నిజం చెప్పండి.. మీకు లవ్ స్టోరీ లేదా? సీపీ ఆనంద్ కి నెటిజన్ ప్రశ్న.. ఆయన ఏమన్నారో తెలుసా?

by Y.Nagarani |   ( Updated:2024-10-06 07:59:58.0  )
నిజం చెప్పండి.. మీకు లవ్ స్టోరీ లేదా? సీపీ ఆనంద్ కి నెటిజన్ ప్రశ్న.. ఆయన ఏమన్నారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: దాండియా ఆటలు ఆడ.. సరదా పాటలు పాడ.. నవరాత్రుల్లో వినిపించే పాటలు ఇవే. శరన్నవరాత్రులు, బతుకమ్మ (Bathukamma), దాండియాల(Dandiya)తో హైదరాబాద్ లో పండుగ వాతావరణం నెలకొంది. దాండియా గుజరాత్ నుంచి వచ్చిన ఒక నృత్యం. నవరాత్రుల్లో దాండియా ఆడటం అక్కడి సంప్రదాయం. ఇది క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలకు వ్యాపించింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా దాండియా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొద్దిరోజులు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ప్రత్యేకమైన అవుట్ ఫిట్స్ తో.. దాండియా ఈవెంట్లలో యువత సందడి చేస్తోంది. అలాగే కాలేజీల్లోనూ బతుకమ్మ, దాండియా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడంటే పండుగలతో పని లేకుండా.. అవసరానికి తగ్గట్టు ప్రేమలో పడిపోతున్నారు కానీ.. ఒకప్పుడు ఇలాంటి ఈవెంట్లు నిర్వహించినపుడే అబ్బాయిలు, అమ్మాయిలు మాట్లాడుకునేవారు. అలా ఓ నెటిజన్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) ను ట్యాగ్ చేస్తూ.. సార్ నిజం చెప్పండి.. మీ కాలేజీ, స్కూల్ డేస్ లో దాండియా నిర్వహించినపుడు మీరు ఎవరితోనూ ప్రేమలో పడలేదా అని ప్రశ్నించాడు. ఆ నెటిజన్ కు సీపీ ఆనంద్ సరదా రిప్లై ఇచ్చారు.

నిజానికి మేము చదువుకున్న రోజుల్లో దాండియా, బతుకమ్మ జరుపుకున్నపుడు చాలా లవ్ స్టోరీలే ఉండేవి. కానీ నా లవ్ స్టోరీ వాటికి సంబంధించింది కాదు. ఏదేమైనా నన్ను ఇలా అడిగి.. కాస్త నవ్వుకునేలా చేశారు. ప్రతిరోజూ కొంతసేపు ఇలా సరదాగా నవ్వుకోవాలి. ఇంతకన్నా జీవితంలో ఇంకేముంటుంది అని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ పై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. నిజాం కాలేజ్ జిందాబాద్ అని కామెంట్ చేశారు.

నెటిజన్ కు సీపీ ఆనంద్ ఇచ్చిన రిప్లై పై పలువురు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. 21 సంవత్సరాలుగా మేడమ్ మీతో ఉండి.. అన్నింటిలోనూ మీకు సపోర్ట్ చేయడం గొప్ప విషయం. దాండియాలో మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం చాలా బాగా అనిపించింది అని ఒకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్.. బహుశా మీకు మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు లవ్ చేశారో తెలిసి ఉండకపోవచ్చేమో సర్. ఒకవేళ ఎవరినైనా లవ్ చేసినా.. ఇలాంటి జంటిల్ మెన్లు వాళ్ల పేర్లు చెప్పరు. మీ స్టోరీలను విజయేంద్ర ప్రసాద్ కు చెప్పండి.. ఆయన మంచి సినిమా తీస్తారని కామెంట్ చేశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ పోస్ట్ నవ్వులు పూయిస్తోంది.

Advertisement

Next Story