రోడ్డు ప్ర‌మాద బాధితుడికి 50 ల‌క్ష‌ల‌ ప‌రిహారం!: సుప్రీమ్ కోర్టు

by Sumithra |
రోడ్డు ప్ర‌మాద బాధితుడికి 50 ల‌క్ష‌ల‌ ప‌రిహారం!: సుప్రీమ్ కోర్టు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌మాదాలు ముందే చెప్పి, వ‌చ్చేవికావు. ముఖ్యంగా రోడ్డు ప్ర‌మాదాల్లో అవ‌య‌వాల‌ను కోల్పోయిన వారి ప‌రిస్థితి వ‌ర్ణ‌నాతీతం. కార‌ణం ఏదైనా కావ‌చ్చు గాక జీవితాన్ని కోల్పేయిన వారికి ఏలాంటి ప‌రిహార‌మిచ్చినా న‌ష్టాన్ని పూడ్చ‌లేమ‌ని తాజాగా భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. అలాంటి బాధితుల‌ మానసిక, శారీరక నష్టాన్ని డబ్బుతో లెక్కించలేమన్న ధ‌ర్మాస‌నం, అయితే కేవలం పరిహారం చెల్లించడం మినహా మరో మార్గం లేదని, ఓ కేసులో 5 ఏళ్ల బాలుడికి పరిహారం పెంపుదల చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువ‌రించింది. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం బాలుడికి ఇచ్చే పరిహారాన్ని వడ్డీతో సహా రూ.49. 93 లక్షలకు పెంచింది.

ఈ కేసు సంద‌ర్భంలో ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం, "వ్యక్తిగతంగా తీవ్ర‌గాయాల‌కు లోనైన‌ కేసుల్లో నష్టాన్ని నిర్ణయించడం అంత సులభం కాదు. మానసిక, శారీరక నష్టాన్ని డబ్బు పరంగా లెక్కించలేము. కానీ బాధితుడికి పరిహారంగా కేవలం డ‌బ్బు రూపాంలో పరిహారం చెల్లించడం మినహా వేరే మార్గం లేదు" అని బెంచ్ పేర్కొంది. రోడ్డు ప్ర‌మాదం కేసులో 13.46 లక్షల పరిహారం చెల్లించాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బాలుడు దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. 18.24 లక్షలను మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అందించ‌గా, హాస్ప‌ట‌ల్‌ డిశ్చార్జ్ స‌మ్మ‌రీ ప్రకారం, బాలుడు తన రెండు కాళ్లను కదిలించ‌లేడని, కాళ్లు చ‌చ్చుబ‌డిపోయాయ‌ని, మూత్రం ఆపుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, పేగులో మలబద్ధకం, మంచానికే ప‌రిమితం కావ‌డంతో దేహంపై పుండ్లు ఏర్ప‌డ్డాయని సుప్రీం కోర్టు పేర్కొంది. "శారీరక స్థితి దృష్ట్యా, అప్పీలుదారుకు తన జీవితాంతం ఒక అటెండర్ అవ‌స‌రం ఉంది. అప్పీలుదారు తన బాల్యాన్ని మాత్రమే కాకుండా వయోజన జీవితాన్ని కూడా కోల్పోయాడు. అందువల్ల, వివాహ అవకాశాలను కూడా కోల్పోవాల్సి ఉంటుంది" అని ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. ఇంకా, ట్రిబ్యునల్ పూర్తిగా ఇంద్రియాలను కోల్పోయిన పిల్లల పరిస్థితిని గ్రహించి ఉండాల్సింద‌ని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed