Black hole : అంతుపట్టని కాలరంధ్రాలు.. వాటిలో పడిపోతే ఏం జరుగుతుంది?

by Javid Pasha |   ( Updated:2024-07-30 12:51:11.0  )
Black hole : అంతుపట్టని కాలరంధ్రాలు.. వాటిలో పడిపోతే ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్: అంతుపట్టని విశ్వ రహస్యాల ఛేదన కోసం నిరంతర అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ వీడని మిస్టరీలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో బ్లాక్ హోల్స్ ఒకటి. భౌతికంగా అత్యంత చీకటితో కప్పబడిన ఈ కాల రంధ్రాల సృష్టి రహస్యం గురించి సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఉన్నాయి. కాగా భౌతిక నియమాలను అనుసరించి కొన్ని సమాధానాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తు్న్నారు. బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి? వాటిలో పడిపోతే ఏం జరుగుతుంది? అనే అంశాలను సైంటిస్టులు విశ్లేషించారు.

భారీ నక్షత్రాల పతనం..

అంతరిక్షంలో అత్యధిక గురుత్వాకర్షణ కలిగి ఉన్న కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలనే బ్లాక్ హోల్స్ లేదా కాలరంధ్రాలు అంటారు. నిజానికి ఇవి సూర్యుడికంటే కూడా వందల రెట్లు పెద్దగా ఉంటాయని, కాంతి కూడా వాటి గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకోలేదని శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ బయటకు మాత్రం కనిపించవు. భారీ నక్షత్రాలు న్యూక్లియర్ ఇంధనానాన్ని కోల్పోయినప్పుడు, తమ సొంత గురత్వాకర్షణ బరువుతో కూలిపోయినప్పుడు ఇవి ఏర్పడి ఉంటాయని సైంటిస్టులు చెప్తు్న్నారు. ఈ పతనమే కోర్‌ సింగులారిటీ అని పిలువడే అనంతమైన, దట్టమైన బిందువుగా కుదించబడిన బ్లాక్ హోల్ ఏర్పాటుకు కారణమైంది. ఈ విశ్వంలోని నక్షత్రమైనా, గ్రహమైనా, మనుషులైనా సరే బ్లాక్ హోల్ హారిజోన్‌ను సమీపిస్తే దాని గురుత్వాకర్షణ నుంచి తప్పించుకోలేదు. అంటే బ్లాక్ హోల్స్ మింగేస్తాయి.

బ్లాక్ హోల్స్ రకాలు

బ్లాక్ హోల్స్‌ని కృష్ణ బిలాలు అని కూడా పిలుస్తారు. ఇవి మధ్యలో ‘ఏకత్వాన్ని’ కలిగి ఉంటాయి. మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలను కూడా విచ్ఛిన్నం చేసేంత సాంద్రత కలిగిన మహా బిందువులు. ఒక విధంగా నక్షత్రం యొక్క ద్రవ్యరాశి. అనంతమైనదే అయినప్పటికీ చిన్న ప్రదేశంలోకి కుదించబడినట్లు ఉంటుంది. ఇక ఈ బ్లాక్ హోల్స్‌ కూడా కూలిపోతున్న నక్షత్రాల నుంచి ఏర్పడిన కాల రంధ్రాలు మొదలుకొని గెలాక్సీ కేంద్రాలలో కనిపించే సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్‌ వరకు పలు రకాలు ఉన్నాయి. వీటిలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ సూర్యుని ద్రవ్యరాశికంటే మిలియన్ల నుంచి బిలియన్ల రెట్లు ఎక్కువ పెద్దవి. భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రకారం.. బ్లాక్ హోల్స్ రేడియేషన్‌ను విడుదల చేయగలవు.

బ్లాక్ హోల్‌లో పడిపోతే..?

కాల రంధ్రంలో పడిన ఏదైనా పదార్థం లేదా నక్షత్రం శాశ్వతంగా ఉండిపోతుందా? లోపల భద్ర పర్చబడుతుందా? అనే సందేహాలు ఉన్నప్పటికీ వీటికి సమాధానాన్ని సైంటిస్టులు పూర్తిస్థాయిలో గ్రహించలేదు. కాకపోతే 2019లో ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ (EHT) బ్లాక్ హోల్ నీడ యొక్క మొట్ట మొదటి చిత్రాన్ని గ్రహించింది. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో నాసా సైంటిస్టులు సూర్యుడి ద్రవ్యరాశికంటే 4.3 మిలియన్ రెట్లు ఉన్న ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌లో పడిపోతే ఎలా ఉంటుందో తెలుసుకునే అనుకరణను రూపొందించి అబ్జర్వ్ చేస్తు్న్నారు. ఇది ప్రస్తుతం పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్‌తో సమానం.

బలమైన గురుత్వాకర్షణ

నాసా రూపొందించిన సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ పరిశోధన ప్రకారం.. ఎవరైనా దాని సమీపానికి చేరుకున్నప్పుడు గురుత్వాకర్షణలో గణనీయమైన పెరుగుదలను అనుభవిస్తారు. ఈ పరిస్థితి మనం ఉన్న సమయం, స్థలం గురించిన అవగాహనను వక్రీకరించడం ప్రారంభిస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరింత వింతగా మారుస్తుంది. అయితే కాలరంధ్రం అక్రెషన్ డిస్క్, పదార్థం స్పైలింగ్‌తో ఉంటుంది. తగినంత దగ్గరగా ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తులు (టైడల్ శక్తులు అని పిలుస్తారు) తీవ్రం అవుతాయి.

క్షీణిస్తున్న కాంతిలా..

బ్లాక్ హోల్ వద్ద పాదాలపై ఉండే గురుత్వాకర్షణ శక్తి, తలపై కంటే బలంగా ఉంటుంది. స్పఘెట్టిఫికేషన్ అనే ప్రక్రియలో శరీరాన్ని పొడవాటి సన్నని ఆకారంలోకి మార్చుతుంది. తీవ్రమైన గురుత్వాకర్షణ క్షేత్రం కారణంగా బయటి నుంచి చూసేవారికి బ్లాక్ హోల్‌లో పడుతున్న వ్యక్తి చాలా స్లోగా పడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో దాని చుట్టూ ఉన్న అక్రెషన్ డిస్క్ నుంచి క్షీణిస్తున్న కాంతిలా మారుతూ లోపలికి పడిపోతారు. ఆ తర్వాత బయటి ప్రపంచంతో లేదా విశ్వంతో కమ్యూనికేషన్ ఆగిపోతుంది. కాగా ఈ బ్లాక్ హోల్స్ లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్వేషణ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed