49 ఏళ్లుగా జుట్టు కటింగ్ చేయించుకోని వ్యక్తి.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

by Bhoopathi Nagaiah |
49 ఏళ్లుగా జుట్టు కటింగ్ చేయించుకోని వ్యక్తి.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా కటింగ్ చేయించుకోకుండా నెల.. రెండు నెలలు ఉంటాం. అప్పటికే దురదా పెట్టడంతోపాటు చిరాకు వస్తుంది. కానీ ఓ వ్యక్తి 49 ఏళ్లుగా కటింగ్, షేవింగ్ చేయించుకోకుండా ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ పరిచయస్తుడు చెప్పిన మాట విని ఆయన 50 ఏళ్లు జుట్టు పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ వ్యక్తి ఎందుకు జుట్టు పెంచుకుంటున్నాడు..? దేనికోసమో తెలుసుకుందాం..

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నల్లగొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం చెర్వుగట్టులో కొలువైన జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ గుట్టపై కొలువై ఉన్న శివుడికి జడలు కట్టిన జుట్టును తలనీలాలుగా ఇచ్చి భక్తులు తమ కోరికలు తీర్చుకుంటారు. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఇనపనూరి నాగభూషణం (80) ఓ పరిచయస్తుడి ద్వారా చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి మహిమల గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన వయస్సు 31 సంవత్సరాలు. చెర్వుగట్టులో స్వామి దర్శించుకున్న నాగభూషణం.. అప్పటి నుంచి జట్టు, క్షవరం చేయించుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడు. నాటి నుంచి జుట్టును అలాగే పెంచుతూ వస్తున్నారు. దీంతో ఆయన జుట్టు 12 అడుగుల మేర పెరిగింది. జుట్టు మొత్తం జడలు కట్టి నాగసాధువుగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన జుట్టు వయస్సు 49 సంవత్సరాలు. మరో ఏడాది గడిస్తే ఆయన మొక్కు తీరునుంది. దేవుడికే అంకితమైన నాగభూషణం కొంతకాలం దమ్మపేట మండలంలోని గండి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజారిగా పనిచేశారు. 50 ఏళ్లు సాధువులా కనిపించిన ఆయన వచ్చే ఏడాది బోడిగుండుతో కనిపిస్తే ప్రజలు కాదు కదా.. ఇంట్లో వాళ్లు అయినా గుర్తుపడతారా లేదా..? అనేది చూడాలి. అయితే ఇందంతా దేవుడి కోసమే చేశా అంటున్నారు నాగభూషణం. శివుడిపై ఉన్న భక్తితోనే తాను 49 ఏళ్లుగా జుట్టును పెంచుతున్నట్లు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed