Pancard : పాన్‌కార్డు పెద్దలకే కాదు.. మైనర్లకూ అవసరమే!

by Javid Pasha |
Pancard : పాన్‌కార్డు పెద్దలకే కాదు.. మైనర్లకూ అవసరమే!
X

దిశ, ఫీచర్స్: మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు.. రూ.30 వేలకు మించి అందులో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా అధికారులు పాన్ కార్డు తప్పక అడుగుతుంటారు. అయితే చాలామంది ఇది పెద్దలకు మాత్రమే వర్తిస్తుందని అనుకుంటారు. కానీ అకౌంట్ కలిగి ఉన్న మైనర్లకూ అవసరమే అంటున్నారు నిపుణులు.

ఇటీవల కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌‌ల నేపథ్యంలో పలు ఆర్థిక అంశాలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలు, డాక్యుమెంట్లు, పాన్ కార్డు వంటి విషయాలను కొందరు సోషల్ మీడియా వేదికగా డిస్కస్ చేస్తున్నారు. పాన్ కార్డు మైనర్లకు ఎందుకు? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మన దేశంలోని ఐటీఆర్ ఫైలింగ్ రూల్స్ ప్రకారం.. పాన్ కార్డు కలిగి ఉండేందుకు నిర్ధిష్ట వయోపరిమితి ఏమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. డబ్బు సంపాదన, నిర్వహణ, బ్యాంకు లావాదేవీలను బట్టి పాన్ కార్డు అవసరం అవుతుందని చెప్తున్నారు. మైనర్లు అయినప్పటికీ నెలకు రూ. 15 వేలకు మించి డబ్బు సంపాదిస్తున్నట్లయితే వారికి పాన్ కార్డు తప్పక అవసరం అవుతుందని పేర్కొంటున్నారు.

ఏయే సందర్భాల్లో అవసరం

మైనర్లకు పాన్ కార్డు ఏయే సందర్భాల్లో అవసరం అవుతుందనే విషయాన్ని పరిశీలిస్తే.. ఆర్థిక నిపుణుల ప్రకారం పేరెంట్స్ తమ పిల్లల పేరుమీద డబ్బులు జమ చేసినప్పుడు, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు లేదా పెట్టుబడుల్లో నామినేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ తమ పిల్లలకు కూడా పాన్ కార్డు అవసరం అవుతుంది. పిల్లల పేరుమీద బ్యాంక్ అకౌంట్ తెరవాలనుకున్నప్పుడు, మైనర్ నెలకు రూ. 15 వేలకు మించి సంపాదిస్తున్నప్పుడు కూడా పాన్ కార్డు తప్పనిసరి.

దరఖాస్తు ఎవరు చేయాలి?

మైనర్లకు పాన్ కార్డు కోసం తల్లిదండ్రులే దరఖాస్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వచ్చినా వారే చేయాలి. ఇక మైనర్ పాన్ కార్డులో అతని/ఆమె ఫొటో, సిగ్నిచర్ ఉండవు కాబట్టి ఇతర లావాదేవీల్లో దానిని ఎవిడెన్స్‌గా పరిగణించరు.18 ఏండ్లు నిండిన తర్వాత ఫొటో, సంతకంతో మైనర్లు తమ పాన్ కార్డుని అప్‌డేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు ఎలా పొందాలన్న విషయానికి వస్తే ఏజెంట్ ద్వారా గానీ, ఆన్‌లైన్‌లో NSDL వెబ్‌సైట్ ద్వారా గానీ పాన్ కార్డుకోసం అప్లై చేసుకొని పొందవచ్చు.



Next Story