- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pleasing : ఇతరుల మెప్పుకోసం మారిపోతున్నారా?.. కష్టాలు తప్పవంటున్న నిపుణులు!
దిశ, ఫీచర్స్ : నలుగురు నడిచిన దారిలో నడవడం మంచిదే.. కానీ ఎల్లప్పుడూ అదే కరెక్ట్ అని చెప్పలేం. నలుగురు మెచ్చేలా మసలుకోవడం ముఖ్యమే.. కానీ అదే ఆల్‌టైమ్ కంఫర్టబుల్ కాకపోవచ్చు. అందుకే సొంత ఆలోచన కొంతైనా ఉండాలంటారు మానసిక నిపుణులు. అలాంటప్పుడే మనకంటూ ఒక వ్యక్తిత్వం, ప్రవర్తన, హుందాతనం ఏర్పడతాయి. మంచి గర్తింపును తెస్తాయి. అంతే తప్ప వాస్తవంతో సంబంధం లేకుండా ఇతరుల మెప్పుకోసం మన ప్రవర్తన మార్చుకోవడం వల్ల నష్టపోతామని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.
నిరంతరం నేర్చుకుంటూ..
మనిషికి ఎంత తెలిసినా తెలియనివి చాలా ఉంటాయి. అందుకే మనం నిరంతర విద్యార్థులుగా ఉండాలంటారు నిపుణులు. అలాంటప్పుడే మనకు అనేక అనుభవాలు ఏర్పడతాయి. సమాజం నుంచి నేర్చుకుంటాం. దీని ద్వారా మనకంటూ ఒక అవగాహన, వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటాయి. దీనివల్ల ఓన్ బిహేవియర్ డెవలప్ అవుతుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావంవల్లో, భయాందోళన కారణంగానో తమ సొంత ప్రవర్తనను విస్మరిస్తుంటారు పలువురు. అన్నీ మరచిపోయి ఇతరుల మెప్పుకోసం మాత్రమే జీవిస్తుంటారు. వారికి అనుగుణంగా ప్రవర్తనను మార్చుకుంటారు. ఇక్కడే లైఫ్ రిస్కులో పడుతుందని నిపుణులు అంటున్నారు.
మార్పు అవసరమే కానీ..
సమాజంలో సక్సెస్ ఫుల్ వ్యక్తులను లేదా కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉండే వారిని అనుసరించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తమ ప్రవర్తన మార్చుకుంటూ ఉంటారు. ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని మన పద్ధతిలో మనం సక్సెస్ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఒకరి మెప్పుకోసం మన వ్యక్తిత్వాన్ని లేదా సొంత ఆలోచనను పక్కన పెట్టి, ఎదుటి వ్యక్తికోసం మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడం మాత్రం సరికాదంటున్నారు నిపుణులు.
సొంత ఆలోచలు విస్మరిస్తే..
‘‘ఒక రంగంలో రాణించాలంటే.. అక్కడ ఎదగడానికి అవసరమైన మెళకువలు నేర్చుకోవాలి. తెలియని విషయాలు తెలుసుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన పుస్తకాలు చదవాలి. అంతే తప్ప ఇవేవీ చేయకుండా ఇతరుల మెప్పును పొందడం ద్వారా ఏదో సాధిస్తామని తమ ప్రవర్తనను మార్చుకుంటే కొన్నిసార్లు తాత్కాలికంగా విజయం సాధించవచ్చు. కానీ అది ఎక్కువకాలం నిలబదు’’ అంటున్నారు పర్సనల్ స్కిల్స్ ట్రైనర్ రాధికా భాటియా. అందుకే వివిధ అంశాల్లో ఇతరుల కోరికలు తీర్చడానికో, వారిని సంతోష పెట్టడానికో కష్టపడుతూ మీ సొంత ఆలోచనలను, శ్రమను విస్మరించవద్దని సూచిస్తున్నారు.
ఎందుకలా చేస్తారు?
కొందరు ఇతరుల మెప్పుకోసం ప్రయత్నించడం, అందుకు అనుగుణంగా తమ బిహేవియర్ మార్చుకోవడానికి ప్రధాన కారణం సామాజిక స్పృహ లేకపోవడం, సొంత వ్యక్తిత్వం రూపుదిద్దుకోకపోవడం కూడా ఒకటి అని నిపుణులు చెప్తున్నారు. ఆయా వ్యక్తులు పుట్టి పెరిగిన పరిస్థితులో, మనసులో బలంగా నాటుకుపోయిన భావాలో కూడా కొన్నిసార్లు ఇందుకు కారణం కావచ్చు. అలాగే చిన్నప్పుడు కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడం, తల్లిదండ్రులు, చుట్టు పక్కల వ్యక్తుల ద్వారా ఇబ్బందికరమైన అనుభవాలు, అవమానాలు ఎదుర్కోవడం, ఎప్పుడూ ప్రశంసించబడకపోవడం వంటివి కూడా ఇలాంటి ప్రవర్తనకు దారితీయవచ్చు.
ఆత్మస్థైర్యం కోల్పోవచ్చు!
దీర్ఘకాలంపాటు మానసిక ఆందోళనకు గురైన వ్యక్తులు, కష్టాల్లో నుంచి ఇక బయటపడలేమని భావించడంవల్ల మానసిక రుగ్మత బారిన పడినవారు, తమపై తాము నమ్మకాన్ని, ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటప్పుడు వారు ఇతరులు కాస్త పొగిడినా, మెచ్చుకున్నా లేదా భయపెట్టినా వారికి అనుగునంగా మసలు కోవడం ప్రారంభిస్తారు లేదా వారి మెప్పుకోసం తమ ప్రవర్తన మార్చుకుంటారు. తాము అనుకున్నది సాధించాలంటే ఇతరులు చెప్పిందే పాటించాలనుకుంటారు. అదే సరైన మార్గంగా భావించడంవల్ల ఇలా చేస్తారు. కానీ ఈ అలవాటు క్రమంగా సొంత వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. తాము మంచివాళ్లం అనిపించుకోవాలనే ఆరాటం, అందరి ప్రేమను పొందాలనే ఆలోచన కారణంగా తమను తాము విస్మరించుకుంటారు.
పర్యవసనాలు..
ప్రజలకు లేదా తమ చుట్టు పక్కల ఉన్న వ్యక్తులకు అనుగుణంగా నడుచుకోవడంలో తప్పేంటని కొన్నిసార్లు అనిపించవచ్చు కానీ.. ఇది మన సొంత వ్యక్తిత్వాన్ని విస్మరించడానికి కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇతరుల మెప్పుకోసం మన కోరికలు తగ్గించుకోవడం, పనులు వాయిదా వేసుకోవడం, చివరికి ఏదీ సాధించలేక నిరాశకు గురికావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న సమస్యలే పెద్దగా మారి కష్టాల్లోకి నెడతాయి. అప్పుడు జీవితం మీద విరక్తి పుట్టవచ్చు. లైఫ్ ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే ఉంటుందనే ప్రతికూల ఆలోచన స్థిరపడిపోతుంది. దీంతో బంధాలు బలహీన పడతాయి. సొంత భావాలు ఆవిరైపోతాయి. ఇతరులే సర్వస్వంగా బతికేస్తాం.
ఎలా బయపడాలి?
ఇతరుల మెప్పుకోసం మన ప్రవర్తన మార్చుకుంటే.. జీవితంలో ఎక్కువ భాగం ఇతరులపైనే ఆధారపడాల్సి వస్తుంది. అలా జరగొద్దు అనుకుంటే.. ఈ క్షణం నుంచే మీ కోసం మీరు ఆలోచించాలి అంటున్నారు నిపుణులు. ఒక విషయంలో ఇతరులు మనల్ని, మనం ఇతరుల్ని మెచ్చుకోవడంలో, స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పులేదు. కానీ అదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోవద్దు. ప్రతీ విషయంలో ఇతరుల కోసమే రాజీపడుతూ ఉంటే మన లైప్ క్వాలిటీ దెబ్బ తింటుంది. అందుకే మీ వ్యక్తిత్వం ఏమిటో అర్థం చేసుకోవడానికి, మీ అభిరుచులు, ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి సమయం కేటాయిస్తే ఇతరులకు అనుగుణంగా కాకుండా మీకనుగుణంగా మీరు మారిపోతారు.