బిడ్డ పేరు మార్చాలని అధికారుల డిమాండ్.. కోర్టు మెట్లెక్కిన తల్లిదండ్రులు

by Prasanna |   ( Updated:2023-03-27 14:00:53.0  )
బిడ్డ పేరు మార్చాలని అధికారుల డిమాండ్.. కోర్టు మెట్లెక్కిన తల్లిదండ్రులు
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా నచ్చిన విధంగా బిడ్డకు పేరు పెట్టుకునే స్వాతంత్ర్యం ఫ్రాన్స్‌లో తల్లిదండ్రులకు లేదు. ఆ పేరు పిల్లల లేదా సామాజిక ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని అధికారులు భావిస్తే నిరాకరించవచ్చు. లేదా పెట్టిన పేరును మార్చాలని ఆదేశించవచ్చు. ఈ క్రమంలోనే ఐరోపాలోని చారిత్రాత్మక ఫ్రెంచ్ నౌకాశ్రయ నగరం సెయింట్ మాలోకు చెందిన క్రిస్టినా డెస్‌గ్రెస్, రోడ్రిగో వెలాస్క్వెజ్ దంపతులు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో పుట్టిన మొదటి బిడ్డకు ‘హెడిస్’ అనే పేరుపెట్టుకోగా.. అభ్యతరం వ్యక్తం చేశాడు స్థానిక పబ్లిక్ ప్రాసిక్యూటర్. గ్రీకు పురాణాల ప్రకారం పాతాళానికి చెందిన మరణానికి అధిపతి అయిన దేవుడి పేరు కాబట్టి.. ఆ బిడ్డకు పెట్టకూడదని సూచించాడు. అది ఇతరుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని వాదించాడు. లేదంటే బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేదేలేదని స్పష్టం చేశాడు.

అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గట్లేదు క్రిస్టినా దంపతులు. హెడిస్ అనే పేరును తాము ఇష్టంగా ఎంచుకున్నామని, మరో పేరు ఎందుకు పెట్టాలని న్యాయపోరాటానికి దిగారు. ఇందుకోసం లాయర్‌ను కూడా నియమించుకున్నారు. 2020లో 12 మంది జంటలు తమ బిడ్డల పేరును హెడిస్ అని పెట్టుకున్నారని, అప్పట్లో లేని అభ్యంతరం ఇప్పుడెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని ఇతర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయనప్పుడు.. సెయింట్ మాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం ఎందుకు అడ్డుచెప్పాలని అడుగుతున్నారు. దీంతో సెయింట్ మాలో ప్రాసిక్యూటర్ కార్యాలయం కూడా కోర్టులో కేసు వేసింది. ఏప్రిల్ 4న ఈ కేసు విచారణకు రానుండగా.. ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థిస్తే, ఫ్రెంచ్ జంట మరో పేరును ఎంచుకోవాల్సిందే.

Also Read...

ఆ ప్రదేశానికి వెళ్లిన వారు... ఇక పైకే అంట!

Advertisement

Next Story