కార్మికుల‌ను మోసం చేసిన కాంగ్రెస్‌

by Sridhar Babu |
కార్మికుల‌ను మోసం చేసిన కాంగ్రెస్‌
X

దిశ, హనుమకొండ : అజాంజాహి మిల్లు కార్మికుల‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ శాస‌న‌స‌భ్యులు న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌ అన్నారు. ఆదివారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నిక‌ల ముందు రేవంత్ రెడ్డి అజాంజాహి మిల్లు కార్మికులు ఎక్క‌డ స్థలం కోరితే అక్క‌డ ఇస్తామ‌ని హామీ ఇచ్చారని, కార్మికుల‌ను న‌మ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేశారని ఆరోపించారు. కార్మిక భ‌వ‌నం స‌ర్వే నెంబ‌ర్ మార్చి గొట్టి ముక్క‌ల న‌రేష్ రెడ్డి అనే వ్య‌క్తికి అప్ప‌గించారని, 2015లో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఎమ్మార్వో ద్వారా స‌ర్వే నెంబ‌ర్ మార్చారని ఆరోపించారు. కార్మిక భ‌వ‌న్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. వ్య‌వ‌సాయ భూముల‌ను మాత్ర‌మే మ్యుటేష‌న్ చేసే హ‌క్కు ఉంటుందని, మున్సిపాలిటీ ప‌రిధిలో ఇంటి నెంబ‌ర్ ఉన్న భ‌వ‌నాన్ని మ్యుటేష‌న్ చేసిన ఎమ్మార్వోపై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. వెంట‌నే ఇత‌రుల‌కు ఇచ్చిన కార్మిక భ‌వ‌న్ భూమి హ‌క్కుల అనుమ‌తుల‌ను ర‌ద్దు చేయాలన్నారు.

నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేయాలని తెలిపారు. మేడే వ‌ర‌కు కార్మికుల‌కు న్యాయం చేయ‌కుంటే, కార్మికులంతా నిర‌స‌న తెలుపుతారని, వ్య‌క్తి గ‌తంగా భ‌వ‌నాన్ని నిర్మించుకుంటారని పేర్కొన్నారు. దొంగే దొంగ అన్న‌ట్టు అర్ధరాత్రి కార్మిక భ‌వ‌నాన్ని కూల్చేసి కొండా ముర‌ళి ప్రైవేట్ వ్య‌క్తుల‌తో క‌లిసి కొబ్బ‌రికాయ కొట్టింది నిజం కాదా ?, కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కార్మిక భ‌వ‌న్ భూమిని మ్యుటేష‌న్ చేయలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ హ‌యాంలోనే అజాంజాహి మిల్లు మూత‌ప‌డింది అన్నారు. ఆనాడు 451 మంది కార్మికులు ఉంటే 318 మందికి అన్యాయం చేసి 131 మందికి స్థ‌లాలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కుడా స్థ‌లాలను అమ్ముకున్న‌ది నిజం కాదా అన్నారు.

సుప్రీంకోర్టు 131 మందికి ఇచ్చిన‌ట్టే 318 మందికి స్థ‌లాలు ఇవ్వాల‌ని తీర్పు ఇచ్చిందని, సుప్రీం కోర్టు స‌ర్వే నెంబ‌ర్లతో స‌హా ఏ స్థ‌లం కార్మికుల‌కు కేటాయించాల‌ని చెప్పిందో ఆ స్థ‌లాన్నే ఇవ్వాలి అని అన్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా అజాంజాహి మిల్లు స్థ‌లాల‌నే ఇస్తామ‌ని హామీ ఇచ్చి ఇప్పుడు కార్మికుల‌ను అవమానించేలా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు అని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం అజాంజాహి మిల్లు కార్మికుల‌కు ప‌ట్టాలు ఇవ్వాలని, కార్మిక భ‌వ‌న్ స్థ‌లాన్ని తిరిగి కార్మికులకు అప్ప‌గించాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో అజంజాహి మిల్లు కార్మికులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed