నైపుణ్యం గల డాక్టర్లు లేక విఫలమవుతున్న లింగ మార్పిడి సర్జరీలు

by GSrikanth |
నైపుణ్యం గల డాక్టర్లు లేక విఫలమవుతున్న లింగ మార్పిడి సర్జరీలు
X

దిశ, ఫీచర్స్ : లింగమార్పిడి వ్యక్తుల హక్కులను పర్యవేక్షించేందుకు భారతదేశంలో ప్రత్యేక చట్టం అమలవుతోంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) రూల్స్-2020 ద్వారా లింగమార్పిడి వ్యక్తుల హక్కులను నిర్వచించారు. ఇండియాలో ఎవరైనా తమ జెండర్‌ డిక్లేర్ చేసేందుకు, తాము మారిన జెండర్‌కు అధికారిక గుర్తింపు పొందేందుకు అర్హులు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జెండర్ చేంజ్ చేసుకోవాలనే వ్యక్తులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లింగమార్పిడి శస్త్రచికిత్స(SRS)లు సహా కౌన్సెలింగ్, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(హెచ్‌ఆర్‌టి) ఉచితంగా పొందవచ్చు. ఈ సేవల కల్పనకు ప్రతీ రాష్ట్రం తప్పనిసరిగా కనీసం ఒక ప్రభుత్వ ఆస్పత్రిని కలిగి ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనూ ఈ సేవలకు(కౌన్సెలింగ్‌, SRS) అయ్యే ఖర్చును స్టేట్ మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందని కూడా నిబంధనలు నిర్దేశించాయి. అయినప్పటికీ శస్త్రచికిత్సలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విషయంలో వారికి చుక్కెదురవుతోంది. కాగా ఈ విషయంలో TALMS అనే స్వచ్ఛంద సంస్థ వారికి ఉచిత సేవలు అందిస్తోంది. ప్రైడ్ మంత్ సందర్భంగా ఈ ఎన్‌జీవో విశేషాలు..

లింగ మార్పిడి చికిత్స (సెక్స్ రీఎసైన్‌మెంట్ సర్జరీ) చేసుకునేందుకు వ్యక్తలు కనీస వయసు 20 ఏళ్లు. అంతకంటే తక్కువ వయసుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. అయితే ఈ ఆపరేషన్‌కు ముందు జెండర్ డిస్ఫోరియా (శరీర తత్వానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా/లేదా) ఉన్నట్లయితే మొదట హార్మోనల్ థెరపీ చేస్తారు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఎస్‌లో భాగంగా వక్షోజాలు, జననాంగం, ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. మొత్తంగా ఈ ఆపరేషన్‌కు కనీసం 5-6 గంటలు పట్టనుండగా.. స్త్రీలను పురుషులుగా మార్చే చికిత్సకు ఇంకాస్త ఎక్కువ సమయమవుతుంది. ఇందులో ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ(FFS), బ్రెస్ట్ బలోపేత, వాజినోప్లాస్టీ, బాడీ కాంటౌరింగ్, థైరోప్లాస్టీ వాయిస్ సర్జరీ తదితర శస్త్ర చికిత్సలు ఉంటాయి. ట్రాన్స్‌జెండర్ పురుషులకు మాస్టెక్టమీ, హిస్టెరెక్టమీ, మెటోయిడియోప్లాస్టీ, ఫాలోప్లాస్టీ వంటి కొన్ని కీలక సర్జరీలు ఉంటాయి.

ఆపరేషన్ తర్వాత ఏడాదిపాటు హార్మోనల్ థెరపీ కూడా చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రక్రియకు రూ.5-20 లక్షలు ఖర్చవుతాయి. వాస్తవానికి శస్త్రచికిత్సల సగటు ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే, ఆ ఖర్చులకు నిధులు సమకూర్చుకోవడం వారికి అతిపెద్ద భారం కాగా.. చిన్నచూపు కారణంగా ఉద్యోగాలు కూడా దక్కడం లేదు. చాలా మంది ట్రాన్స్ వ్యక్తులు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నందున రుణాలు పొందడమూ అసాధ్యమే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లింగమార్పిడి వ్యక్తుల సర్జరీలకు గ్రాంట్స్ పొందడంలో సాయపడేందుకు ఏర్పడిందే ట్రాన్స్ ఆల్మ్స్(TALMS). ఇది భారతదేశానికి చెందిన ఈ స్వచ్ఛంద సంస్థను మన్ చవాన్ ఏర్పాటు చేశాడు.

ఆర్థిక మద్దతు :

SRS కోరుకునే వ్యక్తి సహాయక వాతావరణాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యమని TALMS భావిస్తోంది. అయితే టీఆల్మ్స్ గ్రాంట్ పొందేందుకు, దరఖాస్తుదారుడు వైద్య సంస్థలు నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. దరఖాస్తుదారులందరూ దీనికి అనుగుణంగా ఉండాలి. ఈ మేరకు సదరు వ్యక్తి ఈ కింది లేఖలు కలిగి ఉండాలి.

* సైకియాట్రిస్ట్ జెండర్ డిస్ఫోరియా లెటర్ : లైసెన్స్ పొందిన సైకియాట్రిస్ట్‌ల ద్వారా జారీ చేసిన లేఖ

* HRT : హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ లెటర్‌ను ధృవీకరించిన ఎండోక్రినాలజిస్ట్ లెటర్.

* ఐడెంటీ ప్రూఫ్ : పేరు, వయసు, చిత్రాన్ని ధృవీకరించే ఓ గుర్తింపు పత్రం

* అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి TALMS వెబ్‌సైట్‌లో ఫామ్‌ ఫిల్ చేయాలి.

* దరఖాస్తుదారుడి నేపథ్యం, ఆర్థిక స్థితి, పరివర్తన ప్రయాణాన్ని అర్థం చేసుకునేందుకు దరఖాస్తు పత్రం ఉపయోగపడుతుందని టీఆల్మ్స్ డైరెక్టర్ చవాన్ పేర్కొన్నాడు.

* ఈ ప్రక్రియ తర్వాత సదరు సంస్థ.. కౌన్సెలర్‌తో కాల్‌ను షెడ్యూల్ చేస్తుంది. కాల్ తర్వాత, ప్రక్రియపై సరైన అవగాహన కోసం దరఖాస్తుదారునికి ఎంఓయూ పంపిస్తారు.

* అప్లికెంట్ తమ సర్జరీ సహా తాము ఎంచుకున్న వైద్యుడికి చెల్లించే ఖర్చు వివరాలను పంపాల్సి ఉంటుంది. MoUతో పాటు పేపర్లు ప్రాసెస్ చేసిన తర్వాత, టీఆల్మ్స్ వారి సైకాలజిస్ట్‌తో మరొక కాల్‌ను షెడ్యూల్ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత ఆస్పత్రి/క్లినిక్‌తో కన్సల్టేషన్ పత్రాలను ధృవీకరించుకుని చవాన్ వారితో వీడియో కాల్‌లో మాట్లాడతాడు.

* చివరగా దరఖాస్తుదారులకు సెల్ఫ్-డిక్లరేషన్ సెండ్ చేస్తారు. ఒకసారి సెల్ఫ్-డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాత, అప్లికెంట్‌కు అమౌంట్ గ్రాంట్ అందించే నెల సంబంధిత వివరాలతో కూడిన ఫైనల్ లెటర్ సెండ్ చేస్తారు. ఆపరేషన్ నగదు ఆస్పత్రి ఖాతాలో, సర్జరీ తర్వాత సంరక్షణ కోసం 10శాతం వ్యక్తిగత అకౌంట్‌లో గ్రాంట్లు జమ చేస్తారు.

ఇండియాలో లింగమార్పిడి వ్యక్తులకు కుటుంబ ఆమోదం చాలా తక్కువ. భావోద్వేగ మద్దతు ఉన్నప్పటికీ అది ఆర్థిక మద్దతును అందించదు. ఇక SRS కోరుకునే వ్యక్తులకు ఎదురయ్యే ప్రధాన సవాళ్లలో శస్త్రచికిత్సల భయం ఒకటి. 'అధికారిక సర్వేలు ఏవీ చేయనప్పటికీ సౌందర్యం, కార్యాచరణ పరంగా చాలా శస్త్రచికిత్సలు దెబ్బతిన్నాయి. నిజానికి చాలామంది వైద్యులు ఈ శస్త్ర చికిత్సల్లో నైపుణ్యం కలిగి లేరు. ట్రాన్స్ వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడం కంటే వాణిజ్య లాభం కోసం ఈ తరహా సర్జరీలు చేసే వారి సంఖ్య పెరిగింది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల విషయానికొస్తే.. అవి ఈ ప్రక్రియకు సున్నితమైన విధానాన్ని అందించడంలో విఫలమవుతున్నాయి. సిబ్బందిలో ట్రాన్స్‌జెండర్ల గురించి అవగాహన ఉండకపోవడం ఒక సమస్య అయితే పక్షపాతం మరొక అంశం. ఈ కారణంగానే ట్రాన్స్‌జెండర్లు ప్రైవేట్ క్లినిక్స్, ఆస్పత్రులను ఎంచుకుంటున్నారు. నిధుల సేకరణ కోసం మాకు అనేక ఎంపికలు ఉన్నాయి. వ్యక్తిగత నిధులు సహా కార్పొరేట్‌ నిధులు సేకరిస్తాం. కంపెనీలు మా వెబ్‌సైట్ ద్వారా CSR నిధులను కూడా ఉపయోగించవచ్చు. దీనికి 80g, 12A ప్రయోజనాలు పొందవచ్చు. NGO, HNI, కమ్యూనిటీ సమూహాలను కూడా సంప్రదిస్తాం.

- మన్ చవాన్, TALMS ఫౌండర్, డైరెక్టర్

Advertisement

Next Story

Most Viewed