‘ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకెళ్లే బాధ్యత మీదే‘

by Shyam |
‘ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకెళ్లే బాధ్యత మీదే‘
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓటర్లుగా లక్షన్నరకు పైగా గ్రాడ్యుయేట్స్‌ను టీఆర్ఎస్ శ్రేణులు ఎన్‌రోల్‌మెంట్ చేయించారని, వారిని పోలింగ్ బూత్‌ల వరకు తీసుకెళ్లే బాధ్యత ఆయా ఇన్‌చార్జ్‌లదేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జులతో బంజారాహిల్స్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణతో పాటు యావత్ దక్షణాది రాష్ట్రాలకు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుల రద్దుపై బీజేపీ అభ్యర్థులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐటీ దిగుమతులను 55వేల కోట్ల నుంచి లక్షా 45వేల కోట్లకు పెంచామన్నారు. ఫలితంగా తెలంగాణ యువతకు లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీజేపీ ద్వంద విధానాల్ని ఎండగట్టాలన్నారు. ప్రతీ కార్యకర్తా 50 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను ఖచ్చితంగా కలవాలన్నారు. వారి సమస్యలపై మన అభ్యర్థి గళం వినిపిస్తారని చెప్పాలని సూచించారు. ఎన్నోరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు ఊతమివ్వాల్సింది పోయి ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు మెదలు ఖాజీపేట వ్యాగన్ ప్యాక్టరీ రద్దు వరకూ బీజేపీ చేస్తున్న కుతంత్రాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story