Procrastination: వాయిదా రోగం..! అనేక సమస్యలకు అదే కారణం!!

by Javid Pasha |   ( Updated:2024-09-10 08:26:41.0  )
Procrastination: వాయిదా రోగం..! అనేక సమస్యలకు అదే కారణం!!
X

దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేద్దామనుకుంటాం కానీ లేవలేకపోతాం.. ఈ రోజు తప్పకుండా ఫలానా పనిచేయాలనుకుంటాం.. కానీ రేపు చేసేద్దాం లే.. అనుకొని వెనుకడుగు వేస్తాం. ఇలా ఒకటో రెండో విషయాల్లో కాదు, రోజువారీ అనేక అంశాల్లో పనులను వాయిదా వేసే అలవాటు చాలామందికి ఉంటుంది ఉంటుంది. ఈ విధంగా చేయడమంటే సమయాన్ని వృథా చేయడమేనని, ఒక విధంగా చెప్పాలంటే వాయిదాలు వేసే అలవాటు రోగంతో సమానమని, అనేక సమస్యలకు అది కారణం అవుతుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. నిజానికి ప్రతీ వందలో 90 మంది తమకు తెలియకుండానే వాయిదాలు వేస్తుంటారని, కానీ దీవల్ల నష్టపోయే అవకాశాలే ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యమైన పనులు, నిర్ణయాల సందర్భంలోనూ రేపు, ఎల్లుండి అనుకుంటూ కూర్చుంటే పోటీ ప్రపంచంలో విజయం సాధించడం కష్టం అంటున్నారు నిపుణులు. అందుకే మిమ్మల్ని మీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

తెలిసి కూడా నిర్లక్ష్యమా?

ఒక పనిని మీరు ఎందుకు వాయిదా వేస్తున్నారు? తెలిసి కూడా అదే చేస్తున్నారా? ఈ విషయంలో ముందుగా ఓ క్లారిటీ ఉండాలంటున్నారు నిపుణులు. వాస్తవానికి మీరు అనుకున్న పని చేయడం కష్టమా? మీవల్ల సాధ్యం కాదా? అలాంటివేమీ కానప్పటికీ, నష్టపోతామని తెలిసి కూడా కేవలం బద్దకంవల్ల మాత్రమే వాయిదా వేస్తున్నారా? ఈ పద్ధతినే ‘ప్రోక్రాస్టినేషన్’గా నిపుణులు పేర్కొంటున్నారు. రెండు నిమిషాలు సమయం కేటాయిస్తే అయిపోయే పనిని కూడా వాయిదా వేయడం ఈ విధమైన మనస్తత్వంగల వారి లక్షణంగా కనిపిస్తుంది. దీనివల్ల తర్వాత నష్టపోతారు. చివరికి మెసేజ్ చెక్ చేసుకోవడం, రిప్లై ఇవ్వడం, మెయిల్స్ పంపడం వంటివి కూడా ఎవరైనా వాయిదా వేస్తున్నారంటే వారిని ‘వాయిదా రోగులు’గా పేర్కొంటున్నారు నిపుణులు. జీవితంలో ఇలాంటి వారు సక్సెస్ అవ్వడం కష్టం. కాబట్టి ఈ అలవాటును మార్చుకోవాలి.

టైమ్ పాటించండి

మీరు ఆఫీసుకు టైమ్‌కు వెళ్లాలనుకుంటారు కానీ వెళ్లలేరు.. మరుసటి రోజు టైమ్ పాటించాలనుకుంటారు కానీ.. మళ్లీ అదే ధోరణి.. అలాంటప్పుడు మధ్యలో ట్రాఫిక్, జర్నీ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కవర్ చేస్తూ టైమ్‌కు చేరేలా కాస్త ముందుగానే బయలు దేరడం బెటర్ అంటున్నారు నిపుణులు. అలాగే వ్యాయామం ప్రారంభించాలనుకుంటే విషయంలో కూడా తర్వాత చేద్దాం అనుకుంటూ ఉంటారు. అనేక విషయాల్లో ఈ వాయిదా పద్ధతిని మార్చుకోవాలి. తగిన ప్రాక్టీస్ ద్వారా కూడా వాయిదా మనస్తత్వం నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఒకేసారి అనుకున్నది చేయడం ఇబ్బందిగా అనిపిస్తే క్రమంగా ప్రయత్నం ప్రారంభించాలి. అంతేగానీ రేపు, ఎల్లుంటి అని సమయం వృథా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో క్రమంగా వాయిదాల అలవాటు మీ నుంచి దూరంగా పారిపోతుందంటున్నారు నిపుణులు.

పరిశీలన ముఖ్యం

ఒక పని సక్రమంగా లేదా సమయానికి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ముందుగానే ఊహించుకుంటే.. అప్పుడు మీలో సానుకూల ఆలోచనలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎప్పటి పనులు అప్పుడు చేయడంవల్ల వచ్చే మార్పులు, పొందిన ఫలితాలు, ప్రశంసలు, మానసిక ప్రశాంతతను ఇస్తాయనేది గుర్తుంచుకోండి. అనుభవంలోనూ ఇది ఎదుర్కొంటే గనుక మరోసారి గుర్తు తెచ్చుకోండి. దీంతో మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే పనులు వాయిదా వేస్తున్న కొద్దీ ఏదో భారం మోస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆందోళనకు గురవుతుంటారు. కాబట్టి వాయిదా వేయడం, వేయకపోవడం అనే రెండు విషయాలను ఒక్కసారి విశ్లేషించుకుంటూ ముందుకు సాగితే వాయిదా వేసే పద్ధతిని వదులుకోవాలని ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరే దానిని వదిలేస్తారని నిపుణులు చెప్తున్నారు.

పరధ్యానం వదులుకోండి

కారణాలేమైనా ఉండవచ్చు. మానసిక ఆందోళన, కుటుంబ, ఆర్థిక సమస్యలు, బయటి పరిస్థితుల్లో ఎదురయ్యే చేదు అనుభవాలు వంటివి కొన్నిసార్లు మీలో పరధ్యానానికి కారణం అవుతుంటాయి. దీంతో వర్కులో ప్రొడక్టివిటీ, క్వాలిటీ తగ్గవచ్చు. ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. ఆ తర్వాత రేపు, ఎల్లుంటి అంటూ వాయిదా వేస్తుంటారు. కానీ చివరికి నష్టపోయేది మీరే. కాబట్టి పరధ్యానాన్ని కలిగించే అంశాల జోలికి వెళ్లకపోవడం మంచిదని మానసిక నిపుణులు సూచిస్తు్న్నారు. ఒకవేళ మీరు పనిభారం ఎదుర్కొంటూ ఉంటే దానిని విభజించి, సమయం ప్రకారం పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. దీంతో రేపు చేయాల్సింది ఈ రోజే పూర్తి చేసే అవకాశం ఉంటుందని, మీలోని వాయిదా పద్ధతిని అది దూరం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మీకున్న వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల ఆలోచనలు పెంచుకోవడం వంటివి క్రమంలో మీలో మార్పునకు కారణం అవుతాయని, వాయిదా వేసే పద్ధతిని దూరం చేస్తాయని మానసిక నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed