- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగులాంబతో సహా ప్రాజెక్టుల వివరాలివ్వండి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల జల వివాదాలు, బోర్డు పరిధి ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు దూకుడు పెంచింది. ఇప్పటికే గోదావరి బోర్డు కూడా తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాలన్నీ అడిగింది. తాజాగా సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు… రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌పై నిర్మించిన, నిర్మాణ చేపట్టుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలన్నీ అడిగింది. అంతేకాకుండా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించి, సర్వే కోసం జీవో జారీ చేసిన జోగులాంబ బ్యారేజీ వివరాలను సైతం ముందుగానే సమర్పించాలని సూచించింది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో కేంద్రం బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాశాయి. ఈ నెల 20 తెలంగాణ ప్రభుత్వం కూడా సుదీర్ఘమైన లేఖ పంపింది. ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేయగా.. ప్రస్తుతం తమ వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని లేఖలు రాస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబికి రాసిన లేఖలో వాటాల ప్రస్తావనే వివాదాస్పదంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగానే కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ తరుపున ప్రభుత్వానికి లేఖ పంపించారు. సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని, గతంలో నిర్మించిన వాటి వివరాలు, ఇప్పుడు నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులతో పాటుగా నిర్మించతలపెట్టిన వాటి వివరాలను సైతం అడిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల అంశంలో బోర్డులు దూకుడు పెంచినట్లు మారింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి 37 మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, వాటి వివరాలన్నీ పంపించాలని సూచించారు.
లేఖల పంచాయతీ
కేంద్రం గెజిట్ నేపథ్యంలోనూ రెండు రాష్ట్రాలు లేఖలతో నీటివాటాపై బోర్డును ప్రశ్నించాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 863.70అడుగుల నీటిమట్టం దాటడంతో ఏపీ ఇటీవల శ్రీశైలం జలాశయం నుంచి 27 టీఎంసీలను వినియోగించుకునేందుకు బోర్డును అనుమతి కోరింది. ఈ నీటిలో చెన్నై నగర తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు, తెలుగుగంగ కాలువకు 7 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టుకాలువ పథకం, గాలేరు నగరి పథకానికి కలిపి 8, హంద్రీనీవా పథకానికి 7, కర్నూలు-కడప కాలువకు 2 టీఎంసీలు అవసరం అంటూ కృష్ణా రివర్ బోర్డుకు వివరించింది.
కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-2 ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే వరకు 2021-22 నీటి సంవత్సరం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పద్ధతిలో నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 20న కోరింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, ఉమ్మడి ప్రాజెక్టులకు నిర్వహణ మార్గదర్శకాలు లేనందున అడ్‌హాక్ పద్ధతిలో ఏ ఏడాదికి ఆ ఏడాది నీటివినియోగానికి కేటాయింపులు జరుగుతున్నాయని పేర్కొంది.
12వ బోర్డు సమావేశంలో 2020-21వ సంవత్సరానికి చిన్ననీటి వనరులు, గోదావరి నుంచి మళ్లించే నీటిని మినహాయించి తెలంగాణ 34 శాతం, ఆంధ్రప్రదేశ్ 66 శాతం వినియోగించుకొనేలా అంగీకారం కుదిరిందని, పరీవాహక ప్రాంతం, జనాభా, కరవు ప్రాంతం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే తెలంగాణకు 70.8, ఏపీకి 29.2శాతం నీటి వాటా రావాల్సి ఉందంటూ పేర్కొంది. 1976లో మొదటి ట్రైబ్యునల్, 2013లో రెండో ట్రైబ్యునల్ కూడా పక్క బేసిన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాయని గుర్తు చేసింది. విచారణలో ఉన్న కృష్ణాజల వివాద ట్రైబ్యునల్-2 ముందు తెలంగాణ 771 టీఎంసీలు తమ అవసరంగా పేర్కొందని తెలిపింది.
ఆమోదం పొందని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 4.7 టీఎంసీలను మళ్లించడంతో పాటు పెన్నా బేసిన్‌లో 300 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం ఉందని, అదే తెలంగాణకు రోజుకు 0.28 టీఎంసీ, అదీ ఎత్తిపోతల ద్వారానే ఆ అవకాశం లభిస్తుందని వివరించింది. పక్క బేసిన్‌లకు నీటి మళ్లింపుపై కృష్ణాబోర్డుకు, జల్‌శక్తి మంత్రిత్వశాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం విచారణలో ఉన్న ట్రైబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు, 2021-22వ సంవత్సరంలో 50 శాతం చొప్పున నీటిని కేటాయించాలని కోరుతున్నామంటూ లేఖలో తెలిపింది.