కేంద్ర మంత్రితో కేటీఆర్, గంగుల భేటీ.. ఆ హామీలపై కీలక చర్చ

by Anukaran |
KTR Gangula
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైతాంగానికి అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీలో బుధవారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కేంద్ర ఇండస్ట్రీ అండ్ కామర్స్, టెక్స్ టైల్స్, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. తమ తమ శాఖల పరిధిలోని వివిధ అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సప్లై, పాడి ప్రొక్యూర్మెంట్ పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు.

ఈ యాసంగిలో పార్ బాయిల్డ్ రైస్ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్‌సీఐ తీసుకోవాల్సిన ఆవశ్యకత, గతంలో 2019-20 రబీలో నష్టపోయిన 30 రోజుల్ని భర్తీ చేసి మిగిలిన బియ్యాన్ని అందజేసేందుకు మరో 30 రోజుల గడువు పెంచాలని, రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఇచ్చిన హామీకు కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ దఫా రాష్ట్రంలో 55 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగైందని, అంతే స్థాయిలో 92.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ యాసంగిలో సేకరించామన్నారు. ఇందులో 62.82 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అందజేసేందుకు మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ దశలో ఎఫ్‌సీఐ కేవలం 24.57 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ మాత్రమే తెలంగాణ నుంచి తీసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని గంగుల వివరించారు.

ఈ సమస్యను అధిగమించేందుకు ఈ యాసంగిలో ఎఫ్‌సీఐకు 80 నుంచి 90 శాతం పార్ బాయిల్డ్ రైస్ ఇవ్వడానికి అనుమతించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఫిబ్రవరి నుంచి మే వరకూ తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలతో యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని రారైస్‌గా మిల్లింగ్ చేస్తే ధాన్యం విరిగిపోతుందని ఈ సమస్యను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 2011-‌12 నుంచి 2019‌-20 రబీ సీజన్లో పార్ బాయిల్డ్ రైస్ ను 92.70 శాతం వరకు తీసుకున్న విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. అదే విధంగా ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్‌ని 12.82 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నష్టపోయిన 30 రోజుల మిల్లింగ్ సమయాన్ని కేంద్రం భర్తీ చేయాలని కోరారు.

2019-‌20 సీజన్లో ఎఫ్‌సీఐ వెరిఫికేషన్ కోసం మిల్లింగ్‌ను దాదాపు నెలరోజుల పాటు ఆపడంతో రూ.300కోట్ల విలువైన లక్ష మెట్రిక్ టన్నులను గడువు ముగిసిందని తీసుకోలేదని సహృదయంతో తీసుకోవాలని కోరారు. కరోనా సంక్షోభంలోనూ రైతుల ప్రయోజనం దృష్ట్యా దేశం మొత్తం సేకరించిన 119 లక్షల మెట్రిక్ టన్నుల్లో కేవలం తెలంగాణే 54 శాతం 64.17 లక్షల మెట్రిక్ టన్నుల్ని అందజేసిందన్నారు.

2018-19లో 37 లక్షల మెట్రిక్ టన్నులకే 2020 ఏప్రిల్ 30 వరకు సీఎంఆర్ గడువు ఇచ్చిన ఎఫ్‌సీఐ, 2019-20లో 64.17 లక్షల మెట్రిక్ టన్నులకు కేవలం మార్చి 31 వరకే గడువు ఇచ్చారని ఇందులో సైతం 22 రోజులు ఎఫ్‌సీఐ పాడి స్టాక్ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియతో మిల్లింగ్ నిలిచిపోయిందన్నారు. తెలంగాణలోని సన్న చిన్న కారు రైతులకు మరో 300 కోట్లు నష్టపోకుండా లక్ష మెట్రిక్ టన్నుల బాలెన్స్ బియ్యాన్ని అందజేయడానికి 30 రోజుల సమయం ఉపయోగపడుతుందన్నారు.

రాబోయే 2020‌-21 వానాకాలం ధాన్యం సేకరణను 60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని గంగుల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రొత్సహించినా ఇంకా 55 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని, తద్వారా 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలున్నాయన్నారు. తెలంగాణలోని చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని 2021-22 ఖరీఫ్ సీజన్లో రాష్ర్టంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి గంగుల సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి కేంద్ర మంత్రికి అందజేయాల్సిన రిపోర్టులను గణాంకాలతో సహా కేంద్ర మంత్రికి అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed