రంగంలోకి రామన్న.. రాజీ కుదిరేనా..?

by Anukaran |   ( Updated:2021-01-21 13:02:56.0  )
రంగంలోకి రామన్న.. రాజీ కుదిరేనా..?
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో టీఆర్ఎస్ నేతల అంతర్గత విభేదాలతో అధిష్ఠానం తల పట్టుకుంది. ఓ వైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో జిల్లా పార్టీ సీనియర్లు ఇలా వ్యవహరించడం పార్టీ పెద్దలకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ కూడా చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. గతంలోనే యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా నేతల్లో ఉన్న విభేదాలను తొలగించేందుకు ప్రయత్నాలూ చేశారు. ముగ్గురు నేతలను కలిసి పనిచేయాలని రాజీ కుదిర్చారు. ఇప్పుడు మళ్లీ వర్గవిభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో గురువారం ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్ లో పార్టీ పెద్దలు సమావేశం ఏర్పరచడంతో ఏం జరిగిందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మళ్లీ రచ్చకెక్కిన విభేదాలు

మంత్రి కేటీఆర్ మంత్రాంగం తర్వాత నేతల్లో సయోధ్య కుదిరినట్లే అని అందరూ అనుకున్నా ఇటీవల పొంగులేటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత మంత్రి పువ్వాడ, ఎంపీ నామా మాజీ మంత్రి తుమ్మలతో భేటీ కావడం విషయం పార్టీ పెద్దలకు వద్దకు పోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జిల్లా నేతలకు హైదరాబాద్ రావాల్సిందిగా కబురు పంపిన విషయమూ తెలిసిందే. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సమావేశం జరిగింది. పేరుకు అఫీషియల్ మీటింగ్ అయినా జిల్లాలోని నేతల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, గ్రూపులు కట్టడం పార్టీ పరిస్థితి తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

జిల్లాలో మూడు ముక్కలాట

సంచలనాలకు ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ వేదికవుతోంది. జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురూ మూడు పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. ముగ్గురూ మంచి పట్టున్న నేతలే.. ఎవరి వర్గాలు వారికున్నాయి. ముగ్గురికీ ఒకరంటే ఒకరికి పడదు. ముగ్గురూ ఒకే ‘కారు’లో ప్రయాణించాల్సింది పోయి ఎవరిదారిలో వారు పోతున్నారని దీంతో జిల్లాలో రగడ మొదలైందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

తీరు మార్చుకోవాలని సూచన

ప్రగతి భవన్లో ఉమ్మడి ఖమ్మం లీడర్లతో గురువారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం లీడర్లకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఎమ్మెల్యేల తీరు దురుసుగా వుందని, పాత, కొత్త అందరినీ కలుపుకు పోవాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీలో నాయకులంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలన్నట్లు సమాచారం. పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి అని కేవలం ఖమ్మానికే అనుకోవద్దని సుతిమెత్తగా క్లాస్ పీకినట్లు సమాచారం. సమావేశంలో పొంగులేటి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ సమర్థించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఎవరినీ తక్కువ చేసి చూడొద్దని, పార్టీకి అందరూ ముఖ్యమే అని, అందరినీ కలుపుకు పోవాలని సూచించినట్లు సమాచారం. ఇక నియాజకవర్గాల వారీగా అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్కు అందించారు.

కొందరు నేతల పెదవి విరుపు

గురువారం ప్రగతి భవన్ లో కేటీఆర్ తో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మొత్తం 40 మందికి ఆహ్వానం అందింది. కొందరు మాత్రం ఇన్నాళ్లూ తమను పట్టించుకోని పార్టీ పెద్దలు ఇప్పుడు మీటింగుల పేరుతో ఆహ్వానించడంపై పెదవి విరుస్తున్నారు. తమ అవసరం ఇప్పుడు వచ్చిందా? అంటూ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇన్నాళ్లకైనా తామున్నామని గుర్తించినందుకు సంతోషిస్తున్నామన్నట్టు సమాచారం.

Advertisement

Next Story