జంతు ప్రేమికులకు బిగ్ అలర్ట్.. ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-02 11:53:45.0  )
జంతు ప్రేమికులకు బిగ్ అలర్ట్.. ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల
X

పెట్స్​పెంచుకోవడం ఇప్పుడు స్టేటస్​సింబల్. ఇంట్లో ఏదో ఒక పెట్..​అది కూడా ఫారిన్​బ్రీడ్​అయితే ఆ కక్కే వేరప్పా అని నగరవాసులు మురిసిపోతున్నారు. నగరంలో ఇప్పుడు పెట్ లవర్స్ ఎక్కువయ్యారు. పెంపుడు జంతువులను కడుపున పుట్టిన పిల్లల మాదిరిగానే చూసుకుంటున్నారు. పేద, ధనిక అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరూ వాటిపై ఎనలేని ప్రేమాభిమానాలు చాటుకుంటున్నారు. కొందరు ప్రాణంతో సమానంగా చూస్తే.. మరికొందరు వాటినే సర్వస్వంగా భావిస్తారు. సమయానికి ఆహారం పెడుతూ.. వాటి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, పెట్స్​పెంచుకోవడంపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని తు.చ. తప్పకుండా ఫాలో అయితేనే భవిష్యత్​లో ఇబ్బందులు కలుగకుండా ఉంటుంది. డాగ్​ఓనర్స్‌తో పాటు, పెట్ బ్రీడింగ్ చేస్తున్న వారికి జీహెచ్ఎంసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవేమిటో తెలుసుకుందాం. = కల్లేపల్లి రవిచంద్ర

జాగ్రత్తలు తప్పనిసరి..

విశ్వాసానికి మారుగా భావించే కుక్కలను ప్రస్తుతం ధనికులే కాకుండా మధ్య తరగతి వారు సైతం పెంచుకుంటున్నారు. కొందరు కుక్కల తర్వాత పిల్లులను కూడా పెంచుకుంటున్నారు. అయితే పెంపుడు జంతువులకు ఆహారాన్ని అందిస్తూ మనిషిని చూసుకుంటున్నట్లు చూసుకుంటారు. అయితే, ఏదో ఒక సందర్భంలో అవి గాయపర్చితే.. పెంచుకుంటున్నదే కదా అని అసలే నిర్లక్ష్యం చేయవద్దు. తక్షణమే రెబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఏమి కాదులే అని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. కొన్ని పెంపుడు కుక్కలు సైతం రోడ్డెక్కి దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కుక్కులు పిల్లల ప్రాణాలు తీస్తుండటం అందరినీ కలిచివేస్తున్నది. రోడ్డు మీద నడిచి వెళ్లేవారిపై, యజమానులు, వారి కుటుం సభ్యులపై దాడికి పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి.

సోషలైజ్​చేయడం మానొద్దు..

నిజానికి చాలామంది కుక్కలను పెంచుకునేవాళ్లకు ఆ కుక్క ఏ రకం..? అది ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది.? కంట్రోల్​చేయడం ఎలా? దానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి.? వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి? అనే బేసిక్స్​కూడా తెలియవు. ఎవరో పెంచుకుంటున్నారు? చూడటానికి చాలా భీకరంగా ఉంది? అని తెచ్చేసుకుంటున్నారు. తీరా అది ఇంటికి వచ్చాక దానికి ఎలా ట్రైనింగ్​చేయాలో తెలియక? ఆహారం ఏది? ఎలా ఇవ్వాలో తెలియక? ఊరు అవతలికి తీసుకెళ్లి.. వదిలేసి వచ్చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. కుక్కను పెంచుకోవాలని అనుకున్నప్పుడే ఏ రకం కుక్క తీసుకోవాలి? అందుకు తగిన పరిస్థితులు ఇంట్లో ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా అపార్ట్​మెంట్లలో ఉండేవాళ్లు డాబర్​మెన్, జర్మన్​షెపర్డ్​లాంటి భారీ కుక్కులను పెంచుకుంటే వాటి అరుపులకు అపార్ట్​మెంట్​మొత్తం దద్దరిల్లిపోతుంది. అందుకే అపార్ట్​మెంట్​లో ఉండేవాళ్లు బాసెంజీ లాంటి తక్కువ శబ్దంతో అరిచే కుక్కలను తీసుకోవడం బెస్ట్. అదే సమయంలో శునకాలను ఇతర డాగ్స్, మనుషులతో కలిసి ఉండేలా సోషలైజ్​చేయాలి. ఇప్పుడు హైదరాబాద్​లో కూడా డాగ్​ట్రైనర్స్​అందుబాటులో ఉన్నారు. లేకపోతే కుక్కలు కొత్తవారిని చూడగానే అటాకింగ్​మోడ్​లోకి వెళ్లి.. వారిని భయపడేలా చేస్తాయి. అలా కాకుండా యజమానికి వారితో వ్యవహరిస్తున్న తీరుని గమనించి నడుచుకునే కుక్కలను ట్రైనింగ్​చేయవచ్చు.

