపై క్షేత్రస్థాయిలో అబ్కారీ శాఖ నిఘా పెడిత కొంతమేర ఫలితం ఉంటుంది. కానీ అక్రమార్కులు అమ్యామ్యాలు ముట్టజెప్పి వారి నోటికి తాళం వేస్తున్న విషయాన్ని సిబ్బంది కొట్టిపారేయడం లేదు.