హుజురాబాద్ లో ఇలా చేస్తేనే పాలకులు కళ్లు తెరుస్తారు: సీనియర్ జర్నలిస్టులు

by Sridhar Babu |   ( Updated:2021-10-25 00:04:12.0  )
Huzurabad12
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో ప్రజా ఉద్యమకారుడైన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు, కన్వీనర్లు, ప్రతినిధులు పిలుపునిచ్చారు. సోమవారం మధువని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆనంచిన్ని వెంకటేశ్వర రావు, తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాద్, మైనారిటీ జర్నలిస్టుల ఫ్రంట్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ సాధన కోసం కృషిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జర్నలిస్టుల సమస్యలు తీరుతాయనుకుంటే మరిన్ని సమస్యలు పెరిగాయన్నారు.

ప్రాంతీయ పత్రికలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. నేటికీ ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు ఇవ్వడంలేదని, హెల్త్ కార్డులు పనిచేయడంలేదని అన్నారు. కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణాలో ప్రజల భవిష్యత్ అంధకారంగా మారిందని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఈటల గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆత్మగౌరవం పెరిగి పాలకులు కళ్లు తెరుస్తారని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముస్లింలను కించపరుస్తూ మాట్లాడారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో బికె. రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెదిరె చలమారెడ్డి, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యుడు పెద్దాపురం నర్సింహ, హిందూ ఫార్మర్ ఎడిటర్ డాక్టర్ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story