గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన గోవా బాలుడు

by Shyam |
గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన గోవా బాలుడు
X

దిశ, స్పోర్ట్స్ : గోవాకు చెందిన 14 ఏళ్ల లియోన్ మెన్‌డోన్కా ఇండియా 67వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. ఇటలీలో జరిగిన ఫైనల్ పోటీలో గెలుపొందిన లియోన్ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందాడు. ఈ ఘనతను లియోన్ 14 ఏళ్ల 9 నెలల 17 రోజుల్లో సాధించాడు. గోవా నుంచి గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన రెండో చదరంగ ఆటగాడిగా లియోన్ రికార్డు సృష్టించాడు. లియోన్ మోన్‌డోన్కా గ్రాండ్ మాస్టర్‌ హోదాకు అవసరమైన తొలి నార్మ్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన రిగో చెస్ జీఎంలో సాధించాడు. అనంతరం నవంబర్‌లో బుడాపెస్ట్‌లో జరిగిన రెండో రౌండ్‌లో కూడా విజయం సాధించాడు. తాజాగా ఇటలీలోని వెర్గానీ కప్‌లో ఫైనల్ రౌండ్ లియోన్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. వెర్గానీ కప్‌లో లియోన్ 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

కాగా, అప్పటికే జీఎం హోదాకు సరిపడ పాయింట్లు రావడంతో అతడికి గ్రాండ్ మాస్టర్ హోదా అందించారు. ఈ ఏడాది మార్చిలో గ్రాండ్ మాస్టర్ హోదా కోసం మెన్‌డోన్కా, అతని తండ్రి అంతర్జాతీయ పర్యటన మొదలు పెట్టారు. అయితే కరోనా కారణంగా ప్రయాణాలపై ఆంక్షలు మొదలవడంతో పలు టోర్నీలో పోటీ పడుతూ గడిపారు. మార్చి నుంచి డిసెంబర్ వరకు మెన్‌డోన్కా మొత్తం 16 టోర్నమెంట్లలో పాల్గొని 2544 నుంచి 2452 పాయింట్లకు చేరుకున్నాడు. తాను గ్రాండ్ మాస్టర్ కావడానికి సహకరించిన అందరికీ లియోన్ కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

Next Story