వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.100 కోట్ల జాగా.. రియల్టర్ పాగా

by Shyam |   ( Updated:2021-03-24 00:37:00.0  )
వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.100 కోట్ల జాగా.. రియల్టర్ పాగా
X

అది వనపర్తి జిల్లా కేంద్రం.. ఓ పక్క కలెక్టరేట్, మరో వైపు బస్టాండ్.. అక్కడే రూ. 100 కోట్ల విలువ చేసే 3.20 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైంది. స్థానికంగా ఉన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం నాటి సంస్థానాధీశుల వారసుడు రాజా రామేశ్వరరావు 3.20 ఎకరాల భూమిని 1968లో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. ఆలయాల నిర్వహణ మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే సాగేది. భూమి అమ్మిన వారి వారసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తామే భూమి యజమానులమని, తమకే హక్కులున్నాయని హైకోర్టులో కేసు వేశారు. దీనిపై కేసు నడుస్తూనే ఉంది. ఇదే క్రమంలో రెవెన్యూ అధికారుల నుంచి ఓఆర్సీ పొంది.. ఓ రియల్టర్ కు అందులో 1.08 ఎకరాల భూమిని అమ్మేశారు. కొనుగోలు చేసిన రియల్టర్ వివాదాస్పద 3.20 ఎకరాల్లో ప్రహరీ నిర్మించాడు. వివాదంలో ఉన్న భూమి బదలాయింపు ఎలా జరిగింది. రిజిస్ట్రేషన్ జరగడంతోపాటు పట్టాదారు పాసుపుస్తకం జారీ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: వనపర్తి పట్టణం నడిబొడ్డున గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కొనుగోలు చేసిన స్థలం ఉంది. పక్కనే కలెక్టరేట్, మరో వైపు బస్టాండు.. ప్రస్తుతం చుట్టూ కమర్షియల్ కాంప్లెక్సులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం గజం రూ.లక్షకు పైగా పలుకుతున్నది. అంటే ఇక్కడి 3.20 ఎకరాల భూమి విలువ రూ.100 కోట్ల పైమాటే. ఏకంగా షాపింగ్ మాల్స్ కట్టేయ్యొచ్చు. విక్రయిస్తే రూ.కోట్లల్లో లాభం. అందుకే కొందరు పెద్దలు ఆ భూమిపై కన్నేశారు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి.. స్టే ఉండగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. అదంతా రెండు, మూడు రోజుల్లోనే పూర్తయ్యింది. ఎవరైనా భూమి కొనుగోలు చేసిన తర్వాత పట్టాదారు పాసు పుస్తకం పొందడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. ఇక్కడేమో రెండు, మూడు రోజుల్లోనే ఇచ్చేశారు. రాజకీయ అండదండలు కలిగిన ఒక రియల్టర్ సదరు భూమిలో 0.24 ఎకరాలు, 0.24 ఎకరాల వంతున 1.08 ఎకరాలు వేర్వేరుగా కొనుగోలు చేసినట్లు తెలిసింది. పైగా జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి మరో మూడు రోజుల్లో బదిలీ అవుతారనగా ఈ తతంగం చోటు చేసుకుంన్నదని తెలుస్తున్నది. ఈ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి వెనుక పెద్ద రాజకీయ శక్తులే ఉన్నట్టు సమాచారం. ప్రజాప్రయోజనాల కోసం వినియోగించేందుకు కొనుగోలు చేసిన భూమిపై ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డప్పుడే ప్రజాప్రతినిధులు వారించాలి. వారే తెరవెనుక సూత్రధారులై ఈ తతంగం నడిపిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

రికార్డుల చెప్పిన నిజం

వనపర్తి సంస్థానం భారత్ లో విలీనమైంది. ఆఖరి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు వారు నిర్మించిన ఆలయాలను దేవాదాయ శాఖకు అప్పగించారు. ఆలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రభుత్వం కమిటీని నియమించింది. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కమిటీకి చైర్మన్ గా రామేశ్వర్ రావును నియమించింది. ఈ మేరకు 1964 జూన్ 23న జీవో నం.2184 ను జారీ చేసింది. మూడేండ్లకు గాను ఈ మేరకు నిర్ణయించారు. ఈ ఆలయాల నిర్వహణ, ఉద్యోగుల వేతనాల కోసం రామేశ్వర్ రావు చైర్మన్ షిప్ లోనే వనపర్తి పట్టణంలోనే 3.20 ఎకరాలను గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కొనుగోలు చేసింది. వనపర్తికి చెందిన ఆరె రామారావు, ఆరె నారాయణరావు, అహల్యాబాయిల నుంచి 1968 జనవరి ఐదో తేదీన సర్వే నం.1119 లో 2.36 ఎకరాలు, సర్వే నం.1120 లో 0.24 ఎకరాలను సేల్ డీడ్ ద్వారా కొన్నారు. కొనుగోలుకు ముందే తహసీల్దార్ నుంచి వ్యాల్యూయేషన్ సర్టిఫికెట్ తీసుకున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఆమోదించారు. ఎవరైతే గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కి 3.20 ఎకరాలు విక్రయించారో, వారికి సంస్థానం నుంచి ఇనాంగా సంక్రమించినదే. ఆ తర్వాత స్థలాన్ని ఖాళీగా వదిలేశారు. ఆ భూమిపై తమకూ హక్కులు ఉన్నాయంటూ విక్రయించిన వారి వారసులు, ఇతరులు కేసులు దాఖలు చేశారు. తీర్పులు, అప్పీళ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా హైకోర్టులో కేసులు పెండింగులోనే ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ స్థలాన్ని కాపాడాలని రామేశ్వర్ రావు వారసులు కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. ఆ స్థలాన్ని ప్రజావసరాల కోసమే వినియోగించనున్నట్లు ప్రకటించారు. కానీ పలువురు తమకు హక్కులు ఉన్నాయంటూ పహాణీలు చూపిస్తున్నారు. 24 మంది ఓ వైపు, వనపర్తి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరో వైపు హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.

