విశాఖలో రియల్ బూమ్‌

by srinivas |   ( Updated:2020-11-24 23:25:04.0  )
విశాఖలో రియల్ బూమ్‌
X

దిశ, విశాఖపట్నం : విశాఖపట్నంలో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖ ఏర్పాటు కాబోతున్న తరుణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. మరో వైపు ప్రభుత్వం ఇటీవలే మార్కెట్‌ విలువను సవరించడం కూడా వ్యాపారులకు కలసి వచ్చింది. విశాఖలోని ఆనందపురం, భీమిలి, కాపులుప్పాడ ప్రాంతాల సమీపంలోనే రాజధాని ఏర్పాటు అవుతుందని ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతంగా పెరిగిపోవడమే కాకుండా గతేడాదితో పోలిస్తే నేడు సెంట్‌ భూమికి 30 శాతం నుంచి 40 శాతం వరకు ధరలు పెరిగాయి. వాస్తవంగా చెప్పాలంటే విశాఖలో భూముల ధరలు, ప్లాట్ల ధరలు ఎప్పడూ అధికంగానే ఉంటాయి.

రాజధాని తరలింపు ప్రకటనతో..
కొద్దికాలంగా ఆర్థిక మందగమనం వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం భారీగా తగ్గింది. అలాగే కరోనా కారణంగా దాని పరిస్థితి మరింత దారుణంగా మారింది. స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో పలు భారీ నిర్మాణాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. పూర్తయిన అపార్ట్‌మెంట్లు కూడా కొనే నాథుడు కనిపించలేదు. దీంతో మార్కెట్‌ విలువ కంటే 5 శాతం తగ్గించి ఇచ్చేందుకు బిల్డర్లు సైతం సిద్ధమయ్యారు. ఇదే సమయంలో రాజధాని తరలింపు ప్రకటన రావడంతో మళ్లీ ధరలకు రెక్కలొచ్చాయి.

ఇదిగో రాజధాని అంటే.. అదిగో రాజధాని ప్రారంభం అంటూ కొంత మంది వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండటంతో కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాకపోయినా రేట్లు మాత్రం ఒక్కసారిగా భారీగా పెంచేశారు. గతంలో మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ చదరపు అడుగులు రూ.3,500 ఉండేది. ఇప్పడు దాని విలువ రూ. 5 వేల నుంచి రూ.6 వేల వరకు పెరిగింది. అలాగే విశాఖలోని కాపాలుప్పడ, ఐటీ సెంటర్‌ ప్రాంతాల్లో గజం రూ.10వేలు నుంచి రూ.15 వేల వరకు పెరిగింది. ఇప్పుడు రాజధాని భవనాలు అక్కడే వస్తాయని ప్రచారం జరగడంతో వాటి విలువ ఒక్కసారిగా గజం రూ.30వేల నుంచి రూ.40వేల వరకు పెరిగింది. అంతేకాదు ఆ రేటు ఇస్తామన్నా ఎవ్వరూ అమ్మడానికి ముందుకు రాకపోవడం విశేషం. అలాగే ఆనందపురం, భీమిలి, భోగాపురం ప్రాంతాల్లో గజం రూ.30 వేల వరకు ఉండేది. అది ఇప్పడు ఏకంగా రూ.50వేలు అని చెబుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నాయకులే అధిక సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడంతో వాటి విలువ మరింత పెరుగుతోంది.

ప్రభుత్వ పెద్దల దృష్టి మొత్తం విశాఖలోనే..
రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దృష్టంతా విశాఖలోనే ఉంది. రిజిస్ట్ట్రేషన్ల శాఖ భూముల ధరలు సవరించిన సమయంలో కూడా రాజధాని కోణంలోనే వ్యవహరించాలని ఆదేశాలు పంపారు. వాస్తవానికి ఏడాదిలో ఒక్కసారి భూముల ధరలను మార్కెట్‌ రేటుకు అనుగణంగా సవరించడం అనవాయితీ. ఇదేక్రమంలో కేవలం విశాఖ నగర పరిధిలోని మూడు మండలాల పరిధిలోనే భూముల ధరలు 10 శాతం పెంచగా వాటిని సమీక్షించిన పార్టీ పెద్దలు, ముఖ్య నాయకులు, అధికారులు 10 శాతం కంటే అధికంగానే భూముల ధరలు పెంచడం విశేషం. ఈ క్రమంలోనే విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కాపులుప్పాడ, పద్మనాభం, ముడసర్లోవ, బక్కన్నపాలెం, ఎండాడ, పరదేశపాలెం ప్రాంతాల్లో భూముల ధరలు 25 నుంచి 40 శాతానికి పెంచారు. అంతేకాకుండా కొన్నిచోట్ల పక్కపక్కనే ఉన్న భూముల విలువలు వేర్వేరుగా ఉన్నాయి. మండలాల సరిహద్దుల కారణంగా ఏర్పడిన ఈ సమస్యను సైతం ఈక్వలైజేషన్‌ పేరుతో భూముల ధరలు పెంచడం విశేషం.

విశాఖ రూరల్‌ ప్రాంతాల్లోనూ భారీగా ధరలు
విశాఖ నగరంతోపాటు, రూరల్‌ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో పలు రియల్‌ ఏస్టేల్‌ సంస్థలు వారి వ్యాపారాలను రూరల్‌ ప్రాంతాలకు సైతం విస్తరించారు. ముఖ్యంగా నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, పాయకరావు పేట, నక్కపల్లి, మాడుగుల ప్రాంతాల్లో అధిక ధరలకు భూ విక్రయాలు జరగడం విశేషం. ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో మైదాన ప్రాంతాల్లోనే నివసించడంతో వారంతా ఈ భూములను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా రాజధాని పేరుతో విశాఖలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం గతంలో కంటే అధిక సంఖ్యలో పెరిగిందని ప్రజలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed