చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడే ఏపీకి హోదా కనుమరుగైంది.. వైసీపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by srinivas |
kannababu
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని.. వైసీపీ సిద్ధమా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌పై మంత్రి కురసాల కన్నబాబు ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలని గతంలో చంద్రబాబు అడిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘ఎంపీల రాజీనామాపై మాట్లాడుతున్న చంద్రబాబు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌.. వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించినప్పుడు ఎందుకు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీ ప్రభుత్వానికి అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసిన విషయం ప్రజలకు తెలుసునంటూ సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా వద్దని నాడు చెప్పిన చంద్రబాబు నేడు ప్రభుత్వానికి సుద్దులు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు వల్లే హోదా కనుమరుగు..

టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి వల్లే ప్రత్యేక హోదా కనుమరుగైందని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నాడే ప్రత్యేక హోదా అటకెక్కిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటీఎస్‌ ద్వారా పేదలకు హక్కు కల్పిస్తుంటే చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న చంద్రబాబు తన హయాంలో గోదావరి ఎరువుల ప్లాంట్‌ను అమ్మేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను విక్రయిస్తామన్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంపై ధ్వజమెత్తారు.

నాడు పోలవరం ప్రాజెక్టును వైఎస్‌ ప్రారంభిస్తే నేడు ఆయన కుమారుడు జగన్‌ దానిని పూర్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1.30లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. ఈ విషయాన్ని మరచిపోయి నిరుద్యోగం ప్రబలిపోయిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో 5శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు చంద్రబాబుకు అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి కన్నబాబు విమర్శించారు.

జగన్‌ను గద్దె దించేందుకు కుట్ర..

ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ కుట్రలు చేస్తోందని.. తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మంత్రి కన్నబాబు ఆరోపించారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో రూ.వందల కోట్లు పక్కదారి పట్టించేలా షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు దాన్ని డైవర్ట్ చేసేందుకు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అమరావతి కోసం ఊరేగింపులు, బంద్‌లు తమ బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడానికే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

Advertisement

Next Story