ఎల్ఐసీ అమ్మకానికి ముందు కీలక ప్రాధాన్యతలు!

by Shyam |
ఎల్ఐసీ అమ్మకానికి ముందు కీలక ప్రాధాన్యతలు!
X

దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో) ద్వారా మార్కెట్‌ను ఢీ కొనడానికి మూడు కీలక ప్రాధాన్యతలను పరిశీలించాల్సి ఉంది. అవి పెట్టుబడి వర్గాల్లో సరైన అవగాహన ఏర్పడటం, మదింపుని నిర్ధారించే ధరలపై కృషి చేయడం, మెరుగైన పనితీరుతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ముగింపునివ్వడం. గత వారం ఎల్ఐసీ చైర్మెన్ ఎమ్ఆర్ కుమార్ ఈ ప్రాధాన్యతల గురించే విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు.

పెట్టుబడి వర్గాల అవగాహన :

ఎల్ఐసీని ప్రయివేటీకరిస్తున్నారనే అపోహ మార్కెట్లో ఉంది. ఎల్ఐసీ కొంత వాటాను గతంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టినట్టుగానే, ప్రస్తుతం ఎల్ఐసీ నుంచి కొంత భాగాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. అయితే ఎంత పరిమాణంలో అమ్మకానికి పెడుతుందనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. సెబీ నిబంధనల ప్రకారం కనీసం 10 శాతం వాటాను అమ్మవలసి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రకటన కోసం వేచి ఉండాలి. ప్రచారంలో ఉన్నట్టుగా ఎల్ఐసీని ప్రయివేటీకరించడం నిజమైతే సంస్థలో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే తక్కువ కలిగి ఉండాల్సి వస్తుంది. అది అసంభవం.

ధరల నిర్ధారణ :

ఎల్ఐసీకి సంబంధించిన వివిధ ఆస్తుల వివరాలను లెక్కించడానికి బ్యాంకర్లను నియమించాల్సి ఉంటుంది. వారు ఎల్ఐసీకి చెందిన అన్ని రకాల ఆస్తుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎల్ఐసీ మొత్తం ఆస్తులు రూ. 34 లక్షల కోట్లకు పైగానే ఉన్నాయి. అన్ని రకాల ఆస్తులను లెక్కగట్టడం అంత సులువైన పనేం కాదు. ఎల్ఐసీ పరిమాణం, సంస్థ రియల్ ఎస్టేట్ ఆస్తులు, వ్యాపారాలు అన్ని ఒకే గొడుగు కిందకు రావడం అసాధ్యం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర పనితీరు :

మూడో ప్రాధాన్యం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని మెరుగైన పనితీరుతో ముగించడం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం అధిక విలువతో 2018-19లో రూ. 52,214 కోట్ల మిగులుతో అత్యధికంగా 70 శాతం మార్కెట్ వాటాను ఎల్ఐసీ కలిగి ఉంది. ప్రైవేట్ రంగం నుంచి పోటీ ఉన్నప్పటికీ ఎల్ఐసీ సంస్థ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతోంది. బడ్జెట్‌లో ఎల్ఐసీలోని వాటా అమ్మకం ప్రస్తావన గురించి ఎల్ఐసీ చైర్మెన్ కుమార్‌ను ప్రశ్నించినపుడు ఈ అంశం తనను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదని, దీని గురించి చాలాసార్లు చర్చించినట్టు ఆయన తెలిపారు. అయితే, మరింత వివరంగా ఆయన చెప్పిన దాని ప్రకారం…ఎల్ఐసీ వాటా అమ్మకంపై పార్లమెంట్‌లో సవరణలు జరగాల్సి ఉంది. ఈ సవరణలు డివిడెండ్ చెల్లింపు, ప్రధానమైన హామీలు, కార్పొరేషన్‌గా ఎల్ఐసీ హోదా విషయంలో ఉండొచ్చని కుమార్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed