నేతలకు సీఎం కేసీఆర్‌ క్లాస్.. వారికే టికెట్లు ఇస్తామని స్ట్రాంగ్ వార్నింగ్

by GSrikanth |
నేతలకు సీఎం కేసీఆర్‌ క్లాస్.. వారికే టికెట్లు ఇస్తామని స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేతలందరికీ సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా.. నేతలంతా హైదరాబాదులోనే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారికే రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఎలా ఆదరణ ఉందని వివరాలు సైతం తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నా.. విమర్శలను తిప్పి కొట్టడంలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో ముందుగా కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి పార్టీ కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ డీసీఎంఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ చైర్మన్‌లకు ఆహ్వానించని పార్టీ

టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్‌లకు ఆహ్వానం పలకలేదు. తొలుత కార్పొరేషన్ చైర్మన్‌లకు సైతం ఆహ్వానిస్తామని సమాచారం ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో వారిని ఆహ్వానించలేదు. సుమారు 50 మంది కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు. వారు సైతం నిత్యం ప్రజల్లో ఉన్నప్పటికీ జనరల్ బాడీ సమావేశానికి మాత్రం దూరంగా ఉంచారు.

Advertisement

Next Story