గజిబిజి సర్వే.. రికార్డులు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

by Shyam |
గజిబిజి సర్వే.. రికార్డులు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
X

దిశ, తెలంగాణ బ్యూరో :

433/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2,
433/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/3,
18/ఈ/1/1/1/1/1,
18/ఈ/1/1/1/1/2,
29/A6/అ/అ/ఆ..

ఇదేదో ఫజిల్​ కాదు… దృష్టిలోపంతో దవాఖానకు వెళ్తే బోర్డుపై పరీక్షించడానికి ఏర్పాటు చేసిన నెంబర్లు అంతకన్నా కదా.. ముమ్మాటికి ఇవి భూసర్వే నెంబర్లే.. చాంతాడంత పొడుగున్న ఈ నెంబర్లో ఒక్కటి తప్పిన పరిస్థితి అంతే.. అంతా గందరగోళం.. గజిబిజి మేళం.. ఓ చోట ఇంగ్లిష్​, మరో చోట వర్ణమాలతో ఇష్టారీతిన కేటాయింపులు.. ఒక్క సర్వే నెంబర్​కు వందల సంఖ్యలో సబ్​ డివిజన్లు.. ఇవన్నీ ధరణి పోర్టల్​లో ల్యాండ్​ డిటేయిల్స్​ చూస్తే కనిపించిన దృశ్యాలు.. మహబూబాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, నల్లగొండ, మేడ్చల్-మల్కాజిగిరి, నారాయణపేట, మెదక్ జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపించాయి. తరాలు మారడం, పంపకాలు పెరగడం, క్రయ విక్రయాలు అధికమవడం వంటి అంశాలతో లెక్కకు మించిన సబ్ డివిజన్లు అనివార్యంగా మారాయి. సబ్​డివిజన్లు పెరిగే కొద్ది సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి. మొత్తంగా దశాబ్దాలుగా భూ సమగ్ర సర్వే చేపట్టకపోవడంతో రికార్డులు అస్తవ్యస్తంగా మారాయనేది నిర్వివాదంశం.

కంప్యూటర్ ఆపరేటర్ ఒక్క అక్షరం, నెంబరు మిస్టేక్ చేసినా ఇక అంతే. భూ రికార్డుల ప్రక్షాళనలో అలాంటి తప్పిదాల వల్ల పట్టాదారు పాసు పుస్తకాల్లో సర్వే నెంబర్లు మిస్సయినవి, విస్తీర్ణం తక్కువైనవి, సర్వే నెంబర్లు కనిపించడం లేదంటూ పెట్టుకున్న అర్జీలు మూలకు వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం భూ సర్వే చేస్తామంటున్నా ఏ రకమైన సర్వేనో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కానీ దశాబ్దాలుగా క్లారిటీ లేని పంట క్షేత్రాల్లో ఇప్పుడు ఎలా సర్వే చేస్తారనేది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.

ఏ రకమైన సర్వే?

తెలంగాణలో ఏ రకమైన భూ సమగ్ర సర్వే చేస్తారనే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఏ ప్రాతిపదికన సర్వే చేస్తారు.. సర్వేతో అన్ని సమస్యలు తీరుతాయా.. అందరికీ న్యాయం జరుగుతుందా అనే విషయాలే ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరిపే భూ సమగ్ర సర్వే, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించబోయే సర్వే ఒకటే మాదిరిగా ఉండనుందా, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా అనే అంశాలపై న్యాయవాదులు గ్రూపులుగా చర్చలు జరుపుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్ లో భూ చట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్వకేట్లు భూ సర్వేపైన ఆసక్తికరంగా చర్చించుకున్నారు.

ఖాతాల వారీగా కాదు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామం యూనిట్ గా సర్వేను ప్రారంభిస్తున్నది. ఆ రెవెన్యూ గ్రామంలోని మొత్తం విస్తీర్ణానికి సరిహద్దులు గుర్తించి, నెంబర్ల వారీగా సర్వే చేపట్టనున్నట్లు భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొ.ఎం.సునీల్ కుమార్ తెలిపారు. సర్వే నెంబర్ల వారీగా టిప్పన్ల ఉంటాయి. వాటితో సర్వే చేయాలి. కాగా, మ్యాపుల ఆధారంగా సర్వే చేయాలంటే హద్దురాళ్లు ఉండాలి. ఇప్పుడు ఏ గ్రామంలోనూ హద్దు రాళ్లు కనిపించడం లేదు. చాలా సర్వే నెంబర్లకు హద్దులు గుర్తించడమే కష్టం. సబ్ డివిజన్ల వారీగా మ్యాపులు లేవు. ఈ క్రమంలో ఖాతాల వారీగా సర్వే చేయడం ద్వారా వివాదాలు మరిన్ని పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

సర్వేపై చర్చించాలి..

తెలంగాణలో భూ సర్వే చేపట్టక దాదాపు వందేళ్లు. ఒక్కో సర్వే వందలాది సబ్ డివిజన్లుగా మారిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చేపట్టబోయే సర్వే భూ వివాదాలన్నింటికీ శాశ్వత పరిష్కారమయ్యే దిశగా ఉండాలని నిపుణులు, న్యాయవాదులు కోరుతున్నారు. భూమిని కొలిచి కాగితం మీద పెడితే వాస్తవ రూపం దాల్చాలి. మళ్లీ కాగితం పట్టుకొని కొలిస్తే భూమి కూడా సరిపోలాలి. కాగా, పాత పటాలను పట్టుకొని సర్వే చేయడమా.? లేదంటే ఉన్నది ఉన్నట్లుగా కొలిచి ఎవరి భూమికి వారి హద్దులను గుర్తించి ఇవ్వడమా.? అన్నది ప్రభుత్వం తేల్చాల్సి ఉందంటున్నారు.

వందల్లో సబ్ డివిజన్లు..

తెలంగాణలో భూమి విలువ ఎంతో పెరిగింది. ఈ క్రమంలోనే క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అందుకే ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ సర్వే నెంబర్లలో సబ్ డివిజన్లు పెరుగుతూనే ఉన్నాయి. రికార్డుల్లోనైతే పక్కాగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలోనే ఏ మేరకు పక్కాగా హద్దు రాళ్లు ఉన్నాయో సర్వే మొదలు పెడితే తప్ప తెలియదు. ధరణి పోర్టల్ లో ల్యాండ్ డిటెయిల్స్ ఆప్షన్ లోకి వెళ్లి చూస్తే మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం అప్పాజిపల్లిలో, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం అంతారం, శామీర్ పేట మండలం లాల్ గడి మలక్ పేట వంటి ప్రాంతాల్లో లెక్కకు మిక్కిలి సబ్ డివిజన్లు కనిపిస్తున్నాయి. ఒక్కో రెవెన్యూ గ్రామంలో 100 నుంచి 3 వేల వరకు సర్వే నెంబర్లున్నాయి. అవి వందలుగా విభజించబడ్డాయి. ఉదహరణకు నారాయణపేట జిల్లా కోస్గిలో 2093 సర్వే నెంబర్లు ఉండగా, కొన్ని నెంబర్లకు వందలాదిగా సబ్ డివిజన్లు వచ్చాయి. ఇక వాటి హద్దులను అందరిని ఒప్పించి గుర్తించడం ఎంత కష్టమో అంచనా వేయొచ్చు.

Advertisement

Next Story