- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Addiction: వ్యసనంగా మారుతున్న ఆన్‌లైన్ గేమింగ్.. కారణం ఇదేనా!

దిశ, ఫీచర్స్ : మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు బానిసైతే ఆరోగ్యం పాడవుతుంది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ గేమింగ్ వ్యవసనం అంతకంటే ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటివి అవసరానికి వాడుకుంటే ప్రయోజనం ఉంటుంది. కానీ అతిగా వాడటంవల్లే వ్యసనంగా, ప్రాణాంతకంగా మారుతున్నాయి. సరదా కోసం ఆడే వీడియో గేమ్‌లకు, అవసరానికి రుణాలిచ్చే యాప్‌లకు అలవాటు పడిన వారు క్రమంగా ‘ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్’ వంటి మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు.
ప్రాణాంతకంగా మారవచ్చు
ప్రపంచ జనాభాలో 1.7 శాతం నుంచి 10 శాతం మందిని ఆన్‌లైన్ గేమింగ్ ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇండియాలో కూడా బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ వ్యవసనాలకు, వాటి నిర్వాహకుల అరాచకాలకు పలువురు ప్రభావితం అవుతున్నారు. కొందరు అప్పులు చేసి మరీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, బెట్టింగ్‌లకు పాల్పడటం వంటివి చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సైబర్ నేరస్థులు, అప్పుల మాఫియా చేతిలో బ్లాక్ మెయిల్‌కు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఆశతో మొదలై అవస్థల దాకా
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ, అవగాహన రాహిత్యం పలువురిని ఆన్‌లైన్ గేమ్‌లకు, రుణాలిచ్చే యాప్‌లకు అడిక్ట్ అయ్యేలా చేస్తోంది. ఇదే అదునుగా షాపింగ్, ఫ్రాంచైజీల అమ్మకాలు, అశ్లీల వీడియోలతో, ఫొటోలతో ట్రాప్ చేయడం, గిఫ్ట్ మనీ పేరిట సైబర్ మోసాలకు పాల్పడటం వంటి సంఘటనలు తరచుగా ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి. అడిక్ట్ అవుతున్న వారిలో యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు కూడా ఉంటున్నారు. గేమింగ్ వ్యసనం వారిలో తమపై తాము నియంత్రణ కోల్పోయేలా చేస్తోంది. ఫలితంగా సామాజిక, విద్యా, వృత్తిపరమైన బాధ్యతలతో సహా రోజువారీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో స్వీయ సంరక్షణ, సంబంధాలు, చదువు, ఉద్యోగం వంటి అంశాల్లో ఏకాగ్రతను, క్రమంగా ఆసక్తిని కోల్పోతున్నారు. అంతేకాకుండా పిల్లలో అది ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్‌గా మారుతోంది.
లక్షణాలు
ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్‌లో, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్‌పై గడుపుతుంటారు. దీంతో పిల్లలైతే చదువుపట్ల, ఆటల పట్ల ఇంట్రెస్ట్ తగ్గుతుంది. పెద్దలైతే తాము చేసే పనులు, ఇంటి బాధ్యతల్లో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎప్పుడైనా ఇంటర్నెట్ అందుబాటులో లేకున్నా, ఆన్‌లైన్‌లో ఉండే అవకాశం మిస్ అయినా విచారంగా కనిపిస్తారు. ఆందోళన, కోపం, చిరాకు వంటివి పెరుగుతాయి. సొంత ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తారు. ఫ్రెండ్స్ లేదా ఇష్టమైన వ్యక్తులతో గడపడానికి కూడా సమయం కేటాయించరు. సామాజిక సంబంధాలను వదులుకునే ప్రయత్నం చేస్తారు. వీడియో గేమ్‌లు లేదా ఆన్‌లైన్‌లో గడిపే సమయం గురించి ఇతరులు ప్రశ్నిస్తే వారికి దూరంగా ఉంటారు. మాట్లాడటం మానేస్తారు. పేరెంట్స్ లేదా కుటుంబ సభ్యులు అడిగితే అబద్దాలు చెబుతుంటారు.
కారణాలు
కారణాల విషయానికి వస్తే వీడియో లేదా ఆన్‌లైన్ గేమ్ అనేది మొదట క్యూరియాసిటీని ప్రేరేపిస్తుంది. అలాగే గేమ్‌లు ఆడటం, గెలుపొందడం అనే ప్రాసెస్ మెదడులో డోపమైన్ (న్యూరో ట్రాన్స్‌మిటర్) రిలీజ్‌ని ప్రేరేపించవచ్చునని పరిశోధకులు అంటున్నారు. ఇది ఆహ్లాదకరమైన అనుభూతితో శారీరక విధుల్లో కీలకపాత్ర పోషిస్తుంది. మొదట ఇది సరదాగా మొదలై తర్వాత వ్యసనంగా మారుతుంది.
పరిష్కారం
పిల్లలు, కుటుంబంలోని ఏ వ్యక్తులైనా ఆన్ లైన్ గేమ్‌లకు బానియ్యారో లేదోనని లక్షణాలను బట్టి అనుమానించవచ్చు. అలాంటప్పుడు వెంటనే మానసిక నిపుణులను ప్రదించడం బెటర్. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్‌కు వారు టాక్ థెరపీ (సైకో థెరపీ), కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు దూరంగా ఉండేలా చూడాలి. ఫోన్, ల్యాప్ టాప్, టాబ్లెట్ వంటివి అవసరమైతేనే యూజ్ చేయనివ్వాలి. అది కూడా టైమ్ సెట్ చేయడం, ఓ కంట కనిపెట్టడం మర్చిపోవద్దు. అలాగే పిల్లలు తమ వ్యక్తిగత సమాచారాన్ని, కుటుంబం వివరాలను, బ్యాంక్ ఎకౌంట్ వివరాలను ఎవరితో పంచుకోవద్దని చెప్పాలి. కొందరు పిల్లలు పేరెంట్స్‌కు తెలియకుండానే వారి డెబిట్, క్రెడిట్ కార్డులు యూజ్ చేసి ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తుంటారు. కాబట్టి పిల్లలకు వాటిని అందుబాటులో ఉంచకూడదు. ఆన్ లైన్ గేమ్స్‌కి కేటాయించే బదులు పిల్లలను ఆరుబయట ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. దీనివల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
depression: డిప్రెషన్‌ను న్యాచురల్‌గా తగ్గించండిలా..?