జమ్మూ,కాశ్మీర్‌కు తిరిగి ప్రత్యేక హోదా తెస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2021-12-05 07:28:34.0  )
Farooq Abdullah
X

శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్ ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. లోయ ప్రాంతంలో తిరిగి ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను దక్కించుకోవడానికి రైతుల వలె త్యాగాలు చేయాలని అన్నారు.

ఎన్సీపీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా యువజన విభాగం నసీంబాగ్‌లోని సమాధి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. తమ పార్టీ హింసకు మద్దతు ఇవ్వదని తెలిపారు. దాదాపు ఏడాది కాలం పాటు రైతు నిరసల తర్వాత నరేంద్ర మోడీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. ‘11 నెలల్లో 700 మంది రైతులు చనిపోయారు. వారి త్యాగాలు చేయడంతోనే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. మనం కూడా మన హక్కులను తిరిగి దక్కించుకోవాలంటే త్యాగం చేయక తప్పదు.

మేము ఆర్టికల్ 370, 35ఎతో పాటు రాష్ట్ర హోదాను వెనక్కి తీసుకొస్తామని ప్రమాణం చేశాం. మేము ఇప్పుడు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైడర్‌పోరా ఎన్ కౌంటర్‌లో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తమ గొంతు ఎత్తినప్పుడే, పరిపాలన విభాగం తిరిగి మృతదేహాలను అప్పగించింది. ఐకమత్యంతోనే ఇది జరిగింది’ అని అన్నారు. ఇప్పటికీ వారిలో ఒకరి మృతదేహాన్ని అప్పగించలేదని పేర్కొన్నారు. జమ్ము, కశ్మీర్‌లో టూరిటం పెరుగుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యాటకమే సర్వస్వమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పార్టీ నుంచి బయటకు లాగడానికి అనేకమంది శత్రువులు సిద్ధంగా ఉన్నారని కార్యకర్తలను హెచ్చరించారు. వారి మాటలు వినకుండా పార్టీతోనే ఉండాలని కోరారు.

Next Story

Most Viewed