రాజముద్రపై కోవింద్ ‘ముద్ర’!

by Shamantha N |   ( Updated:2020-03-02 08:42:37.0  )
రాజముద్రపై కోవింద్ ‘ముద్ర’!
X

దిశ, వెబ్‌డెస్క్: మోడీ సారథ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు, మోడీ 2.0 ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే రాజముద్ర(ఆమోదం) తెలుపుతున్నట్టు కనబడుతోంది. 17వ లోకసభ ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం రెండు డజన్లు(24) బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కాలంలోని పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్రం బిల్లులు ప్రవేశపెడుతూనే ఉన్నది. మొత్తం 65 బిల్లులను లోకసభ, రాజ్యసభలో ప్రవేశపెట్టినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను రికార్డు వేగంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించి రాజముద్ర వేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్‌లనూ రాష్ట్రపతి రికార్డు వేగంతో తిరస్కరించారు. పవన్ గుప్తా పిటిషన్‌ను నాలుగు రోజుల్లో తిరస్కరించిన కోవింద్, ఇవాళ గంటల వ్యవధిలోనే పవన్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించారు.

ఆర్టికల్ 370 నుంచి మొదలు..

ఆర్టికల్ 370 రద్దు మొదలుకుని ఇవాళ్టి మెర్సీ పిటిషన్ వరకు ఇంతకు ముందెనపుడు ఏ రాష్ట్రపతి చేయని విధంగా కోవింద్ బిల్లులకు ఆమోదముద్ర వేయడం, విచక్షణా అధికారాలను ఉపయోగించి అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరిస్తున్నారు. ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోకసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు కేవలం రెండ్రోజుల్లోనే అంటే ఆగస్టు 7న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద మోద్ర వేశారు. దీనిపై అప్పట్లో దుమారమే రేగింది. చారిత్రక ప్రాధాన్యం, జమ్ము కశ్మీర్ ప్రజల ప్రతిపత్తి అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతి తక్కువ సమయంలో రాష్ట్రపతి బిల్లుకు ఆమోద ముద్ర వేయడం ద్వారా ఆయన రబ్బరుముద్రలా మారారని కొందరు విపక్ష నాయకులు ఆరోపించారు.

ముస్లిం మహిళల కోసం తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రాజ్యసభలో ఆమోదించబడిన నాలుగు రోజుల్లోనే రాజముద్ర వేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్న పౌరసత్వ సవరణ బిల్లుకు కోవింద్ ఒక్క రోజులోనే ఆమోదం తెలిపి చట్టంగా మార్చారు. ఊపా బిల్లుకు సైతం రాజ్యసభలో ఆమోదించబడిన 6 రోజుల్లోనే ఆమోదం తెలిపారు.

సాధారణంగా బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం రాజ్యసభ, లోకసభలో ఆమోదం పొందాలి. ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్తాయి. అక్కడ ఆయన పరిశీలన అనంతరం ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ఆమోదం పొందిన వెంటనే గెజిట్ విడుదల చేస్తారు. తద్వారా అప్పటి వరకు ఉన్న బిల్లు చట్టంగా మారుతుంది. అయితే, మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెనువెంటనే బిల్లులకు రాజముద్ర తెలపడం గమనార్హం.

Tags : president ramnath kovind, indian president, nda govt

Advertisement

Next Story

Most Viewed