Shocking Study : పెళ్లి వద్దు బాబోయ్.. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతున్న యువతులు!

by Javid Pasha |
Shocking Study : పెళ్లి వద్దు బాబోయ్.. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతున్న యువతులు!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన సందర్భమని పెద్దలు, నిపుణులు చెప్తుంటారు. ఒక వయస్సుకు వచ్చాక భాగస్వామిని ఎంచుకోవడంలో యువత కూడా ఆసక్తి చూపుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక మంది పెళ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుత కాలంలో ప్రేమ, పెళ్లి, రొమాంటిక్ లైఫ్ వంటి విషయాల్లో స్థిరమైన అభిప్రాయాలకు కాలం చెల్లిందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యువతుల ఆలోచనలో మార్పు వస్తోందని, పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండేందుకే నేటి ఆధునిక మహిళ ఆసక్తి చూపుతోందని మోర్గానిక్ స్టాన్టీ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మారుతున్న ఆలోచన

మహిళల విషయానికి వస్తే ఒకప్పుడు పెళ్లి, కుటుంబం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఆ తర్వాత పిల్లల్ని కనడం, కుటుంబం మొత్తానికి వంట చేయడం, సేవ చేయడం, బాగోగులు చూసుకోవడం వంటి ఇంటి బాధ్యతలు నెరవేర్చడమే ముఖ్యమైన విధిగా భావించేవారు. ఇక మహిళలు గృహిణులుగా ఉంటే.. పురుషులు వ్యవసాయం లేదా ఉద్యోగం వంటివి చేసి కుటుంబాన్ని పోషించే బాధ్యత నిర్వర్తించేవారు. అదే సామాజికపరంగా చూస్తే మహిళలపట్ల అనేక విషయాల్లో వివక్ష, చిన్నచూపు కూడా ఉండేవి. కానీ ఆధునిక కాలంలో చాలా మార్పులు వచ్చాయి.

సమానత్వ భావాలు

స్త్రీ, పురుషులు సమానం అనే భావజాలం నేటి ఆధునిక కాలంలో అందరినీ ప్రభావితం చేస్తోంది. దానికి తోడు సాంకేతిక, పారిశ్రామిక విప్లవాలు, ఆ తర్వాతి పరిణామాలు మహిళలు కూడా చదువు, ఉద్యోగం వంటి విషయాల్లో అవకాశఆలు పొందేందుకు కారణం అవుతున్నాయి. ఫలితంగా మహిళల్లో ఆర్థిక, మానసిక చైతన్యం పెంపొందుతోంది. తమకాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం ఏర్పడుతోంది. సామాజిక అవగాహనతో, అధ్యయనంతో స్త్రీలు నేడు తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు. నచ్చని విషయాలను వ్యతిరేకించడం, తమ స్వేచ్ఛను కాపాడుకోవడంలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పురుషాధిక్యతను, పితృస్వామిక భావాలను వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగానే ఇప్పుడు యువతులు ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి అంశాల్లో సొంత నిర్ణయాలకు ప్రయారిటీ ఇస్తు్న్నారు. ఇతరుల జోక్యాన్ని సహించడం లేదు. ఈ క్రమంలోనే పెళ్లిపై ఆసక్తి తగ్గుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది.

45 శాతం పెరిగే చాన్స్

ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మోర్గాన్ స్టాన్టీ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం.. 2030 నాటికి ప్రపంచంలో సింగిల్‌గా లేదా ఒంటరిగా ఉండే మహిళల సంఖ్య 45 శాతానికి పెరగనుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పుట్టే పిల్లల సంఖ్య కూడా తగ్గిపోనుందని అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు పేర్కొంటున్నారు. నేటి యువతులు పెళ్లి చేసుకొని, ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదట. ఇంటి బాధ్యతలకన్నా నచ్చిన చదువులు చదవడం, ఉద్యోగాలు చేయడం, వీలైనంత వరకు పెళ్లి, పిల్లలు వంటి విషయాలకు దూరంగా జీవితాన్ని గడపడానికే పలువురు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.

అంత ముఖ్యమైందేమీ కాదు!

యుక్త వయస్సు దాటగానే ‘అమ్మాయి పెళ్లెప్పుడు చేస్తారు’ అనే మాటలు ఒకప్పుడు తల్లిదండ్రులకు ఇబ్బందిగా అనిపించేవి. బంధువులు, చుట్టు పక్కల జనాలు ఏమనుకుంటారోనని కూడా తమ బిడ్డల పెళ్లిళ్లకు తొందర పెట్టేవారు. మ్యారేజ్ అయిపోతే జీవితంలో సెటిల్ అయినట్టు భావించేవారు. కానీ ఇప్పుడు పేరెంట్స్‌లో కూడా మార్పు వస్తోంది. అమ్మాయిని బాగా చదివిస్తే ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం ఆమె ఇష్టానికే వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు వ్యక్తిగత స్వేచ్ఛకు, అభివృద్ధికి, వృత్తిపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక పెళ్లి అనేది జీవితంలో రెండవ ప్రాధాన్యతగల అంశంగా, వీలైతే పెద్దగా అవసరం లేని విషయంగా కూడా నేటి యువతులు భావిస్తు్న్నారని నిపుణులు చెప్తున్నారు.

విడాకుల్లోనూ పెరుగుదల

పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 30 నుంచి 40 ఏండ్ల వయస్సుగల మహిళల్లో విడాకులు సంఖ్య పెరుగుతోందని, భవిష్యత్తులో మరింత పెంగరవచ్చని స్టాన్టీ సర్వే పేర్కొన్నది. దీంతో కూడా ఒంటరి మహిళల సంఖ్య పెరగనున్నట్లు వెల్లడిచింది. ఒకప్పుడు 20 ఏండ్లకే పెళ్లి చేసుకొని తల్లి కావాలనే ఆసక్తి యువతుల్లో ఉండేది. భర్త , పిల్లలు, కుటుంబమే లోకంగా భావించే వారు. కానీ ఇప్పుడలా కాదు. తమకంటూ సొంత జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇంకొందరు పెళ్లి, ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యత అవసరమని భావిస్తు్న్నారు. అందుకే చదువు, కెరీర్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒంటరితనం లేదా సింగిల్ లైఫ్ కోరుకునే మహిళల సంఖ్య పెరుగుతోందని, 2030 నాటికి 45 శాతం పెరుగుతుందని మోర్గాన్ స్టాన్టీ అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed