ప్రగతి భవన్ వద్ద సీఎం వ్యతిరేక నినాదాలు

by Shyam |
ప్రగతి భవన్ వద్ద సీఎం వ్యతిరేక నినాదాలు
X

దిశ, న్యూస్ బ్యూరో: “ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజలను కాపాడు” అనే నినాదంతో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన వామపక్ష కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసంప్రగతి భవన్ వద్ద ఆయనకు వ్యతిరేకంగానే నినాదాలు వినిపించాయి. నగరం నలుమూలల నుంచి ప్రగతి భవన్‌ ముట్టడి కోసం వస్తున్న సీపీఐ, సీపీఐ(ఎం), ఇతర వామపక్షాల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం పీపీఈ కిట్ వేసుకుని ప్రగతి భవన్ దగ్గర చక్కర్లు కొట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ను కూడా అరెస్టు చేశారు. ప్రగతి భవన్‌ను ముట్టడికి వచ్చిన తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండారామ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీకి చెందిన పీవోడబ్ల్యు సంధ్య తదితరులను కూడా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

గంటల తరబడి మంత్రివర్గ సమావేశం నిర్వహించినా.. రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారణపై చర్చించలేదని, ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించిన వామపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో భారీ స్థాయిలో పోలీసులు ప్రగతి భవన్ దగ్గర మోహరించి నిరసనలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కానీ, సీపీఐ కార్యదర్శి నారాయణ మాత్రం పీపీఈ కిట్ వేసుకుని రావడంతో పోలీసులు ఆలస్యంగా తెలుసుకుని అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని గృహనిర్బంధం చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ నేత జూలకంటి రంగారెడ్డి సహా పలువురు వామపక్షాల నేతలను అరెస్టుచేశారు.

Advertisement

Next Story

Most Viewed