కేసులు నడుస్తుండగానే..

హైకోర్టులో కేసులు పెండింగులో ఉన్నప్పటికీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అయితే 3.20 ఎకరాల్లో కొనుగోలు చేసింది 1.08 ఎకరాలు మాత్రమే. కానీ మొత్తం స్థలాన్ని కొనుగోలు చేశామంటూ రాత్రికి రాత్రే ప్రహరీని నిర్మించారు. ఎవరైనా ప్రశ్నిస్తే మిగతా స్థలాన్ని కూడా అగ్రిమెంటు చేసుకున్నట్లుగా చెబుతున్నట్లు సమాచారం. కోర్టు కేసులు నడుస్తుంటే ఏ దరఖాస్తు కూడా స్వీకరించని రెవెన్యూ అధికారులు వనపర్తిలో ఖరీదైన స్థలం విషయంలో మాత్రం విభిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దర్యాప్తు చేయాలి

ఈ వివాదంపై జాతీయ బీసీ కమిషన్ కు ఫిర్యాదు వెళ్లింది. స్థలాన్ని కొందరు కొనుగోలు చేశారని, దానికి అదే రోజున పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేశారు. రాష్ట్రంలో అదే రోజు పట్టాదారు పాసు పుస్తకం అందిన దాఖలాలు లేవని బీసీ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా అడిగితే వారిపై కేసులు నమోదు చేయించి, భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పైగా కొనుగోలు చేసిన స్థలం 1.08 ఎకరాలైతే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలాన్ని కాపాడితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు ఉపాధి కలిగే అవకాశముందని వివరించారు. సమగ్ర విచారణ చేస్తే తెర వెనుక ఉన్న వ్యక్తుల గురించి తెలుస్తుందన్నారు. దానికి బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి స్పందిస్తూ వెంటనే విచారణ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని వనపర్తి తహసీల్దార్, దేవాదాయ శాఖ ఈవోను కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా ఆదేశించారు. నెలరోజులు కావస్తున్నా ఎలాంటి స్పందన లభించలేదు.

సంస్థానాధీశుల వాదన

స్థానికులకు మాత్రం ఇప్పటికీ రాజా వారికి, ప్రైవేటు వ్యక్తులకు జరుగుతున్న వివాదంగానే ప్రచారంలో ఉంది. నిజానికి వనపర్తి సంస్థానాధీశుడి వారసుడు కృష్ణదేవరావు మాత్రం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కమిటీ కిందనే పోరాడుతున్నట్టు చెబుతున్నారు. పైగా హక్కులు లభిస్తే ప్రజాప్రయోజనాల కోసమే వినియోగించనున్నట్టు ప్రకటించినట్లు తెలిసింది. తమ సంస్థానం భారత్ లో విలీనమైనప్పుడే అనేక భూములు(ఇప్పుడు రూ.వేల కోట్ల విలువైన) ఇచ్చామంటున్నారు. ఈ స్థలం తన స్వార్ధానికి మాత్రం కాదని కృష్ణదేవరావు తనను కలిసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు చెప్పారు. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్సులు, ఫంక్షన్ హాళ్లు నిర్మించడం ద్వారా ఉపాధి లభిస్తుందన్నారు. వనపర్తి సంస్థానాధీశులు ప్రజావసరాల కోసం భూములు, భవనాలు ఇచ్చారు. సంస్థానం పరిధిలోని 14 ఆలయాల నిర్వహణకు వందలాది ఎకరాలు ఉన్నాయి. ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు, పాలిటెక్నిక్ కళాశాల కోసం రాజావారి ప్యాలెస్, సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు స్థలాలు ఇచ్చారు. అలాగే వాసుదేవమ్మ షాపింగ్ కాంప్లెక్సును నిర్మించి అతి తక్కువ కిరాయికి స్థానికులకు ఇచ్చారు.

కోర్టులో నడుస్తుంది: సత్యచంద్రారెడ్డి, ఈఓ, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, వనపర్తి

వనపర్తి కలెక్టరేట్​ పక్కనున్న స్థలం గ్రూప్​ఆఫ్​టెంపుల్స్​ల్యాండే. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయినా రిజిస్ట్రేషన్లు చేశారు. మేం కేసు వేస్తే స్టే వచ్చింది. ఎవరూ ఎలాంటి పనులు చేపట్టొద్దు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. కౌలుదారుల్లో కొందరు తమకూ హక్కులు ఉన్నాయని కేసులు వేశారు. అందుకే వివాదాస్పదమైంది.

Advertisement

Next Story

Most Viewed