Health : తల్లిలో ఊబకాయం.. పిల్లలకూ ముప్పే!!

by Javid Pasha |   ( Updated:2024-11-06 06:52:52.0  )
Health : తల్లిలో ఊబకాయం.. పిల్లలకూ ముప్పే!!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు వంశపారంపర్యంగా వస్తుంటాయి. మధుమేహం, గుండె జబ్బులు వంటి ఫ్యామిలీ హిస్టరీ కలిగిన వారి కుటుంబాల్లోని సంతానానికి అవి త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే ఇక్కడ వారసత్వంగా వచ్చే వ్యాధులు చాలా వరకు ఒకే తరహావి ఉంటాయి. కానీ గర్భధారణ సమయంలో అధిక బరువు, ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్న మహిళకు జన్మించే పిల్లలు మాత్రం పలు ఇతర అనారోగ్యాలకు కూడా గురవుతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అవేంటో చూద్దాం.

ఇటీవల అనేకమంది ఎదుర్కొంటున్న హెల్త్ ఇష్యూస్‌లో ఒబేసిటీ లేదా ఊబకాయం ఒకటి. అయితే మహిళల్లో ఇది గర్భధారణకు ముందు గానీ, తర్వాత గానీ ఉన్నప్పుడు వారికి పుట్టుబోయే బిడ్డల్లో ఆటిజం, ఏడీహెచ్‌డీ, నాడీ సంబంధిత సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఏడీహెచ్‌డీ‌ ఉన్న పిల్లలు అతి చురుకుదనం కలిగి ఉంటారు. అదే సందర్భంలో వారిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఆటిజం ఎదుర్కొంటున్న పిల్లలు తరచూ ఒకే విధమైన పనులు చేస్తుంటారు. ఇతరులతో మాట్లాడే క్రమంలో ఇబ్బండి పడతారు. ఈ సమస్యలు ఎందుకొస్తాయో కచ్చితమైన కారణాలైతే ఇప్పటి వరకు తెలియదు. కానీ వైద్య నిపుణులు అంచనాలే ఉన్నాయి. కాగా వీటిని అన్వేషించే క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఇటీవల పరిశోధనలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు మొత్తం 36 లక్షల మంది మాతా, శిశు జంటల వివరాలను ఎనలైజ్ చేశారు.

అధ్యయనంలో భాగంగా పలువురి వివరాలను విశ్లేషించిన పరిశోధకులు గర్భధారణ సమయంలో మహిళల్లో ఊబకాయం కారణంగా వారికి పుట్టబోయే పిల్లల్లో ఏడీహెచ్‌డీ (ADHD) రిస్క్ 32 శాతం పెరుగుతోందని గుర్తించారు. అలాగే ఆటిజం రిస్క్ కూడా రెట్టింపవుతోందని కనుగొన్నారు. అలాగే ప్రెగ్నెన్సీకి ముందు అధిక బరువు, ఒబేసిటీ కలిగి ఉన్న మహిళలకు గర్భధారణ తర్వాత జన్మించే సంతానంలో అధిక బరువు 18 శాతం, ఊబకాయం ముప్పు 57 శాతం అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ పరిశోధన అధిక బరువు, ఊబకాయం అనేవి భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి, మరిన్ని అధ్యయనాలు కొనసాగించడానికి ఉపయోగపడుతుందని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Read More..

రాత్రి భోజనం మానేస్తున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..!

Advertisement

Next Story