పెట్ బ్రీడర్స్‌కు అడ్డుకట్ట..

జీహెచ్ఎంసీ పరిధిలో పెంపుడు జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టాలని, డాగ్ బ్రీడర్స్ (కుక్కల పెంపకం దారులు, అమ్మకం దారులు) అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సైతం జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 2017 నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోనూ తెలంగాణ స్టేట్ యానిమిల్ వెల్ఫేర్ బోర్డు రిజిస్ట్రేషన్ కలిగి ఉండేలా డాగ్ బ్రీడర్స్ కు అవగాహన కల్పిస్తున్నారు. డాగ్ బ్రీడింగ్ యాక్టివిటీ చేసే వారందరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆన్‌లైన్ విక్రయాలు అక్రమం..

ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్ స్టా వంటి సోషల్ మీడియా నెట్ వర్కింగ్ ద్వారా అధికారిక, అనధికారిక ప్రకటనలతో కుక్క పిల్లల క్రయవిక్రయాలు జరపడం అక్రమమని అధికారులు పేర్కొంటున్నారు. ఆన్ లైన్ ద్వారా కుక్క పిల్లల క్రయ విక్రయాలకు తెలంగాణ స్టేట్ యానిమిల్ వెల్ఫేర్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆన్ లైన్ లో ఇలాంటి లావాదేవీలు,వ్యాపారాలపై ఐటీ శాఖ నిఘా వేసి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకోసం పశు సంవర్ధకశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డైరెక్టర్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల సహకారంతో రిజిస్ట్రేషన్ లేని డాగ్ బ్రీడర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు జాయింట్​యాక్షన్​ప్లాన్​సిద్ధం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

గ్రేటర్ హైదరాబాద్ లో కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పెట్ డాగ్స్ ఓనర్స్ కు కమిషనర్​కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లల్లో పెంచుకునే కుక్కల వివరాలు తప్పనిసిగా మున్సిపల్​అధికారులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని అన్ని పెంపుడు కుక్కలు, బ్రీడర్స్ వివరాలను సంబంధిత యాజమానులు జీహెచ్ఎంసీలో నమోదు చేసుకోవాలని కమిషనర్ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. నమోదు చేసుకోనివారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని, భారీ జరినామాలను విధించే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఒక్క హైదరాబాద్​లోనే 50వేల వరకు పెంపకపు శునకాలు ఉన్నాయి. జీహెచ్​ఎంసీలో రిజిస్టర్​అయినవి వెయ్యిలోపేనని సమాచారం. దీనివల్ల అధికారులు శునకాల సంరక్షణకు చర్యలు తీసుకోలేకపోతున్నారు.

ఫారిన్​బ్రీడే ముద్దు.. మరి లోకల్!!

హైదరాబాద్​నగరంలో 50వేల వరకు పెంపకపు డాగ్స్​ఉన్నాయి. వీటిలో 95% వరకు ఫారిన్​బ్రీడ్లే. రూ.10వేల నుంచి లక్షలు వెచ్చించి మేలురకమైన శునకాలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్​నుంచి ఓ అరుదైన డాగ్​బ్రీడ్​ని రూ.20కోట్లు చెల్లించి కొనుగోలు చేశాడు. కౌకాసియన్​షెపర్డ్​జాతికి చెందిన ఈ 1.5 ఏళ్ల శునకం ప్రపంచంలోనే అరుదైన జాతుల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది 45 నుంచి 70కిలోల వరకు బరువు పెరుగుతుందట. దీంతో లోకల్​కుక్కలను పెంచుకోవడం దాదాపుగా తగ్గిపోయిందని డాగ్​బ్రీడర్స్​చెప్తున్నారు. అయితే, లోకల్​బ్రీడ్స్ ని కంట్రోల్​చేయడం కష్టమని.. పైగా ఫారిన్​బ్రీడ్స్​పెంచుకోవడం స్టేటస్​సింబల్​కావడంతో దాదాపుగా అందరూ ఫారిన్​బ్రీడ్సే కోరుతున్నారని వెల్లడించారు.

మలం ఎత్తాల్సిందే..

డాగ్స్​ని పెంచడం పసిపిల్లల పెంపకంతో సమానం. పిల్లలను ఎలా సంరక్షించుకుంటామో.. పెట్స్​ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి స్నానం, నెయిల్స్.. హెయిర్​కటింగ్ అన్నింటికన్నా ముఖ్యంగా బ్రీడ్​ని బట్టి ఆహారం ఇవ్వాలి. కుక్కలను మల విసర్జన కోసం రోజూ ఒకే సమయంలో బయటకు తీసుకెళ్లాలి. లేదంటే దాని పొట్టలో నులిపురుగులు పెరిగి అనారోగ్యం బారిన పడవచ్చు. రోడ్డుపైకి తీసుకెళ్లినప్పుడు మల విసర్జన చేసినప్పుడు ఆ మలాన్ని అలాగే వదిలేయకుండా దానిని ఎత్తి.. చెత్తబుట్టలో పడేసేలా అలవాటు చేసుకోవాలి. లేదంటే రోడ్లన్నీ కుక్కల మల విసర్జనతో అపరిశుభ్రంగా మారుతాయి. ఇందుకు పూప్​బ్యాగ్స్​మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

అందుబాటులో మొబైల్ యాప్..

పెట్ డాగ్స్ ఓనర్స్, బ్రీడర్స్ (కుక్కల అమ్మకం, కొనుగోలు దారులు) తమ పెంపుడు కుక్కల వివరాలను మై జీహెచ్​ఎంసీ యాప్​లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్​చేసుకున్న కుక్కల వివరాలు ఆధారంగా వాటిని సంబంధించిన సమాచారం ఇవ్వడంతోపాటు వ్యాక్సినేషన్​డేట్లపై ముందుగానే రిమైండర్లు ఇస్తారు. ప్రభుత్వ పశు వైద్యశాల చిరునామా, వైద్యుల వివరాలు మొబైల్​కి పంపుతారు. మూగ జీవుల సంరక్షణ చట్టాలు, నిబంధనల గురించి యాజమానుల ఫోన్ నంబర్లకు ఎప్పటికప్పుడు సమచారం అందిస్తారు. ఒకవేళ కుక్కలు మరణిస్తే.. ఆ సమచారం యాప్​లో ఇచ్చినా.. సిబ్బంది కుక్కల మృతదేహాలను ఉచితంగా తరలిస్తారు. ఇందుకోసం జోన్ల వారీగా అధికారుల వివరాలను సైతం అందుబాటులో ఉంచారు. ఏమైనా సందేహలు, సలహాల కోసం కింది నంబర్లలో సంప్రదించవచ్చు..


రిజిస్ట్రేషన్‌తో లాభాలు

యజమానులు పెంపుడు కుక్కలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా జీహెచ్ఎంసీ వెబ్ సైట్ గానీ, మొబైల్ యాప్‌లో చేసుకోవచ్చు. పెట్ డాగ్స్ ఓనర్స్ అయినా. బ్రీడర్స్ అయినా జీహెచ్ఎంసీ యాప్ లోకి ఎంట్రీ అయిన తర్వాత మొబైల్ ఎంట్రీ చేస్తే ఓటిపి వస్తోంది. ఓటీపీని ఎంటర్ చేస్తే యాజమాని పేరు,మొబైల్ నంబర్ అప్షన్లు వస్తాయి. డాగ్ ఫొటోను యాప్ లోడ్ చేయగానే రిజిస్ట్రేషన్ కోసం ఓ నంబర్ జనరేట్ అవుతోంది. మీ డాగ్ ఫొటోతో రిజిస్ట్రేషన్ నంబర్ రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ఉచితంగా ఇస్తారు. టీకాల సమయం నమోదు చేసి.. అలర్ట్ చేస్తారు. డాగ్‌పై ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్..​యజమానులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

డాక్టర్ సద్గుణ, సికింద్రాబాద్ జోన్ సహాయ సంచాలకులు

Advertisement

Next Story

Most Viewed