సింహాల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తిపై ఆధారాలు లేవు

by Shyam |
Lions
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్‌జెడ్‌పి), జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఎనిమిది ఆసియా సింహాలు కొవిడ్ నుంచి కోలుకుంటున్నాయని సెంట్రల్ జూ అథారిటీ ప్రకటించింది. జంతువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతున్నట్టుగా ఎలాంటి శాస్త్రీయమైన ఆధారలు లేవని స్పష్టం చేశారు.

జూ పార్క్‌లోని 8 సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించటంతో ఏప్రిల్ 24న వాటి ముక్కు, గొంతు, శ్వాసకోశం నుండి శాంపిల్స్‌ను సీసీఎంబి-లాకోన్స్‌ అధికారులు సేకరించినట్టుగా తెలిపారు. మే 4న సీసీఎంబీ- లాకోన్స్ అధికారులు ఎనిమిది ఆసియా సింహాల్లో సార్స్-కోవీ2 ఉన్నట్టుగా నిర్ధారించారని చెప్పారు. కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే జూ అధికారులు చికిత్సలు చేపట్టడంతో వ్యాధి నుంచి త్వరగా కోలుకున్నాయని తెలిపారు. 8 సింహాలను వేరుగా ఐసోలేషన్ చేసి, తగిన జాగ్రత్తలతో అవసరమైన చికిత్స అందించామని చెప్పారు. సింహాలన్ని సాధారణ స్థితికి చేరుకొని ఆహారం తీసుకుంటున్నాయని వివరించారు. జూ సిబ్బందికి కరోనా సోకకుండా నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు.

సెంట్రల్ జూ అథారిటీ నిబంధనల మేరకు పర్యటకులను అనుమతించకుండా ఇప్పటికే జూను మూసివేసామని చెప్పారు. వ్యాధి వ్యాప్తి అధికమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం జంతు ప్రదర్శనశాలలో చేపట్టాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. జంతువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సెంట్రల్ జూ అథారిటీ అనేక ముందస్తు చర్యలు తీసుకుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed