రిజిస్ట్రేషన్లు ఆగమాగం.. ఆ రెండు శాఖల మధ్య పేచీ

by Anukaran |   ( Updated:2021-04-04 11:13:25.0  )
Land registrations
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ‘ధరణి పోర్టల్’ రాకతో పారదర్శకతకు పెద్ద పీట వేసినట్లేనని ప్రకటించింది. అన్ని సమస్యలకు ఆన్ లైన్ తోనే పరిష్కారమన్నారు. ఐతే సమస్య పరిష్కారానికి 32 రకాల మాడ్యూల్స్ ఇచ్చామని గొప్పగా చెప్పారు. కానీ ఎన్ని రకాల ఆప్షన్లు ఇచ్చినా విభిన్న రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇచ్చిన ఆప్షన్లలో సాఫ్ట్వేర్ కిరికిరి సామాన్యులకు అర్ధం కావడం లేదు. మరోవైపు అపరిష్కృత సమస్యలు మిగిలే ఉంటున్నాయి. కొత్త చిక్కులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పెండింగ్ సేల్ డీడ్లు, రిజిస్ట్రేషన్లకు పరిష్కారం చూపడం లేదు. వివిధ కారణాలతో నిలిచిన రిజిస్ట్రేషన్లకు మోక్షం కలగడం లేదు. కొన్నేమో అధికారులు, సిబ్బంది తప్పిదాలతో ఆగిపోయాయి. మరికొన్ని వివాదాల కారణంతో ఆపేశారు. ఐదు నెలల తర్వాత కూడా వాటి గురించి ఉన్నతాధికారులు దృష్టి పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆదేశాలు వచ్చేనా.. ఇక అంతేనా?

ధరణి పోర్టల్ ఆవిష్కరించిన తర్వాత వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వేలాది మంది ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా రకరకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. కానీ ఈ పెండింగ్ రిజిస్ట్రేషన్లపై ప్రగతి భవన్, సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రావడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఐదు నెలలుగా రిజిస్ట్రేషన్ల విధానంలో విభజన ఏర్పడింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లన్నీ రెవెన్యూ శాఖకే అప్పగించారు. తహశీల్దార్లను జాయింట్ రిజిస్ట్రార్లుగా మార్చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రమే సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించారు. ఐతే అంతకు ముందున్న సమస్యలను అధిగమించకుండానే విభజన చేశారు. కానీ బాధితులు మాత్రం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదంటూ తిప్పి పంపిస్తున్నారు.

సమస్యల పరిష్కారం

రాష్ట్రంలో గతేడాది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పలు కారణాలతో నిలిపేశారు. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సగటున పది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లకు నోచుకోలేదని సమాచారం. సివిల్ వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకం సమర్పించకపోవడం, వెబ్ సైట్ లో వివరాలు లేకపోవడం, పీఓబీలో నమోదై ఉండడం వంటి కారణాలతో సేల్ డీడ్స్ ఆపేశారు. ఐతే చాలా మంది స్టాంపు డ్యూటీ చెల్లించారు. నెలలు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. కొన్ని కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉండడం వల్ల కూడా నిలిపేశారు. ఇప్పుడేమో కొన్నింటికి నిలిపివేతకు సంబంధించిన కారణాలను అధిగమించారు. కానీ సేల్ డీడ్స్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి మార్గం లేకుండాపోయింది. దాంతో క్రయ విక్రయాలపై గందరగోళం నెలకొంది. కొందరు బాధితులు కలెక్టర్ కు పలుమార్లు మొర పెట్టుకున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్ల దగ్గరికి లెక్కలేనన్ని సార్లు తిరిగారు. దాంతో పరిష్కారం కావడం లేదని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మంత్రి కేటీఆర్ లకు ట్విట్టర్ ద్వారా మొర పెట్టుకున్నారు. కనీసం ట్విట్టర్ ద్వారానైనా తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నారు.

బదిలీ చేయొచ్చు

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో పెండింగులోని వ్యవసాయ భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్లను రెవెన్యూ శాఖకు బదిలీ చేయాలి. కానీ ఉన్నతాధికారులు ఈ అంశంపై నేటికీ దృష్టి సారించలేదని కొందరు సబ్ రిజిస్ట్రార్లు చెప్పారు. అంతకు ముందు తమ పరిధిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంది. దాంతో సేల్ డీడ్స్ చేశాం. చిన్న చిన్న కారణాలు రిజిస్ట్రేషన్ కు అడ్డంకిగా మారడం వల్ల నిలపివేశాం. వీళ్లలో చాలా మంది స్టాంపు డ్యూటీ చెల్లించారు. ఐతే నెలలు గడుస్తున్నా ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల కొనుగోలుదార్లు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Next Story