టీఆర్ఎస్‌కు నల్లగొండలో పెద్ద షాక్

by Anukaran |   ( Updated:2020-08-25 01:01:24.0  )
టీఆర్ఎస్‌కు నల్లగొండలో పెద్ద షాక్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రాజకీయం రంజుగా మారుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ గత కొద్దిరోజులుగా నల్లగొండ జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. మున్సిపాలిటీలోని కో ఆప్షన్ ఎన్నిక మొదలుకొని.. అధికార పార్టీ ఎమ్మెల్యే భూకబ్జా.. కరోనా పేరుతో ఆసుపత్రి సీజ్ వంటి వ్యవహారాలు జిల్లా రాజకీయాలను మార్చాయి. జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల అంశం కంటే ప్రస్తుతం ఈ రాజకీయ అంశం చర్చనీయాంశంగా మారింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భూకబ్జాలకు పాల్పడ్డారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ గా మారింది. అదే సమయంలో చౌటుప్పల్ కో ఆప్షన్ ఎన్నిక విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కేసులు పెట్టడం.. ఆయన ధర్నాకు దిగడం వంటి అంశాలు రాజకీయంగా దుమారాన్ని లేపాయి. అదేసమయంలో తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్ కు సంబంధించిన ఆసుపత్రిని కరోనా వైద్యానికి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వైద్య, పోలీసు అధికారులు సీజ్ చేశారు. అయితే ఇది రాజకీయ కుట్ర కోణంలోనే ఆసుపత్రిని సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనప్పటికీ నల్లగొండ జిల్లా రాజకీయాలు మరోసారి హెటెక్కాయి.

చెరుకు సుధాకర్ ఆస్పత్రి సీజ్.. కుమారుడి అరెస్ట్..

నల్లగొండ పట్టణంలోని తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ కు సంబంధించిన నవ్య ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కొండల్ రావు, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిల నేతృత్వంలో పోలీస్, వైద్య శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో టెస్టులు చేయకుండా రోగులకు బిల్లులు వేస్తున్న విషయాన్ని నిర్ధారించి ఆసుపత్రిని సీజ్ చేశామంటూ తెలిపారు. దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగికి సరైన పరీక్షలు నిర్వహించకుండానే కరోనా పేరుతో బిల్లులు వేసినట్లుగా వచ్చిన ఫిర్యాదుతో స్పందించి వైద్య శాఖ సమన్వయంతో ఆసుపత్రిపై దాడులు నిర్వహించామని వివరించారు. ఆసుపత్రిలో రోగులకు పరీక్షలు నిర్వహించకుండా బిల్లులు వసూలు చేస్తున్నట్లుగా తేలడంతో చెరుకు సుధాకర్ కుమారుడు చెరుకు సుహాస్ ను అరెస్టు చేశారు.

అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ స్పందించారు. రాజకీయ కుట్ర కోణం నేపథ్యంలోనే తమ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందని ఆరోపించారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి చెరుకు సుధాకర్ పోటీ చేస్తారన్న ఊహాగానాలు నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటువంటి సాధింపు చర్యలకు దిగిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే కరోనా సోకిన రోగి చికిత్స పొందుతూ మరణించినా.. వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత దారుణంగా డబ్బు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని తేల్చి చెప్పి ముక్కు పిండి ఆసుపత్రి బిల్లులు వసూలు చేసుకున్నారంటూ ఎంతో మంది ప్రత్యక్షంగా ఫిర్యాదు చేశారు. కానీ ప్రభుత్వం అటువంటి ఆస్పత్రులపై, యాజమాన్యాలపైన గానీ కనీస చర్యలకు ప్రభుత్వం ఏనాడూ ఉపక్రమించ లేదు. కానీ చెరుకు సుధాకర్ ఆసుపత్రిని ఎలాంటి కారణం లేకుండా వైద్య, పోలీసు అధికారులు సీజ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే చిరుమర్తిపై భూకబ్జా ఆరోపణలు..

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా భూకబ్జాలకు పాల్పడ్డారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే లింగయ్య బలవంతంగా ఓ వ్యక్తి నుంచి భూమిని లాక్కొని తన కొడుకు పేరు మీద అక్రమంగా రాయించుకున్నారంటూ వాట్సప్, సోషల్ మీడియా ఫేస్బుక్లో కొంతమంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే కావాలని కొంతమంది తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భూ కబ్జా ఆరోపణలను ఖండించారు. పార్టీ మరినప్పటి నుంచి కొంతమంది బురద జల్లుతున్నారని, టీఆర్ఎస్ అధిష్టానం వద్ద తనకు చెడ్డ పేరు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నార్కట్ పల్లి మండలం మాండ్ర గ్రామంలో సర్వేనెంబర్ 296, 292 నెంబర్లలో పది ఎకరాల 10 గుంటల భూమిని ఎమ్మెల్యే బలవంతంగా ఓ వ్యక్తి నుంచి రాయించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ భూమిని తాను డబ్బులు పెట్టి శ్రీశైలం అనే వ్యక్తి దగ్గర్నుంచి కొనుగోలు చేసినట్టుగా ఎమ్మెల్యే లింగయ్య స్పష్టం చేశారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ న్యూస్ ఛానల్ లో సైతం తాను భూకబ్జాలకు పాల్పడ్డాడంటూ వార్తలు రావడం దారుణమన్నారు. తాను ఇప్పటివరకు ఎలాంటి రౌడీయిజం చేయలేదని, పోలీసులను తన సొంతానికి ఏనాడూ వాడుకోలేదని పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

మునుగోడును హీటెక్కించిన చౌటుప్పల్ మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నిక..

కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉండిపోయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. చౌటుప్పల్ మునిసిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో తన రాజకీయ చతురతను టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. కో ఆప్షన్ ఎన్నిక సమయంలో అనూహ్యంగా టీఆర్ఎస్ కౌన్సిలర్ అంతటి విజయలక్ష్మి కాంగ్రెస్ సభ్యులకు మద్దతు ప్రకటించేలా చేయడంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో అధికార పార్టీకి, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు బాహాబాహీకి దిగారు. నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వార్ నడుస్తోంది. కో ఆప్షన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్ ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాక్కోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి పరువు పోయినంతపనైంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ లో చేర్చుకోవడంతో నియోజకవర్గ వాతావరణం వేడెక్కింది. ఏది ఏమైనప్పటికీ నల్లగొండ జిల్లా ప్రస్తుత రాజకీయాలు సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed