Hypertension: నిద్రలేమితో హైపర్‌‌ టెన్షన్.. మహిళల్లోనే అధికం!

by Javid Pasha |
Hypertension: నిద్రలేమితో హైపర్‌‌ టెన్షన్.. మహిళల్లోనే అధికం!
X

దిశ, ఫీచర్స్ : హైపర్ టెన్షన్.. అధిక రక్తపోటు.. పేరు ఏదైనా సమస్య ఒక్కటే. రక్త ప్రవాహంలో మార్పులు సంభవించి, రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకు గల కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటి కాగా ఇది మహిళల్లో ఎక్కువగా ఉంటోందని యూఎస్ బ్రిగ్హమ్ అండ్ ఉమెణ్ హాస్పిటల్ కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. రోజూ రాత్రిపూట 7 గంటలకంటే తక్కువ నిద్రపోయే వారిలో హైపర్ టెన్షన్ పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

రోజూ ఏడు లేదా ఏడెనిమిది గంటలు నాణ్యమైన నిద్రపోయే వారితో పోలిస్తే అంతకంటే తక్కువ గంటలు నిద్రపోయే మహిళలు హయ్యర్ బీఎంఐ (BMI), లోయర్ ఫిజికల్ యాక్టివిటీస్‌తో పాటు పోషకాహార లోపాలు కలిగి ఉంటున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. కాగా ఈ హైపర్ టెన్షన్ అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటోంది. ప్రధానంగా డయాబెటిస్, గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. స్టడీలో భాగంగా పరిశోధకులు 25 నుంచి 42 ఏండ్ల మధ్య వయస్సుగల 66, 122 మందిని అబ్జర్వ్ చేశారు. వారి బాడీ మాస్ ఇండెక్స్, జీవనశైలి, శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లు, నిద్రపోయే గంటలు, నిద్ర నాణ్యత వంటి అంశాల్లో వారి కుటుంబ చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక ఇబ్బంది పడటం, ఎక్కువసేపు మేల్కొని ఉండి నిద్రపోయాక, తిరిగి ఉదయాన్నే త్వరగా నిద్ర మేల్కోవడం వంటి కారణాలు మహిళల్లో హైపర్ టెన్షన్‌కు దారితీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నాణ్యమైన నిద్రలేకపోవడమే చాలామందిలో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల రిస్క్‌ను పెంచుతోందని కనుగొన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక నిద్రలేమి మహిళల్లో సోడియం రిటెన్షన్, ఆర్టరీస్ బ్లాక్ వంటి ఆటంకాలను కలిగించడం ద్వారా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి స్త్రీలు నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story