Parasomnia : అర్ధరాత్రి కలవరింతలు ఎందుకు వస్తాయ్..? దెయ్యాల పనేనా?

by Javid Pasha |
Parasomnia : అర్ధరాత్రి కలవరింతలు ఎందుకు వస్తాయ్..? దెయ్యాల పనేనా?
X

దిశ, ఫీచర్స్ : సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు.. అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ.. సరయూ ఒక్కసారిగా కలవరించడం మొదలు పెట్టి దిగ్గున నిద్రలేచింది. భయంతో వణికిపోతోంది. ఆమెను చూస్తుంటే ఏదో తీవ్రమైన ఆందోళనలో ఉంది. వింతగా బిహేవ్ చేస్తోంది. ఎందుకలా? దెయ్యం పట్టిందేమో? లేకపోతే దెయ్యం కలలోకి వచ్చిందేమోనని వాళ్ల నానమ్మ చీపురుతో కొట్టడం మొదలు పెట్టింది. ఆధునిక కాలంలోనూ ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడూ ఏమారుమూల గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో సైతం మనం చూస్తుంటాం. కాగా వాస్తవానికి దెయ్యాలు ఉండవని, సరయూ లాగానే కొంతమంది ప్రజలు లేదా పిల్లలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్(ఏఏఎస్ఎం) అధ్యయనం పేర్కొంటున్నది. దీనినే పారాసోమ్నియా లేదా నైట్ టెర్రర్స్‌ అని కూడా పిలుస్తారు.

సాధారణంగా పిల్లలు గాఢ నిద్రలోకి జారుకున్నాక ఒక్కోసారి సడెన్‌గా లేచిపడుకోవడం, కలవరించడం చేస్తుంటారు. కొందరు గట్టిగా ఏడుస్తుంటారు. కొన్నిసార్లు భయంతో వణికి పోతుంటారు. ఇందంతా జరుగుతున్నట్లు బాధిత పిల్లలకు తెలియదు. కానీ అర్ధరాత్రి వేళ తమ పిల్లల్లో ఇలాంటి పరిస్థితిని చూస్తే ఏ తల్లిదండ్రులైనా ఆందోళన చెందుతారు. ఇక సైంటిఫిక్ థాట్స్ లేనివారైతే ఏదో దెయ్యం పట్టిందని కూడా భావించి మంత్రాలు చదవడం, దిష్టి తీయడం, చెప్పు లేదా చీపరుతో కొట్టడం చేస్తుంటారు. కానీ అలాంటి మూఢనమ్మకాలు కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తాయని, సమస్యను జఠిలం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ‘నైట్ టెర్రర్స్’ కు మూలాలు కనుగొని పిల్లలకు అలాంటి పరిస్థితులకు దూరంగా ఉంచడం, కౌన్సెలింగ్ చేయడం, మానసిక వైద్య నిపుణుల సూచనలు పాటించడం చేయాలని పేర్కొంటున్నారు.

సాధారణంగానే నైట్ టెర్రర్స్ లేదా పారాసోమ్నియా అనేది ఒక రుగ్మత. దీనిబారిన పడిన పిల్లల్లో ఆందోళన, భయం, కోపం, కొన్ని పరిస్థితుల్లో కారణం లేకుండానే చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బాధితుల్లో చాలామంది అర్ధరాత్రుళ్లు నిద్రలోంచి లేచి అరవడం, నిద్రలోనే పలవరించడం, ఎవరినో కొడుతున్నట్లు చేతులు ఊపడం, ఎవరో తమను కొట్టడానికి వచ్చినట్లు అరుస్తూ హెచ్చరించడం, లేచి బయటకు పరుగెత్తడం చేస్తుంటారు. పన్నేండేళ్ల లోపు పిల్లల్లో అయితే ఇవి సాధారణంగా వచ్చే నిద్ర కలవరింతలే అంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఒకటి రెండు రోజుల్లో కొందరికి వారం పది రోజుల్లో సహజంగానే తగ్గిపోతుంది. తగ్గేవరకు పేరెంట్స్ వారికి ధైర్యం చెప్పండం, కౌన్సెలింగ్ ఇవ్వడం చేయాలి. అప్పటికీ ఫలితం లేకపోతే సైకియాట్రిస్టులను సంప్రదించాలి.

ప్రపంచ వ్యాప్తంగా 12 ఏండ్లలోపు పిల్లల్లోనూ, 60 ఏండ్లు దాటిన పెద్దవారిలో ఒక శాతం మందిలో ఈ సమస్య ఉంటోందని ఉంటోందని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అధ్యయనం పేర్కొంటున్నది. కొన్నిసార్లు తీవ్రమైన అలసట, నిద్రలేమి, అధిక జ్వరం కూడా పారాసోమ్నియా లక్షణాలను బహిర్గతం చేయవచ్చు. జన్యుపరంగానూ కొందరు పిల్లలు, పెద్దలు నిద్రలో మరోలా ప్రవర్తించే అలవాట్లు కలిగి ఉండవచ్చు. ఏది ఏమైనా పిల్లల్లో నైట్‌టెర్రర్ లక్షణాలు నార్మల్‌గా ఉంటే కొంతకాలానికి వాటంతట అవే తగ్గుతాయి. మరీ ఎక్కువైతే చైల్డ్ సైకాలజిస్టులను సంప్రదించాలంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Next Story

Most Viewed