తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై 4,442 కేసులు

by Anukaran |   ( Updated:2020-09-10 11:43:14.0  )
తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై 4,442 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాల్సిన ప్రజాప్రతినిధులే, సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి నేర చరితలు కలిగిన వారే అనే మంది చట్టసభల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా తాజా, మాజీ ప్రతిప్రతినిధులపై 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఉన్న కేసులపై అధ్యయనం జరిపిన అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సరియా సంబంధిత నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచారు. వీరిలో ప్రస్తుతం చట్టసభలో ఉన్న ప్రజాప్రతినిధులపై 2,556 కేసులున్నాయి. యావజ్జీవ ఖైదు శిక్షార్హమైన తీవ్ర నేరాలకు సంబంధించి 413 కేసులున్నాయి. ఇందులోని 174 కేసులలో సిట్టింగ్ ఎంపీలు/ఎమ్మెల్యేలు నిందితులుగా ఉండడం గమనార్హం.

ప్రస్తున్న కేసులున్న ప్రజాప్రతినిధులపై విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ హక్కుల ఉద్యమకారుడు అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో సహాయం చేసేందుకుగానూ సుప్రీంకోర్టు అమికస్‌క్యూరీగా సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సరియాను నియమించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్స్‌ సమర్పించిన సమాచారం ఆధారంగా హన్సరియా ఈ అఫిడవిట్‌ సమర్పించారు. కాగా, పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్లో విచారణలను వేగవంతం చేయాలని సుప్రీం సూచించింది. సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.

ముఖ్యంగా దేశంలో నేర చరితలు కలిగిన నేతలంతా అత్యధికంగా ఉత్తప్రదేశ్‌లోనే ఉన్నారు. మొత్తం 1,217 కేసులుండగా, ఇందులో 446 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. జీవిత ఖైదుకు శిక్షార్హమైన కేసులు 116 ఉన్నట్లు అమికస్‌ క్యూరీ వివరించారు. బీహార్‌లో 531, తమిళనాడు 324, మహారాష్ట్ర 330, ఒడిశా 331, మధ్యప్రదేశ్ 184, ఆంధ్రప్రదేశ్ 106, పశ్చిమ బెంగాల్ 131, కర్ణాటకలో 164 పెండింగ్‌ కేసులున్నాయి.

Advertisement

Next Story

Most Viewed