స్ట్రాంగ్ రిలేషన్‌‌ షిప్‌‌ను కోరుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

by Prasanna |   ( Updated:2023-01-09 13:04:13.0  )
స్ట్రాంగ్  రిలేషన్‌‌ షిప్‌‌ను కోరుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి
X

దిశ, ఫీచర్స్ : మనుషులెప్పుడూ ఒంటరిగా ఉండలేరు. ఒక వేళ ఏదైనా పరిస్థితిలో ఉండాల్సి వచ్చినా అది తాత్కాలికమే. ఒకానొక దశలో ప్రతి ఒక్కరూ రిలేషన్ షిప్‌ను కోరుకుంటారు. దానికోసం తాపత్రయ పడుతుంటారు. భార్యా భర్తల మధ్య, ప్రేమికుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఏ విధమైన రిలేషన్‌ షిప్ అయినా పరస్పర నమ్మకంతో, పరస్పర గౌరవంతో, పరస్పర సహకారంతో ఉన్నప్పుడే అది నాలుగు కాలాలపాటు నిలబడుతుంది. ''రిలేషన్ షిప్ మధ్య ఎన్ని అవాంతరాలనైనా రానీయండి. ఎన్ని ఒడిదుడుకులనైనా ఎదుర్కోండి కానీ నమ్మకం మాత్రం కోల్పోవద్దు. ఏది కోల్పోయినా తిరిగి రాబట్టుకోవచ్చు కానీ ఒక్కసారి నమ్మకం కోల్పోతే దానిని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. '' అంటున్నారు నిపుణులు. పెద్దలు కూడా తరచూ ఇదే చెప్తుంటారు.

ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్‌ షిప్ బలమైనదిగా ఉండాలంటే..పరస్పర నమ్మకం తప్పనిసరి. అప్పుడే వారి జీవితం సంతోషంగా కొనసాగుతుంది. అదే అవమానాలతో, అనుమానాలతో, హేళనలతో కొనసాగే రిలేషన్ షిప్ ఏదో ఒకరోజు పటాపంచలవుతుంది. స్నేహితులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు రిలేషన్ షిప్ మధ్య అపనమ్మకాలు, అనుమానాలు మొదలయ్యాయంటే.. అవి తెగేదాకా వెళ్లొచ్చు. అందుకే మొదట్లోనే గుర్తించి పరిష్కరించుకోవాలంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు.

ఏ పరిస్థితిలోనైనా అర్థం చేసుకోవాలి

ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగాలంటే దంపతులు కానీ, ప్రేమికులు కానీ, లేదా సహజీవనం చేస్తున్నవారు కానీ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు, ఆలోచనలు, ఆసక్తులు, అలవాట్లు దాదాపు ఒకేలా ఉండవు. కాబట్టి ఒకరి గురించి ఒకరు తెలిసి మసలు కోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మెలగాలి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి అనుకోకుండానో, అవగాహన లోపంతోనే తప్పు చేసినా క్షమించగలగాలి. పొరపాట్లను విడమర్చి చెప్పి నివారించగలగాలి. అంతే తప్ప అసహ్యించుకుంటేనో, అవమానించేలా విమర్శిస్తేనో, నలుగురిలో కూర్చో బెట్టి చర్చిస్తేనో రిలేషన్ షిప్ నిలబడుతుందనుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు న్యాయవాది రీతూ చటర్జీ. అందుకే ఒకరి ప్రవర్తనను ఒకరు అన్ని కోణాల్లో అర్థం చేసుకోవాలి. రిలేషన్ షిప్‌లో పరిస్థితుల ప్రభావంవల్లో, తప్పనిసరి పరిస్థితుల్లోనో ఏదైనా తప్పుదొర్లితే అర్థం చేసుకుంటే ఆ బంధం పదికాలాలపాటు బలంగా ఉంటుందని సూచిస్తున్నారు.

వీటికి ముగింపు పలకాలి

భార్యా భర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఎప్పుడూ రిలేషన్ షిప్ ఒకేలా కూడా ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి. ఇలాంటప్పుడే విచక్షణగా ఆలోచించాలి. ఆచి తూచి నడుచుకోవాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాజిద్ హుస్సేన్. ఒకరివల్ల గొడవ స్టార్టయినప్పుడు మరొకరు దానిని రెట్టింపు బిహేవియర్‌తో ఎదుర్కోవాలని ప్రయత్నిస్తే అది మరింత పెద్ద గొడవకో, విడిపోవడానికో దారి తీయవచ్చు. ఒకరు కోపంగా ఉన్నప్పుడో, గొడవకు దిగున్నప్పుడో ఎదుటి వ్యక్తి దానిని అర్థం చేసుకొని ఆ సందర్భంలో తగ్గాలి. గొడవ పడేందుకు సిద్ధమైన వ్యక్తి రిలాక్స్ అయ్యాక మీరు అనుకున్నది చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు తాను చేసిన తప్పేమిటో ఎదుటి వ్యక్తి తెలుసుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి రిలేషన్ షిప్‌లో ప్రస్టేషన్‌లు పక్కన పెట్టాలి. అవసరమైన చోట తగ్గేవారే తర్వాత నెగ్గుతుంటారనేది కూడా గుర్తుంచుకోవాలి.

ప్రతిదీ తప్పుబట్టే అలవాటు మానుకోవాలి

భర్తకు ఎంతో ఇష్టమని భార్య మంచి వంటకం చేసి పెడుతుంది. లేదా భర్తే భార్యకోసం ఏదైనా స్పెషల్ చేస్తాడు. ఇటువంటప్పుడు రుచిగా లేదనో, ఉప్పు తక్కవైందనో కొందరు ఆ వంటకం చేసిన వ్యక్తిని తప్పు పడుతుంటారు. రోజూ కావాలని తప్పు చేస్తే అది వేరే విషయం కానీ.. ఎప్పుడో ఒకసారి జరిగే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఎదుటి వ్యక్తిని తప్పు పట్టవద్దు. హేళన అస్సలు చేయవద్దు. ఒకసారి జరిగిందానికి ప్రతీసారి గుర్తు చేస్తూ తప్పు పట్టవద్దు. ఇలా చేయడంవల్ల ప్రేమ తగ్గి చిరాకు పుట్టుకొస్తుంది. కానీ అదే విషయాన్ని 'ఈరోజు కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది. పర్లేదులే' అన్నారనుకోండి. మరోసారి ఎదుటి వ్యక్తి తగిన జాగ్రత్త తీసుకుంటారు. అంతేగాని తరచూ తప్పుబట్టడంవల్ల లాభం లేదు. పైగా అది నెగెటివ్ ఆలోచనలకు, నెగెటివ్ ఫీలింగ్స్‌కు దారి తీస్తుంది. ఎంత చేసినా ఈ వ్యక్తి అస్సలు అర్థం చేసుకోడు అనే భావన ఎదుటి వ్యక్తిలో ఏర్పడుతుంది. అందుకే ప్రతీ విషయాన్ని తప్పుబట్టడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చెప్పింది కచ్చితంగా వినాలా..

కొందరు తమ జీవిత భాగస్వామి చెప్పేది వినరని, తమను పట్టించుకోరని, తమ మాటకు విలువ ఇవ్వరని, తమను సాధించేలా ప్రవర్తిస్తారని బాధితులైన స్త్రీ, పురుషులిద్దరూ తమ వద్దకు వస్తుంటారని హైదారాబాద్‌కు చెందిన ఒక ఫ్యామిలీ కౌన్సెలర్ తన అనుభవాన్ని చెప్పారు. ఒకరి మాట ఒకరు వినడం లేదనే కారణంతో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కాబట్టి సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే, ఎవరో ఒకరు సర్దుకుపోతే కొన్నాళ్లకు ఆ సమస్య పూర్తిగా పారిపోతుందని చెప్పొకొచ్చారు. జీవిత భాగస్వామి లేదా, మీతో రిలేషన్ షిప్‌లో ఉన్న వ్యక్తి చెప్పింది గుడ్డిగా వ్యతిరేకించకుండా ముందుగా పూర్తిగా వినాలని నిపుణులు సూచిస్తున్నారు. విన్న తర్వాత అది మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో, సమస్య ఏమిటో, మీ అభిప్రాయం ఏమిటో కూల్‌గా వివరించగలగాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటారు. కాబట్టి అది సమస్యకు దారి తీయదు. పైగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, గౌరవం పెరిగేందుకు కారణం అవుతుంది అంటారు సైకాలజిస్టు రవికిరణ్ మెహతా.

శృంగార జీవితాన్ని ఆస్వాదించాలి

భార్యా భర్తల మధ్య రిలేషన్ షిప్ ఉల్లాసంగా, ఉత్సాభంగా కొనసాగాలంటే అన్ని విషయాలతో పాటు శృంగారానికి తప్పక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్ని సమస్యలున్నా, ఒత్తిడిలో ఉన్నా సెక్స్ అనేది రిలేషన్ షిప్ మధ్య చాలా అవసరం. దీనివల్ల రిలాక్సేషన్‌ పొందగలుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే భార్యా భర్తలు, లేదా సహజీవనం చేస్తున్న స్త్రీ , పురుషుల మధ్య బలమైన అనుబంధానికి సెక్స్ దోహదం చేస్తుందని, ఇది వ్యక్తిని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచే టానిక్ లాంటిదని సైకియాట్రిస్ట్ నస్రీన్ చెప్తున్నారు. వీటితోపాటు ప్రతీరోజు కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కొత్తదనాన్ని ఆస్వాదించాలంటే.. ఆనందంగా ఉండాలంటే కొందరు బాగా డబ్బు, సౌకర్యాలు అవసరం అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. అవి మాత్రమే ఆనందాన్ని ఇవ్వలేదు. ఆనందం మనేది మీ ఆలోచనను బట్టి, ఆస్వాదించే తీరునుబట్టి ఉంటుంది అంటున్నారు నిపుణులు. మీకున్న పరిస్థితి ఎటువంటిదైనా సరే హెల్తీ లైఫ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా హాప్పీనెస్ పొందవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు అనేది పెద్దలు, నిపుణులు చెప్తున్న మాట. రిలేషన్ షిప్‌లో ప్రతిరోజూ ప్రేమానురాగాన్నీ, మమతల మాధుర్యాన్నీ ఆస్వాదించే అవకాశం ఎవరో ఇచ్చేది అస్సలు కాదు. అది ఎవరికి వారు క్రియేట్ చేసుకునే గొప్ప చాయిస్. కావాల్సిందల్లా ఆ వైపు మీ ఆలోచనను మరల్చండి అంటున్నారు మానసిక నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed